Begin typing your search above and press return to search.

ఇప్పటానికి మరోసారి పవన్.. ఈసారేం జరగనుంది?

By:  Tupaki Desk   |   23 Nov 2022 4:02 AM GMT
ఇప్పటానికి మరోసారి పవన్.. ఈసారేం జరగనుంది?
X
ఏపీలో రాజకీయ జోరు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పొలిటికల్ యాక్టివిటీని ఒక్కసారిగా పెంచేయటంతో పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఇష్యూస్ ను టేకప్ చేస్తున్న ఆయన తీరు ఏపీ అధికారపక్షంలో కొత్త అలజడిని గురి చేస్తోంది. ఈ కారణంతోనే..

పవన్ మీద పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తున్నారు వైసీపీ నేతలు. తమ పార్టీ ప్లీనరీని నిర్వహించేందుకు భూములు ఇచ్చిన ఇప్పటం గ్రామానికి చెందిన రైతుల ఆస్తుల్ని ఏపీ అధికార పార్టీ టార్గెట్ చేసిందని.. వారికి చెందిన ఇళ్లను.. షాపులను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేసినట్లుగా పవన్ పేర్కొనటం.. అందులో భాగంగా వారిని ఓదార్చేందుకు పవన్ ఇప్పటం గ్రామానికి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు.. పవన్ ను ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసిన వైనం.. ఏపీలో హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. బాధితుల పక్షాన పవన్ తన పర్యటనను చేపడితే.. అదే బాధితుల్లో కొందరి చేత.. తమకేం జరగలేదని.. తమ ఇళ్లను కూల్చలేదని..

అక్రమ కట్టడాల్ని తొలగించారని చెప్పటమే ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఆస్తులు నష్టపోయిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తానని పవన్ పేర్కొనటం ఒక ఎత్తు అయితే.. తమకు పవన్ ఇచ్చే పరిహారం అక్కర్లేదంటూ కొందరు తమ ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టిన వైనం.. దానికి సోషల్ మీడియాలో ఏపీ అధికారపక్షం జరిపిన ప్రచారం మరో ఎత్తుగా చెప్పాలి.

రోడ్ల విస్తరణ కార్యక్రమం ఇప్పుడు మొదలు పెట్టింది కాదని.. ఎప్పటి నుంచో ప్రణాళిక ఉందని వైసీపీ చెబుతుంటే.. బస్సు కూడా రాని ఇప్పటం గ్రామానికి వంద అడుగుల రోడ్డుతో అవసరం ఏమిటి? అన్న ప్రశ్నను జనసేన ప్రశ్నిస్తోంది. తాను చెప్పినట్లుగా బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ఈ నెల 27న ఇప్పటం గ్రామానికి వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.

ఒకవేళ పోలీసుల ఆంక్షలు ఉన్న పక్షంలో బాధితులను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి అందించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటం గ్రామానికి మరోసారి పవన్ వెళితే మాత్రం పరిస్థితుల్లో మార్పు రావటంతో పాటు.. ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి భిన్నమైన అంశాలు బయటకు వచ్చే వీలుందంటున్నారు. మరి.. పవన్ వెళతారా? లేదా? అన్నది రానున్న రెండు..మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.