Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్.. రాజకీయంగా ఆ పని చేస్తారా?

By:  Tupaki Desk   |   29 May 2019 2:30 PM GMT
పవన్ కల్యాణ్.. రాజకీయంగా ఆ పని చేస్తారా?
X
కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు పవన్ కల్యాణ్. ఈ విషయంలో చిరంజీవే చాలా బెటర్. రెండు చోట్ల పోటీ చేసి చిరంజీవి కనీసం ఒక్క చోట అయినా ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే పవన్ కల్యాణ్ రెండు చోట్లా పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. అతి కూడా ప్రత్యర్థులకు భారీ మెజారిటీని ఇచ్చి పవన్ ఓటమి పాలయ్యారు. ఇలా పవన్ కల్యాణ్ చూపించిన 'జనసేన' సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

పవన్ కల్యాణ్ తదుపరి ఏం చేయబోతున్నారు? అనేది ఒక రకమైన చర్చ. పవన్ రాజకీయం ప్రజలకు అయితే పట్టలేదు. ఇకపై కూడా పవన్ మీద ప్రజల్లో ఏ మేరకు ఆసక్తి ఉంటుందో చెప్పలేని పరిస్థితే ఉందిప్పుడు. పవన్ ను జనాలు సీరియస్ ప్లేయర్ గా పరిగణించలేదు. ఆఖరికి కాపుల్లో కూడా పవన్ మీద పెద్ద ఆసక్తి కనిపించలేదు. అందుకు పవన్ ఎమ్మెల్యేగా ఓడిపోవడమే రుజువు. కాపుల జనాభా గట్టిగా ఉన్న చోట పోటీ చేసి పవన్ ఓడిపోయాడంటే.. స్వకులంలోనే పవన్ మీద ఏ మేరకు ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.

పవన్ ఎన్నికల ప్రచారంలో చాలా గట్టిగా మాట్లాడారు. అరుపులు - కేకలతో పవన్ ప్రచారం సాగింది. ఆ ప్రచారం సాగిన తీరుకు - పవన్ కు వచ్చిన సీట్లకూ ఏ మాత్రం సంబంధం లేదు! ఇలాంటి నేఫథ్యంలో జనసేన మనుగడ ఎలా? తదుపరి జనసేన ప్రస్థానం ఎలా ఉండబోతోంది? అనేది ఆసక్తిదాయకంగా మారింది. రాజకీయ పరిశీలకులు అయినా ఈ అంశం గురించి చర్చిస్తూ ఉన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ తన పార్టీని నడపడం కష్టమనే అభిప్రాయాలే వినిపిస్తూ ఉన్నాయి. గత ఐదేళ్లలోనే పవన్ అత్యంత పేలవమైన రీతిలో పార్టీని నడిపారు. ప్రశ్నించడానికే పార్టీ అని ప్రకటించి - సినిమాలు చేస్తూ ఉండిపోయారు. ఆ సినిమాలూ అంతగా ఆడలేదు. ప్రశ్నించిందీ లేదు. దీంతో పర్యవసనాలను ఎదుర్కొనాల్సి వచ్చింది.

ఇక నుంచి తన పార్టీని నడపడం పవన్ కల్యాణ్ కు మరింత కష్టం అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ చిత్తు అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే జనసేన మరింతగా ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది.

మరి మనుగడ కోసం పవన్ కల్యాణ్ ఏం చేయాలి అంటే.. బీజేపీలోకి చేరతారేమో అనే విశ్లేషణలు మొదలయ్యాయప్పుడే. ఏపీలో బీజేపీలో రాజకీయ శూన్యత ఉంది. కేంద్రంలో అధికారం ఉన్నా ఆ పార్టీకి ఏపీ లో బేస్ మెంట్ లేదు. ఇక పవన్ కల్యాణ్ కూ ప్రాంతీయ పార్టీ నడపడం తేలిక కాదు. అందుకే ఆయన బీజేపీలోకి చేరిపోయి రాజకీయంగా ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేయవచ్చని పరిశీలకులు అంటున్నారు. అలా చేస్తే పవన్ కు రాజకీయ భవితవ్యం ఉండవచ్చునేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే పైకి అయితే అది బాగానే కనిపిస్తోంది కానీ.. పవన్ కల్యాణ్ వెళ్లి బీజేపీలోకి చేరితే అప్పుడు మరిన్ని విమర్శలను ఎదుర్కొనాల్సి రావొచ్చు. అన్న చిరంజీవి ప్రజారాజ్యంపార్టీని కాంగ్రెస్ లోకి కలిపితే - తమ్ముడు బీజేపీలోకి చేరాడు.. అనే విమర్శ రానే వస్తుంది. ఏపీలో బీజేపీకి అంటూ ఎలాంటి క్యాడర్ కూడా లేదు. తెలుగుదేశం పార్టీ చిత్తు అయిన నేఫథ్యంలో ఏపీ బలపడాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవడానికి సమాయత్తం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ ను కూడా కలుపుకుపోవాలని బీజేపీ భావించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.