Begin typing your search above and press return to search.

ఆంధ్రా కుమారస్వామికి.. ఆ అవకాశం లేనట్టేనా!

By:  Tupaki Desk   |   14 May 2019 5:35 AM GMT
ఆంధ్రా కుమారస్వామికి.. ఆ అవకాశం లేనట్టేనా!
X
సరిగ్గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పరిణామాల అనంతరం పవన్ కల్యాణ్ రాజకీయం ఊపందుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ తరహాగా ఉండటం. అనూహ్యంగా కుమారస్వామి ముఖ్యమంత్రి అయిపోవడం జరిగింది. త్రిముఖ పోరులో కుమారస్వామి పార్టీ సాధించింది తక్కువ సీట్లే. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే కొన్ని సీట్లను కూడా కోల్పోయింది. అయినా కుమారస్వామికి సీఎం ఛాన్స్ దక్కింది!

బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ మెజారిటీకి చాలా దూరంలో నిలవడంతో.. జాక్ పాట్ గా కుమారస్వామి సీఎం అయిపోయారు. ఆ లెక్కతోనే పవన్ కల్యాణ్ కూడా రాజకీయంగా యాక్టివేట్ అయ్యాడని విశ్లేషకులు అంటున్నారు. తన పార్టీ కూడా ఏపీలో సోలోగా పోటీ చేస్తే.. త్రిముఖ పోరులో తనకు కూడా సీఎం అవకాశం వస్తుందనే భావనతో పవన్ కల్యాణ్ పొలిటికల్ యాక్టివిటీస్ ను పెంచాడని అంటారు.

మొత్తానికి పవన్ కల్యాణ్ కమ్యూనిస్టు పార్టీలు - బీఎస్పీలను కలుపుకుని ఏపీ ఎన్నికలను త్రిముఖ పోరుగా మార్చాడు. మరి ఇప్పుడు ఇంతకీ ఈ సినిమా హీరో ఆంధ్రా కుమారస్వామి అయినట్టేనా? అనే అంశం గురించి విశ్లేషణలు సాగుతూ ఉన్నాయి.

ఏపీ ప్రజలు హంగ్ తరహా తీర్పు ఇచ్చే అవకాశమే లేదు .. అనేది ఎన్నికల ముందు వినిపించిన మాట - ఇప్పుడు కూడా అదే విశ్లేషణే వినిపిస్తూ ఉండటం విశేషం. ఏపీలో ఈ సారి కూడా హంగ్ కు అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. పోస్ట్ పోల్ ఎనాలిసిస్ లో భాగంగా విశ్లేషిస్తున్న వారిలో.. ఏపీలో ఎవరు గెలిచినా పూర్తి మెజారిటీని సంపాదిస్తారని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికైనా సీట్లు తక్కువ రావడం - మెజారిటీకి దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోవడం.. వంటివి ఉండవని.. జాక్ పాట్ ముఖ్యమంత్రులకు - హంగ్ కు ఏపీలో అవకాశం లేదనే విశ్లేషణలే వినిపిస్తూ ఉన్నాయి. పవన్ కల్యాణ్ కానీ - ఆయన వీరాభిమానులు కానీ అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకుని ఉంటే.. వాటిని పెంచుకోకపోవడమే మేలనే విశ్లేషణలు సాగుతున్నాయిప్పుడు. ఇలా ఏపీ ఎన్నికల ఫలితాలు చాలా క్లియర్ కట్ గా ఉండబోతున్నాయనే అభిప్రాయాలే గట్టిగా వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో మరో కుమారస్వామికి ఛాన్స్ లేదని అంటున్నారు.