Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కు ఆ ఇద్ద‌రితో బ్రేక‌ప్ అయ్యింది...

By:  Tupaki Desk   |   4 Aug 2019 11:51 AM GMT
ప‌వ‌న్‌ కు ఆ ఇద్ద‌రితో బ్రేక‌ప్ అయ్యింది...
X
స‌మైక్య రాష్ట్రంలో క‌మ్యూనిస్టు పార్టీలు నాడు బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఎడ‌తెగ‌ని పోరాటం చేశాయి. ఈ పార్టీల సిద్ధాంతాల‌కు ఆక‌ర్షితులైన ఎంతో మంది మ‌హామ‌హాలు క‌మ్యూనిస్టు ఉద్య‌మాల్లో పాల్గొన్నారు. ఇక ఇటీవ‌ల ఆ పార్టీల సిద్ధాంతాల యువ‌త‌ను ఆక‌ర్షించ‌క‌పోవ‌డంతో క‌మ్యూనిస్టు పార్టీలో చేరేందుకు ఈ త‌రం జ‌న‌రేష‌న్ వాళ్లు ఎవ్వ‌రూ సాహ‌సించ‌డం లేదు. ఇక నాలుగు ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌ పై ఎడ‌తెగ‌ని పోరాటం చేసిన క‌మ్యూనిస్టులు 1983లో ఎన్టీఆర్‌ తో పొత్తు పెట్టుకుని ఓ వెలుగు వెలిగారు. తొలిసారి చ‌ట్ట‌స‌భ‌ల్లో అధికార ప‌క్షంగా ఉన్నారు. ఆ త‌ర్వాత 2004లో కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుని పున‌ర్వైభ‌వం చాటుకున్నారు.

2004 ఎన్నిక‌ల్లో చాలా రోజుల త‌ర్వాత అధికార ప‌క్షంలో ఉన్న క‌మ్యూనిస్టుల‌కు అప్ప‌టి నుంచి ప‌త‌న‌ద‌శ మొద‌లైంది. 2009 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఆంధ్రా శాస‌న‌స‌భ‌లో సీపీఎం ఒక సీటుకు - సీపీఐ నాలుగు సీట్ల‌కు ప‌రిమితం అయ్యాయి. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ అసెంబ్లీలో ఈ రెండు పార్టీలు చెరో సీటుతో త‌మ ప‌రువు నిలుపుకున్నా ఏపీలో అస‌లు ఈ పార్టీల గురించి మాట్లాడుకునే వారే క‌రువ‌య్యారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పెట్టుకున్నారు.

ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లాభిస్తుందనుకున్నా క‌మ్యూనిస్టుల‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. జ‌నసేనే ఒక సీటుకు ప‌రిమిత‌మైంది. ఇక క‌మ్యూనిస్టులు పోటీ చేసిన చోట్ల డిపాజిట్లే లేవు. దీంతో జనసేన – వామపక్షాలు అనధికారికంగా విడిపోయాయి. పాతికేళ్ల క్రితం వరకూ పదుల్లో సీట్లు సాధించిన వామపక్షాలు ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవడం కాదు క‌దా.... క‌నీసం డిపాజిట్ తెచ్చుకోలేని ప‌రిస్థితికి దిగ‌జారిపోయాయి. ఏపీలో జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లో జనసేనతో పొత్తుతో ఒకటో - రెండో సీట్లు వస్తాయని భావించారు పార్టీ నాయకులు.

చివ‌ర‌కు ప్ర‌జ‌లు జ‌న‌సేన‌నే ఘోరంగా తిర‌స్క‌రించ‌డంతో ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుని తాము నష్టపోయామని వామపక్షాలు గుసగుసలాడుకుంటున్నాయి. కనీస ఓట్లు సాధించలేక‌పోయ‌మాని మ‌ద‌న ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన గ‌మ్యం ఏంటో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఇక ప‌వ‌న్ కూడా త‌మ‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ని డిసైడ్ అయిన క‌మ్యూనిస్టు పార్టీల నేత‌ల ఎవ‌రికి వారే య‌మునా తీరే ? అన్న‌ట్టుగా వేర్వేరుగా పోరాటాలు చేస్తున్నారు.