Begin typing your search above and press return to search.

బెజ‌వాడ‌లో మీడియాకు ప‌వ‌న్ చెప్పిందేంటి?

By:  Tupaki Desk   |   18 March 2018 6:50 AM GMT
బెజ‌వాడ‌లో మీడియాకు ప‌వ‌న్ చెప్పిందేంటి?
X
జ‌న‌సేన ఆవిర్భావ స‌భ త‌ర్వాత ఏపీలోనే ఉండిపోయిన జ‌న‌సేన అధినేత.. నిత్యం బిజీబిజీగా ఉంటున్నారు. ప‌లువురితో మంత‌నాలు జ‌ర‌ప‌టం.. వివిధ స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌టం.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌టంతో పాటు మీడియాతో ఎప్పటిక‌ప్పుడు ట‌చ్ లో ఉండ‌టం చేస్తున్నారు. మీడియాతో సరైన రిలేష‌న్స్ మొయింటైన్ చేయ‌ర‌న్న ఆరోప‌ణ‌ను తుడిచేసే ప్ర‌య‌త్నాన్ని చేస్తున్నారు. రాజ‌కీయ పార్టీల తీరుకు భిన్నంగా జ‌న‌సేన వ్య‌వ‌హారం ఉంటుంద‌ని.. అలా క‌నిపించి ఇలా మాయం కావ‌టం.. మీడియాకు దూరంగా ఉండ‌టం లాంటివి ప‌వ‌న్ లో ఎక్కువ‌గా క‌నిపిస్తాయ‌న్న విమ‌ర్శ‌ల్ని తుడిచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప‌వ‌న్‌.

తాజాగా బెజ‌వాడ‌లో మీడియాతో స‌మావేశాన్ని నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా కొన్ని క్లారిటీలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాను ఎవ‌రితోనూ పొత్తులు పెట్టుకునేది లేద‌ని తేల్చేశారు. 2019 ఎన్నిక‌ల్లో తాము ఒంట‌రిగా పోటీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. హోదా విష‌యం మీద మాట్లాడ‌టం మానేసి.. బాబును టార్గెట్ చేయ‌టం స‌రికాదంటూ వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లపై స్పందించిన ప‌వ‌న్‌.. హోదా ఇష్యూ మీద నాలుగేళ్ల క్రిత‌మే తాను స్పందించిన‌ట్లు చెబుతున్నారు.

ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకోనున్నారా? అన్న ప్ర‌శ్న‌కు అలాంటిదేమీ లేద‌ని స్ప‌ష్టం చేసిన ప‌వ‌న్‌.. ఒంట‌రిగానే తాము బ‌రిలోకి దిగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. మీడియా స‌మావేశంలో ప‌వ‌న్ ప్ర‌స్తావించిన అంశాల్ని చూస్తే..

+ హోదా ప్రాధాన్య‌త‌ను గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనే గుర్తించా. ఎన్డీయేప్ర‌భుత్వం ప‌వ‌ర్లోకి రాగానే త‌క్ష‌ణ‌మే హోదా ప్ర‌క‌టించాల‌ని ప్ర‌ధాని మోడీని నేరుగా కోరా.

+ హోదా అంశాన్ని నాలుగేళ్లుగా ప్ర‌స్తావిస్తునే ఉన్నా. మోడీపై నేరుగా విమ‌ర్శ‌లు చేసింది నేనే

+ హోదాపై ఇప్ప‌టికే పోరాడాను..త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా.

+ రాజ‌ధాని న‌గ‌రం కోసం స‌మీక‌రించిన 33వేల ఎక‌రాల్లో నాలుగో వంతు మాత్ర‌మే వినియోగిస్తార‌ని నేనూ అంగీక‌రిస్తా. అయితే. గ‌తంలో బాబుతో స‌మావేశ‌మైన‌ప్పుడు రాజ‌ధాని కోసం 1400 ఎక‌రాలు స‌రిపోతుంద‌న్నారు.

+ మంగ‌ళ‌గిరి ద‌గ్గ‌రున్న అట‌వీ భూముల్ని డీ నోటిఫై చేసిఅక్క‌డే రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణం చేస్తాన‌ని చెప్పారు. కానీ.. ఆ త‌ర్వాత రైతుల నుంచి 33 వేల ఎక‌రాలు స‌మీక‌రించారు. దీన్నే ప్ర‌శ్నిస్తున్నా.

+ జ‌న‌సేన అవిర్భావ స‌భ‌లో చంద్ర‌బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు చెప్పేందుకే. ప్ర‌భుత్వంలో అవినీతి విప‌రీతంగా పెరిగిపోయింది.

+ ఒక ప్రాంతం సంస్కృతిని.. సంప్ర‌దాయాన్ని మ‌రో ప్రాంతం గుర్తించ‌కుంటే ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతాయి. తెలంగాణ విష‌యంలో జ‌రిగింది అదే. ఇప్ప‌డు రాయ‌ల‌సీమ‌.. క‌ళింగాంధ్ర‌ల‌లో ప్రాంతీయ‌వాదం మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంది.

+ సౌత్ ప‌ట్ల ఉత్త‌రాది వారు వివ‌క్ష చూపిస్తున్నారు. గ‌తంలో ఉత్త‌ర‌.. ద‌క్షిణ భార‌త‌దేశాల మ‌ధ్య అంత‌రం గురించి మాట్లాడిన‌ప్పుడు నాతో చాలామంది విభేదించారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు.. క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య కూడా ద‌క్షిణాది ప‌ట్ల ఉత్త‌రాది వాళ్లు వివ‌క్ష చూపిస్తున్నారని చెబుతున్నారు. ఉత్త‌రాది పెత్త‌నం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

+ ఫాతిమా కాలేజీ అంశం కేంద్రం ప‌రిధిలోనిదే. కాకుంటే సానుభూతితో రాష్ట్ర స‌ర్కారు ప‌రిష్క‌రించి ఉంటే బాగుండేది.

+2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ను విమ‌ర్శించొద్ద‌ని.. త‌మ‌కు ఆయ‌నంటే అభిమాన‌మ‌ని.. నేనంటే ఇష్ట‌మ‌ని విశాఖ‌లో పలువురు నాకు చెప్పారు. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌కు విలువ ఉండ‌దు.