Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పొలిటిక‌ల్‌ `స్టాండ్`... ఎవ‌రైనా ముక్కున వేలేసుకోవాల్సిందే!

By:  Tupaki Desk   |   15 Sep 2020 1:00 PM GMT
ప‌వ‌న్  పొలిటిక‌ల్‌ `స్టాండ్`... ఎవ‌రైనా ముక్కున వేలేసుకోవాల్సిందే!
X
రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు ఎవ‌రికైనా ఏదో ఒక ఆశ ఉంటుంది. ఈ ప‌నిచేస్తే.. మ‌న‌కు ఓటు బ్యాంకు పెరుగుతుందా? ఈ అడుగు వేస్తే.. ప్ర‌జ‌లు మ‌న‌వైపు చూస్తారా? ఇలా చేస్తే.. పేరు వ‌స్తుందా? గ్రాఫ్ పెరుగుతుందా?- వంటి అనేక అంశాల‌ను వారు భేరీజు వేసుకుంటేనే త‌ప్ప‌.. ఏ కార్య‌క్ర‌మాన్నీ.. ఓ ప‌ట్టాన చేప‌ట్ట‌రు. అలా.. అన్ని లెక్క‌లు వేసుకుని, అన్ని అంచ‌నాల‌ను స‌రిచూసుకుని అడుగులు వేసినా.. కొన్ని కొన్ని సార్లు.. వ్యూహాలు త‌ప్పుతాయి. అనుకున్న‌ది ద‌క్క‌క‌పోగా.. ఉన్న ఇమేజ్ కూడా పోయే ప్ర‌మాదం పొంచి ఉంటుంది.

ఇలాంటి ప‌రిస్థితే ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో జ‌రుగుతోంద‌ని అంటున్నారు విశ్లేషకులు. పార్టీ పెట్టిన‌ప్పుడు ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పార్టిసిపేట్ చేశారు. అయితే, వ‌చ్చీ రావ‌డంతోనే తాను అధికారాన్ని ఆశించ‌లేద‌ని చెప్పినా.. ఎక్క‌డో ఓమూల మాత్రం కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడ‌దా?! అనే ఆలోచ‌న మాత్రం ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా త‌న పార్టీ ఇమేజ్‌ను మ‌రింత పెంచే అవ‌కాశం ఎక్క‌డున్నా దానిని వ‌దిలిపెట్ట‌లేదు. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక హోదాను ప్ర‌ధానంగా తీసుకుని కాకినాడ స‌భ, అనంత‌పురం స‌భ‌లు నిర్వ‌హించారు.

అప్ప‌టి మిత్ర‌ప‌క్ష.. సీఎం చంద్ర‌బాబును.. పాచిపోయిన ల‌డ్డూలు తీసుకున్నారంటూ... ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో ఎద్దేవా చేశారు. అనంతరం కొన్నాళ్లు హోదా అంటూ.. ప‌వ‌న్ హ‌డావుడి చేశారు. ఇక‌, అటు త‌ర్వాత దానికి మంగ‌ళం పాడిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌పై స‌మైక్య వాదులే విమ‌ర్శ‌లు చేసే ప‌రిస్థితివ‌చ్చింది. ఇక‌, త‌ర్వాత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌వ‌న్ తీసుకున్న అంశం.. అమ‌రావ‌తి. జ‌గ‌న్ స‌ర్కారు మూడు రాజ‌ధానులు అన్న‌ప్పుడు ప‌వ‌న్ గ‌ళం వినిపించారు. సీఎంలు మారితే.. రాజ‌ధాని మారుతుందా? అంటూ తొలిసారి ఆయ‌న కీల‌క పాయింట్ రెయిజ్ చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు అడ్డు పెట్టినా.. ముళ్ల కంచెలు దాటుకుని.. అమ‌రావ‌తిలోని రైతుల శిబిరాల‌కు చేరుకున్నారు.

రైతుల‌కు తాను అండ‌గా ఉంటాన‌ని, అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని ముందుకు తీసుకువెళ్దామ‌ని.. అన్నారు. కొన్నాళ్లు గ‌డిచిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ప‌వ‌న్ యూట‌ర్న్‌. రాజ‌ధాని విష‌యంలో జోక్యం చేసుకునేదిలేద‌ని క‌రాఖండీగా చెప్పిన కేంద్రంలోని బీజేపీతో జ‌ట్టుక‌ట్టారు. అదేమంటే.. మీకోస‌మే నేను త్యాగం చేస్తున్నానంటూ.. అమ‌రావ‌తి రైతుల‌కు చెప్పారు. ఇంతా చేస్తే.. తాజాగా కేంద్రం హైకోర్టులో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ పెనుదుమారం రేపుతున్నా.. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు తాము అడ్డు చెప్పేది లేద‌ని ప‌రోక్షంగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసినా.. ప‌వ‌న్ నోరు మెద‌ప‌లేదు. క‌నీసం .. అమ‌రావ‌తిలో రైతుల ప‌రిస్థితిని ఆయ‌న వాక‌బు చేయ‌నూలేదు. దీంతో ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయ‌న స్టాండ్‌పై గ‌తంలోను, ఇప్పుడు కూడా ప్ర‌జ‌లు ఎద్దేవా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.