Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కి గుడ్ న్యూస్‌...టీడీపీకి బ్యాడ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   15 Nov 2017 8:05 AM GMT
ప‌వ‌న్ కి గుడ్ న్యూస్‌...టీడీపీకి బ్యాడ్ న్యూస్‌
X
గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు వెలువ‌డే దాకా... ఏపీలో విజ‌యం వైసీపీదేన‌ని దాదాపుగా అన్ని స‌ర్వేలు తేల్చిచెప్పాయి. స‌ర్వేల మాట అలా ప‌క్క‌న పెడితే... తెలంగాణ‌లో అధికారం చేజిక్కించుకోవ‌డం దాదాపుగా ఖ‌రారు చేసుకున్న టీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర‌రావు కూడా... ఏపీకి కాబోయే సీఎం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డేన‌ని స్వ‌యంగా మీడియాతో చెప్పారు. అయితే చివ‌రి నిమిషంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు అనుస‌రించిన వ్యూహం ఫ‌లితంగా వైసీపీ విప‌క్షానికే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఏపీలో టీడీపీకి విజ‌యం ద‌క్క‌గా... ప‌దేళ్ల త‌ర్వాత చంద్ర‌బాబు మ‌రోమారు సీఎం ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. అయినా ఆ చివ‌రి నిమిషంలో చంద్ర‌బాబు ఏం చేశార‌న్న విష‌యం కూడా పెద్ద‌గా బ్ర‌హ్మ ర‌హ‌స్య‌మేమీ కాదు.

ఏపీలో మెజారిటీ ఓట్లు ఉన్న కాపులు, యువ‌త‌రాన్ని త‌న వైపున‌కు తిప్పుకునేందుకు చంద్ర‌బాబు ఓ బ్ర‌హ్మాస్త్రాన్ని ప్ర‌యోగించారు. ఆ బ్ర‌హ్మాస్త్ర‌మే జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ అగ్ర న‌టుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో నాలుగైదు రోజుల్లో ముగుస్తుంద‌న‌గా రంగంలోకి దిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... చంద్రబాబు గెలుపున‌కు బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారంతో... ప‌రిస్థితి టీడీపీకి అనుకూలంగా మారింద‌ని ఆయ‌న నిర్వ‌హించిన స‌భ‌లు, అర్ధ‌రాత్రి స‌మావేశాల‌కు త‌ర‌లివ‌చ్చిన జ‌నాన్ని చూస్తేనే చెప్పేయొచ్చ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఇక వైసీపీపై టీడీపీ సాధించిన అతి కొద్ది శాతం ఓట్లు చూస్తే కూడా ప‌వ‌న్ ప్ర‌భావం ఇట్టే క‌నిపించ‌క మాన‌దు. అయితే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేందుకు ఇష్టప‌డ‌ని టీడీపీ... త‌మ‌కు తాముగానే విజ‌యం సాధించామ‌ని గొప్ప‌లు పోతోన్న విష‌యమూ మ‌న‌కు తెలిసిందే.

ఈ క్ర‌మంలో నిన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌, కాపుకార్పొరేష‌న్ చైర్మ‌న్ చ‌ల‌మ‌ల‌శెట్టి రామానుజ‌య అస‌లు విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు... ప‌వ‌న్ క‌ల్యాణ్ పుణ్య‌మేన‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసేశారు. నిన్న జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో భాగంగా మాట్లాడిన చ‌ల‌మ‌ల‌శెట్టి... ఈ విష‌యాన్ని ఏమాత్రం జంకూ బొంకూ లేకుండానే ప్ర‌క‌టించేశారు. ప‌వ‌న్ కార‌ణంగానే తాము గెలిచామ‌న్న విష‌యాన్ని చెప్ప‌డంతోనే స‌రిపెట్టని రామానుజ‌య‌... ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు కూడా చాలాసార్లు బ‌హిరంగంగానే ప్ర‌క‌టించార‌ని చెప్పారు. మ‌రి ఈ వ్యాఖ్య‌లపై చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారోన‌న్న ఆస‌క్తి నెల‌కొంది.