Begin typing your search above and press return to search.

మూడేళ్లలో జనసేన ఏం సాధించినట్లు?

By:  Tupaki Desk   |   14 March 2017 9:00 AM GMT
మూడేళ్లలో జనసేన ఏం సాధించినట్లు?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసి విజయవంతంగా మూడేళ్లు పూర్తికావస్తోంది. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ తో ఆయనపై పొలిటికల్ ఎంట్రీపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చురుకుగా పనిచేసిన అనుభవం వల్ల పవన్ రాజకీయాల్లో దున్నేస్తాడని అంతా భావించారు. ప్రజల సమస్యలపై సమరశంఖారావం పూరిస్తారని ఊహించారు. కానీ వాస్తవం చూస్తే పవన్ ఇలాంటి రాజకీయ అంచనాలను చేరుకోలేదనే టాక్ వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ పవన్ ఊహించిన రీతిలో స్పందించడం లేదనేది మొదటి ఆరోపణ. ముఖ్యంగా ప్రజా సమస్యలు, అనేకమంది జీవితాన్ని అతలాకుతలం చేసిన విషయాల్లో పవన్ స్పందన అంతంతమాత్రమే కాదు... అసలే మాత్రం లేదనేది కొందరి ఆరోపణ. గత ఏడాది ఏపీ సర్కారు ఎంతో అట్టహాసంగా నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో 20మందికి పైగా అకారణంగా మరణించిన ఘటనపై పవన్ నిలదీసిన దాఖలాలు లేవు. తాజాగా జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై సైతం గొంతు వినిపించలేదు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ప్రకటించిన పవన్ ఇలాంటి కీలక అంశాల్లో మౌనంగా ఉండటం ఆయన విశ్వసనీయతను దెబ్బతీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీ కోసం పనిచేసిన మొహమాటం అడ్డువస్తుందేమోననే భావన వినిపిస్తోంది.

ఇక పవన్ స్పందించిన పలు విషయాల్లోనూ అర్దాంతరంగా ముగించడమో లేక పరిష్కారం కాకముందే వాటిని వదిలిపెట్టడమో చేశారనే మరో కామెంట్. ఆంధ్రప్రదేశ్ లో కీలక అంశమైన ప్రత్యేక హోదా విషయంలో ఈ ఆరోపణ ప్రథమంగా వినిపించింది. ప్రధానప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలైన కాంగ్రెస్ - కమ్యూనిస్టులు - పెద్ద ఎత్తున యువతీయువకులు కలిసికట్టుగా గళం విప్పినప్పటికీ పవన్ వారితో కలవలేదు. అదే సమయంలో తన సొంత కార్యచరణపై సైతం ప్రత్యేక హోదా కోసం చేపట్టలేదు. అయితే కొన్ని పాటలను సైతం జనసేన తరఫున విడుదల చేశారు! మరోవైపు కీలకమైన రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల విషయంలోనూ పవన్ వారి పక్షాన ఉన్నట్లే కనిపించింది. అయితే ఆ సమస్యలో పూర్తి పరిష్కారం కాకముందే పవన్ సైడ్ అయిపోయారు. ఇక ఏపీలో జరుగుతున్న అవినీతి - ఎమ్మెల్యేలు-ఎంపీలు-ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టి అధికార పార్టీ తన గూటికి చేర్చుకోవడంపై పవన్ గళం వినిపించిన దాఖలాలు లేవు. ఓటుకు నోటు వంటి కీలక అంశాల్లోనూ పవన్ వాయిస్ పరిమితంగా కూడా కనిపించలేదు! వీటన్నింటినీ చూస్తుంటే మూడేళ్లు అయినా పవన్ ఇంకా ప్రజల పల్స్ పట్టుకోలేదా అనే సందేహం కలగడంలో వింతేం లేదంటున్నారు. అంతేకాదు ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన పవన్..ప్రశ్నించడం అంటే ప్రజల పక్షం ఉండటమని, ప్రతిపక్ష పాత్ర పోషించడమనే మూలసూత్రాన్ని మర్చిపోయారా అనే చర్చ కూడా సాగుతోంది. ప్రజల పక్షాన గళం వినిపించకపోతే తనను తాను పార్ట్ టైం పొలిటీషియన్ గా పవన్ చేసేసుకున్నట్లు అవుతుందని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/