Begin typing your search above and press return to search.

పవన్ దెబ్బతో ఏపీ కాంగ్రెస్ ఖాళీ అవుతున్నట్టే!

By:  Tupaki Desk   |   10 March 2018 4:25 PM GMT
పవన్ దెబ్బతో ఏపీ కాంగ్రెస్ ఖాళీ అవుతున్నట్టే!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శవాసనం వేసింది. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఏదో జీవంలేని భౌతిక కాయం మాత్రమే మిగిలి ఉన్నట్టుగా ఉంది. ఇప్పట్లో ఏ ఎన్నికలోనూ గెలిచే పరిస్థితిలో ఆ పార్టీ లేదు. అసలే ఇలా శిథిలం అయిపోతున్న ఆ పార్టీకి పవన్ పార్టీ జనసేన రూపంలో మరో పెద్ద ఉపద్రవం వచ్చి పడబోతోందని పలువురు అంచనా వేస్తున్నారు. మూలిగేనక్కమీద తాటిపండు పడ్డ చందంగా అసలే కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని పవన్ కల్యాణ్ పూర్తిగా ఖాళీ చేసేయబోతున్నారనే పుకార్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందుకు పవన్ కల్యాణ్ చాలా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న గుంటూరు బహిరంగ సభ తొలివేదిక కానుందని సమాచారం.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం పవన్ కల్యాణ్ పార్టీలో చేరిపోయారు. గుంటూరు సభ నిర్వహణ బాధ్యతను కూడా ఆయనే చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా అనేకమంది నాయకులు జనసేనలోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్నారుట.

ప్రత్యేకించి.. కాంగ్రెస్ లో ‘జనసేన బ్యాచ్’ అంటూ ఒకటి ఉంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట ఉండి - ఆయన విలీనం చేసిన తర్వాత.. ఆయనతో పాటూ కాంగ్రెస్ లోకి చేరిన అనేకమంది నాయకులు తర్వాతి పరిణామాల్లో చాలా మంది తెదేపా - వైకాపాల్లోకి వెళ్లలేని పరిస్థితుల్లో అక్కడే మిగిలి ఉన్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ సరికొత్త ఆశాదీపం లాగా కనిపిస్తోంది. వారు చాలాకాలంగా పవన్ కు సన్నిహితులైన కొందరు కీలక వ్యక్తులతో టచ్ లో ఉంటూ.. పార్టీలో చేరడానికి మంతనాలు సాగిస్తున్నారు.

పార్టీ బహిరంగ సభ వేదికే.. చేరికలకు అనువుంగా ఉంటుందని - ఇలా పలువురు రావడం వలన.. పార్టీ ఇమేజి కూడా ఒక్కసారిగా బూస్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారుట. కాంగ్రెస్ లో ఎటూ భవిష్యత్తు లేదు గనుక.. జనసేనలో చేరడానికి చాలా మంది ఉత్సాహ పడుతున్నారు గానీ.. పవన్ కల్యాణ్ సెలక్టివ్ గా కొందరిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వారిలో ఇటీవల్ జెఎఫ్‌ సి సమావేశానికి కాంగ్రెస్ తరఫున వచ్చిన వారిలోనూ వికెట్లు ఉండవచ్చునని సమాచారం. చిరంజీవి పార్టీ వ్యూహకర్తల్లో ఒకరుగా ఒక వెలుగు వెలిగిన సి. రామచంద్రయ్య కూడా జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కూడా ఒకరిద్దరి చేరికలను పవన్ కల్యాణ్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.