Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ప‌త్రిక వ‌చ్చేసింది.. అదే పేరు!

By:  Tupaki Desk   |   3 Aug 2018 6:33 AM GMT
ప‌వ‌న్ ప‌త్రిక వ‌చ్చేసింది.. అదే పేరు!
X
ఎవ‌రి కుంప‌టి వారిది. ఎవ‌రి డ‌బ్బా వారు కొట్టుకోవాలి. ఎవ‌రి వాద‌న వారు వినిపించుకోవాలి. ఇప్పుడిదే ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తోంది. ప‌క్ష‌పాతం అన్న‌ది లేకుండా.. ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పే పాత్రికేయం పోయి చాలా కాల‌మే అయ్యింది. ప‌చ్చ మీడియా దెబ్బ‌కు ఎవ‌రికి వారు.. వారి వాద‌న‌లు వినిపించుకోవాల్సిన దుస్థితి. లేదంటే.. త‌మ ప్ర‌యోజ‌నాల కోసం అవ‌త‌లి వారి మీద బుర‌ద జ‌ల్లేందుకు వెనుకాడ‌ని ప‌రిస్థితి.

దీనికి చెక్ చెప్పేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న సోష‌ల్ మీడియా శ‌త‌ఘ్ని పేరుతోనే తాజాగా ప‌క్ష ప‌త్రిక‌ను తీసుకొచ్చేశారు. ప్ర‌స్తుతానికి ప‌వ‌న్ ప్ర‌సంగాల‌తో దాన్ని నింపినా.. రానున్న రోజుల్లో పొలిటిక‌ల్ ప‌త్రిక‌గా రూపొందిస్తార‌ని చెబుతున్నారు. ప‌త్రిక పేరు కింద ట్యాగ్ లైన్ గా.. స‌మ‌స్య‌ల‌పై సంధించిన అక్ష‌రాయుధం అన్నది చూస్తే.. రానున్న రోజుల్లో శ‌త‌ఘ్నిని ఎలా తీర్చిదిద్దుతారో ఇట్టే అర్థ‌మైపోతుంద‌ని చెప్పాలి.

న‌ల్ల క‌ళ్ల‌ద్దాల‌తో యువ‌త వెంట న‌డుస్తున్న ప‌వ‌న్ ఫోటోను ఫ‌స్ట్ పేజీగా తీసుకొచ్చిన ఈ ప‌త్రికను వెల రూ.10గా డిసైడ్ చేశారు.

ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కోసారి ఇచ్చే ఈ ప‌త్రిక రానున్న రోజుల్లో దిన‌ప‌త్రిగా చేసే వీలుంద‌ని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఒక టీమ్‌ను సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక నుంచి తీసుకొచ్చిన ఒక ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టుతో పాటు.. మ‌రికొంద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల టీం శ‌త‌ఘ్నిని తీసుకొస్తార‌ని చెబుతున్నారు.

త‌మ అవ‌స‌రాల‌కు భుజానికి ఎత్తుకోవ‌టం.. అవ‌స‌రం అయ్యాక కింద పారేయ‌టం.. కీల‌క‌మైన అంశాల్ని క‌నిపించ‌కుండా ప్ర‌చురించే ప‌చ్చ ప‌త్రిక‌ల తీరుతో ప‌వ‌న్ విసిగిపోయార‌ని తెలుస్తోంది. దీనికి ప‌రిష్కారంగా త‌మ వాద‌న‌ను వినిపించేందుకు బ‌ల‌మైన మీడియాను త‌మ‌కు తామే ఏర్పాటు చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌కు తుది రూపంగా శ‌త‌ఘ్నిని డిసైడ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ప‌వ‌న్ ను టార్గెట్ చేసిన క‌త్తి మ‌హేశ్.. శ్రీ‌రెడ్డి ఇష్యూల‌లో టీవీ ఛాన‌ల్స్ అనుస‌రించిన వైనంపై ప‌వ‌న్ అసంతృప్తిగా ఉండ‌ట‌మే కాదు.. త‌న ఆగ్ర‌హాన్ని ట్వీట్ల రూపంలో ప్ర‌ద‌ర్శించారు కూడా. త‌న‌ను కెలికితే ఎలా ఉంటుందో కొంద‌రి విష‌యంలో శాంపిల్ చూపించిన ప‌వ‌న్‌.. శ‌త‌ఘ్నిని రాజ‌కీయ ప‌త్రిక‌గా రూపొందించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే సొంత టీవీ ఛాన‌ల్ ను ఏర్పాటు చేసుకున్న ప‌వ‌న్‌.. శ‌త‌ఘ్నిని పూర్తిస్థాయి దిన‌ప‌త్రిక‌గా మార్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. టీవీ ఛాన‌ల్‌కు ఎలా అయితే బ‌డా బాబులు కొంద‌రు ముందుకు వ‌చ్చారో.. దిన‌ప‌త్రిక విష‌యంలో అలాంటి ప‌రిస్థితే ఉంద‌ని.. కొంద‌రు పెట్టుబ‌డి పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. దిన‌ప‌త్రిక అంటే ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం కావ‌టంతో.. శాంపిల్ గా.. ప‌క్ష ప‌త్రిక‌తో మొద‌లెట్టి.. అంచ‌లంచెలుగా దిన‌ప‌త్రిగా మార్చే వీలుంద‌ని చెబుతున్నారు.