Begin typing your search above and press return to search.

ప్ర‌శ్నించే ప‌వ‌న్‌..ఈ ఎన్నిక‌లు కూడా ప‌ట్ట‌వా?

By:  Tupaki Desk   |   12 Aug 2017 10:27 AM GMT
ప్ర‌శ్నించే ప‌వ‌న్‌..ఈ ఎన్నిక‌లు కూడా ప‌ట్ట‌వా?
X
రాజ‌కీయాలు చేసే వారి ఎజెండా ఏదైనా స‌రే క్లియ‌ర్ గా ఉంటుంది. త‌మ ల‌క్ష్యం ఏంటి? తాము ఏం సాధించాల‌నుకుంటున్నాం? అన్న విష‌యాల్ని వివ‌రంగా చెప్ప‌టం క‌నిపిస్తుంది. అయితే.. దీనికి పూర్తి భిన్నం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. నిలువెత్తు అనిశ్చితితో రాజ‌కీయాలు చేయ‌టం ప‌వ‌న్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి. ప్ర‌శ్నించేందుకే తాను పార్టీ పెట్టాన‌ని ప‌వ‌న్ నోట మాట వ‌చ్చిన వేళ‌.. తెలుగోళ్ల‌లో కొంత‌మంది చాలా ఆనందానికి గుర‌య్యారు. ఇక‌.. త‌న‌కు తెలంగాణ‌.. ఆంధ్రా రెండు ముఖ్య‌మేన‌ని.. రెండు చోట్ల ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉంద‌న్న మాట చెప్పిన‌ప్పుడు ప‌వ‌న్ ను అభిమానించి.. ఆరాధించే వారు సంతోష‌ప‌డ్డారు.

అయితే.. క్యాలెండ‌ర్లో నెల‌లు గ‌డుస్తున్న కొద్దీ.. ప‌వ‌న్ తీరుపై స‌గటు అభిమానిలోనూ ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌న్ మ్యాన్ ఆర్మీ మాదిరి పార్టీని న‌డిపిస్తూ.. తాను త‌ప్ప పార్టీలో ఇంకెవ‌రూ లేర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్ కు జ‌న‌సేన‌ను రాజ‌కీయ పార్టీగా న‌డిపించాల‌న్న ఆలోచ‌న ఉందా? లేదా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఒక‌టి తర్వాత ఒక‌టిగా వ‌స్తున్న ఎన్నిక‌ల‌కు సంబంధించిన త‌న స్టాండ్‌ ను చెప్ప‌క పోవ‌టం.. త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నింపే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌టం క‌నిపిస్తుంది. పార్టీ పెట్టిన కొత్త‌ల్లో తెలంగాణ ఉప ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో నిలుపుతామ‌ని చెప్ప‌ట‌మేకాదు.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ త‌మ పార్టీ పోటీ చేసే అవ‌కాశం ఉంద‌న్నారు.

పోటీ సంగ‌తి త‌ర్వాత‌.. ఆ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఒక్క మాట చెప్పింది లేదు. మ‌రో రెండు నెలల్లో త‌న టైంలో మేజ‌ర్ పార్ట్ రాజ‌కీయాల‌కే కేటాయిస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. త‌న‌కు మాంచి ప‌ట్టున్న కాకినాడ కార్పొరేష‌న్ కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఎందుకు పోటీ చేయ‌టం లేద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

త‌న‌కు కులాల‌తో ప‌ట్టింపు లేద‌ని ప‌వ‌న్ చెప్పిన‌ప్ప‌టికీ.. ఆయ‌న్ను అభిమానించే వారిలో ఆయ‌న వ‌ర్గానికి చెందిన కాపులు ఎక్కువ‌మంది ఉంటార‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. దీనికి తోడు త‌న పార్టీని.. త‌న‌ను అభిమానించే వారు పుష్క‌లంగా ఉండే కాకినాడ లాంటి చోట‌.. పార్టీ అభ్య‌ర్థుల్ని ఎందుకు బ‌రిలోకి దింప‌ర‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పే వారు క‌నిపించ‌ని ప‌రిస్థితి. కొన్ని నెల‌ల క్రితం ప్ర‌త్యేక హోదా మీద తిరుప‌తి స‌భ అనంత‌రం కాకినాడ‌లో బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌.. త‌న దృష్టిలో కాకినాడ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంద‌న్న విష‌యాన్ని చెప్ప‌కనేచెప్పారు. మ‌రింత ప్రాధాన్య‌త ఇచ్చిన కాకినాడ‌కు.. అక్క‌డ జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున ఎందుకు పోటీ చేయ‌టం లేద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. పోటీ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. క‌నీసం కాకినాడ‌లో త‌న‌ను అభిమానించే భారీ అభిమాన‌గ‌ణానికి లోగుట్టుగా అయినా ఎవ‌రికి ఓటు వేయాల‌న్న సందేశాన్ని ప‌వ‌న్ పాస్ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. కాకినాడ ఎన్నిక‌ల విష‌యంలో ఏమీ ప‌ట్ట‌న‌ట్లుగా ప‌వ‌న్ ఉంటార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌శ్నించే గొంతు.. అదే ప‌నిగా మౌనంగా ఉండ‌టం ఏమిటి ప‌వ‌ర్ స్టార్‌?