Begin typing your search above and press return to search.

పవన్ సభ పక్కా.. మాట్లాడే అంశం?

By:  Tupaki Desk   |   26 Aug 2016 7:55 AM GMT
పవన్ సభ పక్కా.. మాట్లాడే అంశం?
X
ప్రముఖ నటుడు - జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుమల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం తిరుమల చేరుకున్న పవన్‌ - శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత రెండోసారి కూడా శుక్రవారం మరోసారి శ్రీవారిని దర్శించుకుని తిరుమలలోనే బస చేస్తారు. అయితే ఉన్నట్లుండి పవన్ కల్యాణ్ కు సంబందించిన ఒక వార్త హల్ చల్ చేస్తుంది. శనివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం తిరుపతిలోని ఇందిరా మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారనేది ఆ వార్త సారాంశం. ఇప్పుడు ఈ సభే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఈ సభ నిర్వహణకు సంబందించి గాసిప్స్ వస్తున్న సమయంలో జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య కొన్ని విషయాలు తెలిపారు. పవన్ కల్యాణ్ సభ నిర్వహణ వాస్తవమేనని - దాని కోసం ఇప్పటికే నగర పాలక సంస్థ - పోలీసుల అనుమతి కోరామని తెలిపారు. దీంతో సభ నిర్వహణ పక్కా అని తెలిసిపోయింది. ఇక.. ఈ సభలో పవన్ ఏమి మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు అందరి మనసులనూ తొలిల్చేస్తున్న ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు పవన్ మాట్లాడటానికి ఉన్న విషయాలన్నీ హాట్ టాపిక్స్ మాత్రమే కాకుండా, రాజకీయాల్లోనూ పెను సంచలనాలు తీసుకువచ్చేవిగా ప్రజలు భావించడమే.

కర్ణాటకలో ఇటీవల హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కు సంతాపం తెలిపన అనంతరం పవన్ మాట్లాడబోయే ప్రతిమాటా ఒక సంచలనం కాబోతుందనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ప్రస్తుతం పవన్ మాట్లాడటానికి అతి ముఖ్యమైన సబ్జెక్ట్ గా ఉన్నవాటిలో "ప్రత్యేక హోదా"ది ప్రధమస్థానమనే చెప్పాలి. ఏపీలో రాజకీయాలు వేడెక్కడానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా. ఈ విషయంపై ఇప్పటికే కేవీపీ రూపంలో కాంగ్రెస్ - ప్రతిపక్ష పార్టీగా వైకాపా తమవంతు పాత్రను నడుపుతున్నాయి. అయితే ఈ విషయంలో టీడీపీ - రాష్ట్ర బీజేపీ నేతల వైఖరిపైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో మీడియా ముందుకువచ్చి కానీ - ట్విట్టర్ ద్వారా కానీ పూర్తిగా స్పందించని పవన్ ఉన్నట్లుండి ఒక సభ పెట్టడం మామూలు విషయం కాదు. ప్రత్యేక హోదా విషయమా.. బీజేపీ - టీడీపీ ల మధ్య జరుగుతున్న సంబంధమా.. టీడీపీ - బీజేపీలతో పవన్ కున్న దోస్తీ వ్యవహారమా.. లేక జనసేన పార్టీ కార్యక్రమాల ప్రస్థావనా.. వీటిలో పవన్ ఏ విషయంపై ప్రసంగించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సంచలనమే అవుతుంది.

అయితే.. ఈ బహిరంగ సభ కోసం ఏర్పాటుచేసుకున్న ఇందిరా మైదానం వేదిక కేవలం ఏడెనిమిది వేల మంది మాత్రమే పట్టేలా ఉంటుంది. దీంతో ఈ సభ రాజకీయపరమైనదా లేక అభిమానులను ఉద్దేశించి మాట్లాడేందుకు మాత్రమే ఏర్పాటుచేసిన వేదికా అనే విషయంపై చర్చ సాగుతోంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.. ఇకనైనా జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభించాలని నిర్ణయించినట్లుగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో.. ఈ సభపై అందరిదృష్టి నెలకొందనే చెప్పాలి!