Begin typing your search above and press return to search.

పవన్ సభ పెనుసంచలనాలకు వేదికా?

By:  Tupaki Desk   |   26 Aug 2016 10:39 AM GMT
పవన్ సభ పెనుసంచలనాలకు వేదికా?
X
పవన్ కల్యాణ్ తిరుపతిలో శనివారం మద్యాహ్నం ఒక బహిరంగ సభను ఏర్పాటుచేయనున్నారన్న విషయం స్పష్టమైపోయిన సమయంలో.. దీనికి వేదికగా ఇందిరా మైదానాన్ని కూడా ఎంపిక చేసుకుని అనుమతులు కూడా తీసుకున్నారు! అయితే ఈ సభలో "పవన్ ప్రస్థావిస్తారని భావిస్తున్న... ప్రస్థావిస్తే బాగుంటుంది అని అనుకుంటున్న" విషయాలను ఒకసారి పరిశీలిద్దాం.

ప్రత్యేక హోదా: పవన్ కల్యాణ్ మాట్లాడాలంటే ఈ విషయంలో చాలా ఉంది. ప్రత్యేక హోదా అవసరం ఏపీకి ఎంత ఉంది.. హోదా వస్తే దానివల్ల కలిగే ప్రత్యక్ష - పరోక్ష ప్రయోజనాలు.. భవిష్యత్ తరాలకు కలిగే ఉపయోగాలపై పవన్ మాట్లాడొచ్చు. అయితే ఈ విషయంపై కేవలం ఊకదంపుడు ప్రసంగం చేసేస్తే ప్రసంగం నీరుగారిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో పవన్ తన మాటను - హోదాపై తన అభిప్రాయాని కచ్చితంగా సూటిగా చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై పోరా? టీడీపీకి సైతం వార్నింగ్ ఇచ్చే అవకాశమా? ఇద్దరికీ రాం రాం చెప్పేసి సొంత పార్టీని హోదా పేరుతో బలపరచడమా? లేక ఎవ్వరూ ఊహించని విదంగా కాంగ్రెస్ లేక వైకాపాలతో కలిసి పోరాడటమా? విషయం ఏదైనా.. సూటిగా చెప్పాల్సి ఉంటుంది.

టీడీపీ - బీజేపీతో మైత్రి: ఎవరు అవునన్నా కాదన్నా.. ఏపీలో టీడీపీ - బీజేపీల కూటమి అధికారంలోకి రావడానికి పవన్ పాత్రం కీలకమైందే. అయితే అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే స్థాయిలో కానీ, సమర్ధించే స్థాయిలో కానీ పవన్ సూటిగా మాట్లాడింది లేదు. ఏపీ ప్రభుత్వం పై ఎన్నిరకాల విమర్శలు వస్తున్నా కూడా కచ్చితంగా స్పందిస్తారని అంతా భావించిన అంశాలపై కూడా పవన్ స్పందించింది లేదు. ఒకటి రెండు విషయాలపై ట్విట్టర్ లో మాత్రమే స్పందించారు. అయితే ఈ పరిస్థితుల్లో ఈ మైత్రి పై పవన్ కచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. దానికి కారణమయ్యేది అంశంకూడా ప్రత్యేక హోదానే కావచ్చు.

జనసేన పార్టీ: ప్రశ్నించడానికి పార్టీ పేట్టానని చెప్పిన పవన్ "జనసేన"ను స్థాపించారు. అయితే అధికారికంగా రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కుంటూన్నారనే విషయంపై మాత్రమే ఈ జనసేన పార్టీ స్పందించింది. పవన్ సామాజిక వర్గానికి సంబందించిన ఉద్యమాల సమయంలో కూడా ఈ పార్టీ మౌనాన్నే తనబాషగా చేసుకుందని విమర్శ ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాలు, సందర్భాలు ఎన్నివచ్చినా కూడా ఒకరాజకీయ పార్టీగా జనసేన తన ఉనికిని చాటుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే ఈ విమర్శలన్నింటికీ ఈ సభద్వారా జనసేన పార్టీ అధ్యక్షుడు చాలా క్లారిటీలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాకాని పక్షంలో ఇది రాజకీయపార్టీగా కాకుండా.. ఒక ఎంజీఓ గా మిగిలిపోయే ప్రమాదం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.

అభిమానులకు సూచనలు: కర్ణాటకలో ఇటీవల హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కు సంతాపం తెలిపే కార్యక్రమం మాత్రమే ఈ సభలో జరుగుతుందా లేక ఈ విషయాలపై పవన్ అభినందనీయమైన వ్యాఖ్యలు ఏమైనా మాట్లాడతారా అనేది ఆసక్తికరమైన అంశం! అభిమానులెవరూ గొడవలు పడొద్దు అని మాత్రమే చెబితే పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు. అలాకాకుండా ఒక విలువైన - బలమైన సూచన అందరి హీరోల అభిమానులకూ అర్ధాయ్యేలా చెబితే బాగుటుంది.