Begin typing your search above and press return to search.

జ‌న‌సేన పార్టీ ఆఫీసును ఎత్తేశారు

By:  Tupaki Desk   |   6 Feb 2018 5:02 AM GMT
జ‌న‌సేన పార్టీ ఆఫీసును ఎత్తేశారు
X
జ‌న‌సేన అధినేత‌, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు ఎదురైన‌ అనూహ్య‌మైన ట్విస్ట్ ఊహించ‌ని మ‌లుపుతిరిగింది. 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయాలని నిర్ణ‌యం తీసుకొని గత కొద్ది రోజుల నుండి బాగానే గ్రౌండ్ వర్క్ చేస్తున్న ప‌వ‌న్ పలు ప్రాంతాలలో జనసేన కార్యాలయాలను నిర్మించే దిశగా కూడా అడుగులు వేశారు. ఈ క్రమంలో మంగళగిరి మండలం చినకాకాని లో 3 ఎకరాల స్థలం లీజుకి తీసుకున్నాడు పవన్. సర్వే నెంబర్ 181/182 పరిధిలోని మూడెకరాల భూమిలో ఎంతో అట్టహాసంగా భారీఎత్తున సభ నిర్వహించారు. అక్కడే కార్యాలయం నిర్మించేందుకు స్థల యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్క‌డ పార్టీ కార్యాల‌యం నిర్మాణం కోసం సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో అనూహ్య‌ వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. ముస్లిం వర్గాలకు చెందిన ఆ స్థలంపై ప్రస్తుతం హైకోర్టులో వివాదం నడుస్తోంది. తాజాగా అది మ‌రో మ‌లుపు తిరిగింది.

ముస్లిం నేత జక్రియాకు చెందిన ఈ స్థలంపై దివంగత యార్లగడ్డ సుబ్బారావుతో జరిగిన వివాదంలో స్థానిక న్యాయస్థానాల్లో జిక్రియాకే అనుకూల తీర్పు వచ్చింది. దీనిపై ప్రత్యర్థి దాఖలు చేసిన అప్పీలుపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. అయితే దివంగత సుబ్బారావు తనయుడు వెంకటేశ్వరరావుతో ఆ మొత్తం స్థలాన్ని జనసేన కార్యాలయం ఏర్పాటు కోసం పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దీనిపై ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జలీల్ ఇటు రాజకీయ అటు న్యాయ పోరాటం సాగించారు. ఇదే సమయంలో ఆయనపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌ లో రౌడీషీట్‌ ను తెరవటం ముస్లిం వర్గాలను మరింతగా ఆగ్రహానికి గురిచేసింది. ఈ నేపధ్యంలో జనసేన తరపున పలువురు న్యాయవాదులు స్థానిక నేతలు ఆది - సోమవారాల్లో వివాదాస్పద స్థలంలో అన్నిరకాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

స్థలం కోర్టు వివాదంలో ఉందని గుర్తించడంతో.. ఆపై ఆగమేఘాలపై అప్పటికే ఆ స్థలంలో తాత్కాలికంగా నిర్మితమైన రేకుల షెడ్లు - ఐరన్ రాడ్లన్నింటినీ పలు వాహనాల్లో అక్కడ నుంచి తరలించారు. దీంతో చలనచిత్ర రంగానికి ఇక గుడ్‌ బై చెపుతూ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లో రాజకీయ అరంగ్రేటం చేసిన జనసేన నేత పవన్ కల్యాణ్‌కు తన తొలి ప్రయత్నంలోనే చుక్కెదురైంది. ఆయన తన తొలి రాజకీయ యాత్ర రాజధాని నుంచే ప్రారంభించాలని చేసిన ప్ర‌య‌త్నానికి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

కాగా, ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ పార్టీ కార్యాల‌యం విష‌యంలో తెలిసో.. తెలియకో జరిగిన తన తప్పిదాన్ని పవన్ కల్యాణ్ గౌరవప్రదంగా బహిరంగంగా ప్రకటించి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రికార్డులు ముందుగా స‌రి చూసుకోవాల్సింద‌ని అన్నారు.