Begin typing your search above and press return to search.

దేవ్‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతావా?

By:  Tupaki Desk   |   4 May 2018 4:56 AM GMT
దేవ్‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతావా?
X
ఇవాల్టి రోజున అబ‌ద్ధం చెప్ప‌టం అంత ఈజీ కాదు. విష‌యం ఏదైనా ఇట్టే వైర‌ల్ అయ్యే ప‌రిస్థితి. అయినా.. ప‌వ‌న్ లాంటి వ్య‌క్తికి రాజ‌కీయ వ్యూహ స‌ల‌హాదారుగా వ‌చ్చిన వ్య‌క్తి వ్యూహాత్మ‌కంగా త‌ప్పు చేశారా? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక వ్య‌క్తి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవ‌టం ఇవాల్టి రోజున అంత క‌ష్ట‌మైన విష‌యం కాదు. కాకుంటే.. రెండు మూడు రోజులు ప‌డుతుందంతే.

వీలైనంత‌వ‌ర‌కూ పార‌ద‌ర్శ‌కంగా ఉండాలే త‌ప్పించి.. క‌వ‌రింగ్ చేస్తే.. వాస్త‌వాలు వీడియోల రూపంలో ఆన్ లైన్లో ద‌ర్శ‌న‌మిస్తున్న రోజులివి. అయిన‌ప్ప‌టికీ.. త‌న‌కు సంబంధించిన విష‌యాల మీద ప‌వ‌న్ రాజ‌కీయ వ్యూహ‌స‌ల‌హాదారు చేసిన త‌ప్పు ఇప్పుడు ఆయ‌న ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేయ‌ట‌మే కాదు.. ఆయ‌న మాట‌ల మీద న‌మ్మ‌కం కుద‌ర‌న‌ట్లుగా చేసింది.

దేవ్ అలియాస్ వాసుదేవ్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన వ్యూహ‌క‌ర్త‌గా ప‌రిచ‌య‌మైన‌ప్పుడు అందరూ ఆయ‌న్ను ఉత్త‌రాదికి చెందిన వ్య‌క్తి అయి ఉంటార‌ని భావించారు. సూటుబూటుతో పాటు.. నాకు తెలుగు అంత బాగా రాదంటూ ఆయ‌న ప‌లికిన చిల‌క ప‌లుకుల్ని చూసి.. నిజ‌మేనేమో అనుకున్నోళ్లు చాలామందే. కానీ.. కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే బాబుగారు అన‌ర్గ‌ళంగా చేసిన తెలుగు ప్ర‌సంగాల వీడియో క్లిప్ లు ఆన్ లైన్లో ద‌ర్శ‌న‌మివ్వ‌టంతో జ‌న‌సేన వ‌ర్గాలతో పాటు.. ప‌వ‌న్ అభిమానులు సైతం కంగుతినే ప‌రిస్థితి.

ఇప్ప‌టికే ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్లు.. ప‌వ‌న్ రాజ‌కీయ స‌ల‌హాదారు విష‌యంలోనూ కొత్త వివాదం తెర మీద‌కు రావ‌టం.. అది త‌న‌కు తానే తెచ్చుకున్న‌ది కావ‌టంతో దేవ్ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ కిశోర్ ను ప‌రిచ‌యం చేసే స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిచ‌యం చేసిన మాట‌ల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు.

త‌మ పార్టీలో ప్ర‌శాంత్ కిశోర్ రోల్ ఎలా ఉండ‌బోతుంద‌న్న విష‌యాన్ని క్లారిటీగా చెప్పారు జ‌గ‌న్‌. ఆయ‌న గ‌తం అంద‌రికి తెలిసిందే అయినా.. పార్టీలో ఆయ‌నేం చేస్తార‌న్న విష‌యం మీద జ‌గ‌న్ స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. అయినా ఆ విష‌యాన్ని జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. జ‌నాల‌కు త‌న మాట‌ల‌తో షాకిచ్చిన దేవ్‌.. ప‌వ‌న్ ను సైతం అలాంటి క‌ల‌రింగే ఇచ్చారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేవ్‌ కు సంబంధించి కొత్త సందేహం ఇప్పుడు కొంద‌రిని ప‌ట్టి పీడిస్తోంది. ప‌వ‌న్ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త నియామ‌కం వెనుక ఇంకేదైనా మ‌త‌ల‌బు ఉన్న‌దా? అన్న‌ది సందేహంగా మారింది. ప‌వ‌న్ త‌న‌కు తానే త‌న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ను ఎంపిక చేసుకున్నారా? లేక ఆయ‌న ఎంపిక చేసుకునేలా తెర వెనుక ఏమైనా జ‌రిగిందా? అన్న అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దేవ్‌కు సంబంధించి కొత్త విష‌యాలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప‌వ‌న్ త‌న‌ను ప‌రిచ‌యం చేసే స‌మ‌యంలో సూటుబూటు ధ‌రించిన దేవ్‌.. ఇంగ్లిషులో మాట్లాడారు. ఆయ‌న పేరుతో పాటు.. భాష‌.. ఆహార్యం చూసినోళ్లంతా ఆయ‌న్ను ఉత్త‌రాదికి చెందిన వ్య‌క్తిగా భావించారు. అదేస‌మ‌యంలో త‌న ప్ర‌సంగం మ‌ధ్య‌లో త‌న‌కు తెలుగు అంత బాగా రాద‌న్న మాట ఇప్పుడో పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

త‌న ఉనికిని అంత‌గా దాచుకోవాల‌న్న ఆరాటం దేవ్ లో ఎందుకు క‌నిపిస్తుంద‌న్న ప్ర‌శ్న ఒక‌టైతే.. త‌న‌కు సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డించే విష‌యంలో ఆయ‌న ప్ర‌త్యేక జాగ్ర‌త్త తీసుకోవ‌టం వెనుక లోగుట్టు ఏమిటి? అన్న‌ది ఇప్పుడో పెద్ద చ‌ర్చ‌గా మారింది. గూగులమ్మ అంద‌రికి అందుబాటులోకి వ‌చ్చేశాక‌.. ఓవ‌ర్ నైట్ ప్ర‌ముఖులైనోళ్ల వివ‌రాలు సైతం ఇట్టే దొరికిపోతున్న ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. త‌న భాష‌కు సంబంధించి దేవ్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై రాజ‌కీయ‌.. మీడియా వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. దేవ్‌కు సంబంధించి తాజాగా మ‌రికొన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆయ‌న ఉత్త‌రాది వ్య‌క్తి ఏమాత్రం కాదు. హైద‌రాబాదీ. గ‌తంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన కిష‌న్ రెడ్డికి ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉండేవారు.

బీజేపీ నిర్వ‌హించిన అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న దేవ్‌.. ప్ర‌ధాని మోడీని.. బీజేపీని ఆకాశానికి ఎత్తేసేలా ప్ర‌సంగించేవారు. అది కూడా చ‌క్క‌టి తెలుగులోనే. త‌న‌కు తెలుగు అంత‌ బాగా రాద‌ని చెప్పిన రెండు నిమిషాల వ్య‌వ‌ధిలోనే.. అధికారం రెండు.. మూడు క‌మ్యూనిటీల గుత్తాధిపత్యం ఏమీ కాద‌ని చెప్ప‌టం చూస్తే.. స్థానిక రాజ‌కీయాల్లో బాగానే న‌లిగిన వ్య‌క్తిగా చెబుతున్నారు. తెలుగు విష‌యంలో త‌న బ్యాక్ గ్రౌండ్‌ ను దేవ్ ఎందుకు దాచిన‌ట్లు? ఈ విష‌యంలో ఆయ‌న అనుస‌రించిన వ్యూహం ఏదైనా ఇప్పుడు ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త మీద సందేహాలు వ్య‌క్తం చేసేలా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

జ‌న‌సేన వ‌ర్గాల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేలా దేవ్ ఎందుకు వ్య‌వ‌హ‌రించారు? అన్న‌ది ఇప్పుడా పార్టీలో జోరైన చ‌ర్చ సాగుతోంది. ఐదేళ్ల క్రితం బీజేవైఎం స‌భ్య‌త్వం తీసుకున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం ఒక‌వైపు.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌న‌త్ న‌గ‌ర్ బీజేపీ అభ్య‌ర్థి రేసులో నిలిచి ఉన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌న‌త్ న‌గ‌ర్ టికెట్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన దేవ్‌.. బీజేపీలో త‌నను తాను బ‌లోపేతం చేయ‌టం కోసం యువ‌తను ఉత్తేజ‌ప‌రిచేలా ఒక కార్య‌క్ర‌మాన్ని హ‌రిహ‌రక‌ళాభ‌వ‌న్ లో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌టం.. అది పెద్ద‌గా స‌క్సెస్ కాలేద‌ని చెబుతున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి త‌న‌కు ద‌గ్గ‌రైన కిష‌న్ రెడ్డితో పాటు.. బండారు ద‌త్తాత్రేయ‌ను కూడా పిలిచిన‌ట్లుగా గుర్తు చేసుకుంటున్నారు. అమీర్ పేట‌లో ఒక ఎంబీఏ కాలేజీ అధిప‌తిగా దేవ్ లోని కొత్త కోణం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న పూర్వ‌రంగం గురించి చెప్పిన దేవ్‌.. తాను కొన్ని పార్టీల‌తో క‌లిసి ప‌ని చేశాన‌ని.. అంత‌ర్జాతీయంగా కూడా కొన్ని పార్టీల‌కు ప‌ని చేయ‌టంపై గొప్ప‌లు చెప్పుకున్న దేవ్‌.. త‌న బీజేపీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎందుకు దాచి పెట్టిన‌ట్లు? ఎవ‌రైనా వ్య‌క్తి త‌న గ‌తాన్ని ఎందుకు వివ‌రంగా చెప్ప‌రు? అన్న క్వ‌శ్చ‌న్ మ‌న‌సులోకి వ‌చ్చినంత‌నే దేవ్ మీద సందేహాలు మ‌రిన్ని వ‌చ్చేస్తున్నాయి. ఇప్పుడు అంద‌రిలో మెదులుతున్న సందేహం ఏమిటంటే.. మీడియాలో దేవ్ మీద వ‌స్తున్న విష‌యాల గురించైనా ప‌వ‌న్‌ కు అవ‌గాహ‌న ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. దేవ్ త‌న గ‌తాన్ని చెప్ప‌లేద‌న్న సందేహంతో పాటు.. ఆయ‌న వివ‌రాల్ని ప‌వ‌న్ సైతం ఎందుకు స‌రిగా వివ‌రించ‌లేద‌న్న మాట‌కు స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి. ఇన్నేసి సందేహాలు వ‌చ్చేలా చేశావెందుకు దేవ్‌..?