Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పార్టీ పోటీ ఉంటుందా? లేదా?

By:  Tupaki Desk   |   14 Oct 2018 6:37 AM GMT
ప‌వ‌న్ పార్టీ పోటీ ఉంటుందా?  లేదా?
X
తెలంగాణ‌లో ఎన్నిక‌లు వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీఆర్ఎస్ జోరుగా ప్ర‌చారం చేస్తూ ప్ర‌త్య‌ర్థుల కంటే వేగంగా దూసుకెళుతుంటే.. మిగిలిన పార్టీలు త‌మ అభ్య‌ర్థుల్ని ఇంత‌వ‌ర‌కూ డిసైడ్ చేయ‌లేదు. ఇక‌.. జ‌న‌సేన అయితే అస‌లు పోటీ చేస్తుందా? లేదా? అన్న‌దే తేల్లేదు. ఇదే విషయాన్ని ప‌వ‌న్ ను అడిగితే.. మ‌రో నాలుగైదు రోజుల్లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని శ‌నివారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఒక‌వైపు అన్ని పార్టీలు ఎన్నిక‌ల ఏర్పాట్లు జోరుగా చేసుకుంటున్న వేళ‌.. అస‌లు పోటీలో ఉండాలా? లేదా? అన్న విష‌యం మీద ప‌వ‌న్ ఆలోచ‌న‌లు ఇంకా తేల‌క‌పోవ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత‌కూ తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ పోటీ చేసేందుకు ఉన్న అవ‌కాశాలు ఏమిటి? అన్న‌ది చూస్తే.. కొన్ని కొత్త విష‌యాలు క‌నిపిస్తాయి.

ఎవ‌రేమ‌న్నా ప‌వ‌న్ టార్గెట్ పూర్తిగా ఏపీనే త‌ప్పించి తెలంగాణ ఎంత‌మాత్రం కాదు. ఆ మాట‌కు వ‌స్తే.. తెలంగాణ‌లో కేసీఆర్ తో త‌గువు పెట్టుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ లేర‌న్న విష‌యం తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. గ‌తంలో కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర‌వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో ఒక్క‌టంటే ఒక్క విమ‌ర్శ చేస్తున్న‌ది లేదు. అలాంటప్పుడు పోటీకి దిగితే కేసీఆర్ మీద ఏదో ఒక విమ‌ర్శ చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.ఒక‌వేళ ఘాటు విమ‌ర్శ‌లు చేసినా.. ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశం ఉందా? అంటే.. లేద‌నే చెప్పాలి.

తెలంగాణ‌లో పార్టీనే స‌రిగా లేని వేళ‌.. ప‌వ‌న్ పోటీ వ‌రకూ వెళ‌తారా? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. అయితే.. కాంగ్రెస్‌.. టీడీపీకి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ నిర్ణ‌యం తీసుకుంటార‌న్న ప్ర‌చారం సాగుతోంది. విప‌క్షాలు బ‌లంగా ఉన్న చోట్ల జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి నిల‌ప‌టం ద్వారా అధికార‌పార్టీకి ల‌బ్థి చేకూరేలా చేస్తార‌న్న మాట వినిపిస్తోంది.

ఒక‌వేళ ఇలాంటి నిర్ణ‌యాన్ని తీసుకుంటే ప‌వ‌న్ బ‌ద్నాం కావ‌టం ఖాయం. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ మీద ఉన్న సానుకూల‌త చాలామందిలో చెరిగిపోవ‌ట‌మే కాదు.. ఇదంతా ఏపీలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మారే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ పోటీకి దిగ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యం తీసుకుంటే.. ఏ స‌మ‌స్య ఉండ‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ‌లో పోటీ చేసి ఎలాంటి ఫ‌లితాన్ని ప్ర‌ద‌ర్శించ‌నిప‌క్షంలో ప‌వ‌న్ మీద ఉన్న అంచ‌నాలు త‌గ్గిపోవ‌ట‌మే కాదు.. ఏపీలో ఆయ‌నేదో చేస్తారన్న అభిప్రాయం తుడిచిపెట్టుకుపోతుంది. మొత్తంగా ప‌వ‌న్ కు భారీ రాజ‌కీయ న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంది.

బ‌లం లేని చోట బ‌రిలోకి దిగ‌టానికి మించిన పిచ్చి ప‌ని మ‌రొక‌టి ఉండ‌దు. దాని స్థానే.. తెలంగాణ‌లో త‌న‌కున్న బ‌లాన్ని గుప్పిట మూసి ఉంచిన‌ట్లుగా గుంభ‌నంగా ఉంటున్న ప‌వ‌న్‌.. అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తూ.. ఏపీ ఎన్నిక‌ల ల‌క్ష్యంగా ప‌ని చేస్తేనే ఆయ‌న‌కు మంచిద‌న్న అభిప్రాయం ప‌లువురి నోట వినిపిస్తోంది. మ‌రి.. గుప్పిట తెరిచి.. తెలంగాణ‌లో త‌న బ‌లం ఎంత‌న్న‌ది చూపిస్తారా? లేదంటే.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి తాము సంసిద్ధంగా లేమ‌న్న మాట‌ను చెప్పి త‌ప్పించుకుంటారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.