Begin typing your search above and press return to search.

మహాకూటమికి దడపుట్టిస్తున్న జనసేన

By:  Tupaki Desk   |   12 Oct 2018 5:12 AM GMT
మహాకూటమికి దడపుట్టిస్తున్న జనసేన
X
తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో వేగంగా మార్పులు చోటుచోసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో జనసేన సత్తా నిరూపించుకునేందుకు రెడీ అవుతోంది. అభిమానులనే కార్యకర్తలుగా, అసంతృప్తులనే నేతలుగా మలుచుకునేందుకు పావులు కదుపుతోంది. ఆ పార్టీని చూసి కాంగ్రెస్, కూటమి పార్టీల నేతలకు నిద్ర కరువవుతోంది.

ఇప్పటి వరకు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద అధికార టీఆర్ ఎస్ తో పాటు కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - సీపీఎం - టీజేఎస్ - ఎంఐఎం - బీజేపీలే ఉన్నాయి. టీఆర్ ఎస్ ను ఓడించడానికి సీపీఎం - బీజేపీ - ఎంఐఎం మినహా మిగతా పార్టీలు మహా కూటమిగా ఏర్పడ్డాయి. సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి తీసుకురావడానికి కూటమి నేతలంతా కలిసి కసరత్తు చేసి ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు.

కానీ, అన్ని పార్టీల్లో ఆశవహుల సంఖ్య ఎక్కువగానే ఉండటంతో అసమ్మతి సెగలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. టీఆర్ ఎస్ వ్యతిరేక ఓటే లక్ష్యంగా కూటమి పెద్దలు పావులు కదుపుతున్నారు. మరోపక్క అంతర్గతంగా సీట్ల సర్దుబాటు విషయంలో చెలరేగుతున్న దుమారాన్ని చల్లార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ ఎస్ లో సీటు దొరకని వారు కూటమిలోకి జంప్ అవుతున్నారు. అక్కడ కూడా హామీ దొరక్కపోతే ప్రత్యామ్నాయం ఏమిటనే ఆలోచనలో పడిపోయారు చాలా మంది. ఇదే అవకాశంగా జనసేన పార్టీ తెలంగాణ రణరంగంలోకి దూకబోతున్నట్టు సమాచారం.

అసమ్మతులను చేర్చుకుని పార్టీ టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుందట జనసేన. ఈ పరిమాణాన్ని గమనించిన కాంగ్రెస్ నేతలు ఒకింత కలవరపాటుకు గురవుతున్నారు. గెలుపే లక్ష్యంగా చేసుకున్న బరిలోకి దిగిన కూటమి అభ్యర్థులకు కొత్త పార్టీ సవాలుగా మారుతుందని ఆందోళన చెందుతున్నారట. మరో పక్క ఎంఐఎం - బీజేపీలు కూడా అభ్యర్థులను నిలిపి సంప్రదాయ ఓటింగ్ పొందేందుకు శ్రమిస్తున్నాయి.

జనసేన ఏపీలో సీపీఐ - సీపీఎంలతో కలిసి వెళ్తుంది. మరి తెలగాణాలో కూడా ఇదే సీన్ రిపీట్ అయితే, మరి కూటమి పరిస్థితి ఏమిటి అన్న సందేహం ఉదయిస్తోంది. టీఆర్ ఎస్ పై వ్యతిరేక ఓటు జనసేనకు పడితే అది ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ కు దెబ్బగా అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా జనసేన రాకతో ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం ఉంది. దీని ప్రభావం కూటమి అభ్యర్థులపై ఎక్కువ ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. అయితే తెలంగాణలో ఆది నుంచి టీఆర్ ఎస్ తో సఖ్యతతో వెళుతున్న జనసేనాని పవన్.. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు లబ్ధి చేకూర్చడానికే అసమ్మతులతో కలిసి పోటీ చేయిస్తున్నట్టు సమాచారం. ఇలా అయితే టీఆర్ ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పోకుండా జనసేనకు పడుతుందని. ఇది అంతిమంగా కాంగ్రెస్ కు చేటు తెస్తుందని సమచాారం. అందుకే టీఆర్ ఎస్ తో తెరవెనుక లాబీయింగ్ మేరకే జనసేన ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది.