Begin typing your search above and press return to search.

పవన్‌కు ఆ పని సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   5 Nov 2017 2:03 PM GMT
పవన్‌కు ఆ పని సాధ్యమేనా?
X
రెండు పడవల ప్రయాణం, జోడు గుర్రాల సవారీ అంత సులభమైన సంగతి కాదు. మరి పవన్ కల్యాణ్ అంత సాహసానికి ఒడిగడతారా? ఆయనకు జోడుగుర్రాల సవారీ కుదురుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ మీద సమానంగా ఫోకస్ పెట్టి, సమానంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రజల మద్దతును కూడగట్టుకోగల స్థాయిలో పవన్ వద్ద సమయం ఉందా? ఓపిక ఉందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.

పవన్ కల్యాణ్ తన పార్టీ తొలి రాజకీయ కదలికగా 42 ఎంపీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిల ఎంపిక ప్రక్రియ గురించి ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఇలాంటి చర్చ జరుగుతోంది. పవన్ తొలినుంచి మొత్తం తెలుగు ప్రాంతంపై తన పార్టీ ఫోకస్ ఉంటుందని చెబుతూ వచ్చినప్పటికీ.. ఇప్పటిదాకా ఆయన వ్యవహరించిన శైలి, కార్యక్రమాలు నిర్వహించిన తీరు, చేపట్టిన ప్రజాసమస్యలను బట్టి ఏపీ మీదనే ఎక్కువ శ్రద్ధ ఉంటుందని ... అక్కడే ఆయన రాజకీయాల్లోకి దిగుతారని అంతా అనుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ తన జనసేన కూడా జాతీయ పార్టీ అని చెప్పుకోదగ్గ స్థాయిలో రెండు తెలుగురాష్ట్రాల్లోని 42 ఎంపీ నియోజకవర్గాలకు ఒకేసారి ఇన్ ఛార్జిల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.

రెండు రాష్ట్రాల్లో ఒక పార్టీ విస్తరణ గురించి శ్రద్ధ పెట్టడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. పైగా జనసేన తరహాలో కొత్త పార్టీగా అవతరిస్తున్నప్పుడు అది మరింత కష్టం కూడా. ఒకవైపు రాజకీయాల్లో నలభయ్యేళ్ల సుదీర్ఘమైన అనుభవం, అపరిమితమైన వ్యూహచాతుర్యం, నిర్ణయాత్మక శక్తి ఇవన్నీ ఉన్నాయని చెప్పుకునే చంద్రబాబునాయుడు కు కూడా రెండు రాష్ట్రాల్లో పార్టీగురించి సమానంగా పట్టించుకోవడం సాధ్యం కావడం లేదు. అందుకే ఆయన తెలంగాణలో మూల్యం చెల్లిస్తున్నారు. అదే స్థాయి కాకపోయినా.. దాదాపు ఇంతటిఅనుభవజ్ఞుడు అయిన కేసీఆర్ కు ఏపీతో పనే లేదు. ఇక్కడితోనే సరిపోతోంది. మరి పవన్ తన కొత్త పార్టీని మొత్తం రెండు రాష్ట్రాల్లో సమానంగా ప్రజల ఆదరణ చూరగొనగలిగేలా.. తాను శ్రద్ధ పెట్టి, రెండు చోట్ల సమానంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు నడిపించగలరా? అనేది వేచిచూడాలి.

కేవలం ఇన్ఛార్జిల ఎంపికతో సరిపోదు. పార్టీ విస్తరణకు అధినేతగా, ఆ పార్టీలో ప్రస్తుతానికి ప్రజాదరణ, కరిష్మా ఉన్న ఏకైక నాయకుడిగా పవన్ కల్యాణ్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ అంశాలను ఆయన దృష్టిలో ఉంచుకోవాలి.