Begin typing your search above and press return to search.

జైట్లీ తొండాట బండారం బ‌య‌ట‌ప‌డిందిగా!

By:  Tupaki Desk   |   4 March 2018 4:53 AM GMT
జైట్లీ తొండాట బండారం బ‌య‌ట‌ప‌డిందిగా!
X
అధికారంలోకి రావ‌టానికి ఏపీ సీట్ల‌ను కీల‌కంగా చేసుకొన్న యూపీఏ స‌ర్కారు విభ‌జ‌న‌తో.. ఆంధ్రుల‌కు ఎంత అన్యాయం చేసిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. విభ‌జ‌న అనివార్య‌మైన‌ప్పుడు.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స‌రిపోయేది. అది సాధ్యం కాదంటే.. వీలైనంత త‌క్కువ న‌ష్టం వాటిల్లేలా విభ‌జ‌న చేసినా ఇబ్బంది ఉండేది కాదు.

విభ‌జ‌న చ‌ట్టంతో ఏపీకి అంతో ఇంతో మేలు చేయాల‌నుకుంటే దానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉండేలా.. ప‌వ‌ర్లో ఏ ప్ర‌భుత్వం ఉన్నా టైం ఫ్రేంలో సాయం అందేలా చ‌ట్టాన్ని రూపొందించినా స‌రిపోయేది. కానీ.. ఇవేమీ చేయ‌కుండా హ‌డావుడిగా విభ‌జ‌న చేసేసిన దాని ఫ‌లితం ఈ రోజు ఏపీ ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్నారు.

విభ‌జ‌న జ‌రిగి నాలుగేళ్లు అవుతున్నా.. ఏపీకి అందాల్సిన సాయం ఇప్ప‌టివ‌ర‌కూ స‌రిగా అంద‌ని ప‌రిస్థితి. అదేమంటే.. ఇప్ప‌టికే ఏపీకి చాలా చేశామ‌న్న మాట‌ను మోడీ స‌ర్కారు.. బీజేపీ నేత‌లు చెప్పుకుంటున్నారు. ఏపీకి ఇవ్వాల్సిందేమిటి? ఇప్ప‌టికి ఇచ్చిందేమిటి? అన్న లెక్క చిక్కుముడిగా మారిన వేళ‌.. ఆ లెక్క‌లు తేలుస్తామంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుకు వ‌చ్చారు. త‌న‌కు తానుగా ఈ ఇష్యూను టేక‌ప్ చేసి.. ఫ్యాక్ట్ క‌మిటీగా ఒక నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేశారు.

వారంతా ఏపీకి ఇవ్వాల్సిందేమిటి? నాలుగేళ్లుగా ఇచ్చిందేమిటి? అన్న అంశంపై కొద్దిరోజులుగా క‌స‌రత్తు చేసి లెక్క‌లు తేల్చారు. జేపీ.. ఉండ‌వ‌ల్లితో పాటు న‌లుగురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు క‌లిసి త‌మ‌కున్న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి అధికారిక పత్రాల్ని తీసుకొచ్చి ప‌రిశీలిస్తే..గుండెలు ప‌గిలిపోయే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

కొన్ని వంద‌ల పేజీల ప‌త్రాల్ని ప‌రిశీలించి లెక్క తేలిస్తే బ‌య‌ట‌ప‌డిన విష‌యాల్ని సింఫుల్ గా చెప్పాలంటే.. గ‌డిచిన నాలుగేళ్లుగా ఏపీ స‌ర్కారుకు మోడీ స‌ర్కారుకు ముష్టి కూడా విద‌ల్చ‌లేద‌ని తేలింది. ఏపీ బ‌కాయిల గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడు ప‌న్నుల లెక్క‌ల‌పై క్లారిటీ రాలేద‌ని చెబుతారు.

కానీ.. ప‌వ‌న్ ఏర్పాటు చేసిన బృందం అలాంటి ఇబ్బందుల్ని అధిగ‌మించి మ‌రీ లెక్క‌ల‌పై కొంత స్ప‌ష్ట‌త తీసుకురావ‌టం గ‌మ‌నార్హం. ప‌ద‌కొండు జాతీయ స్థాయి విద్యా సంస్థ‌ల‌కు సంబంధించి రూ.11వేల కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ఇచ్చింది కేవ‌లం రూ.600 కోట్లేన‌ని తేల్చారు. అంతేకాదు.. తొమ్మిది జాతీయ సంస్థ‌ల్ని మాత్ర‌మే ఇచ్చార‌ని తేలింది. అనుమ‌తులు ఇచ్చిన వాటికి కూడా నామ‌మాత్ర‌పు నిధులే ఇచ్చిన‌ట్లుగా తేలింది. నాలుగేళ్ల‌లో తొమ్మిది విద్యాసంస్థ‌ల‌కు 5 శాతం నిధులు మాత్ర‌మే ఇచ్చిన‌ట్లుగా ప‌వ‌న్ ఏర్పాటు చేసిన క‌మిటీ తేల్చింది.

ఈ లెక్క‌న మిగిలిన మొత్తాన్ని ఎప్ప‌టికి విడుద‌ల చేస్తారు? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. ఇలా ముష్టి విదిల్చిన‌ట్లుగా విదిలుంచుకుంటూ వెళితే.. స‌ద‌రు జాతీయ సంస్థ‌లు పూర్తిస్థాయిలో ప‌ని చేయ‌టానికి ఎన్నేళ్లు ప‌డుతుంద‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.

పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధుల విష‌యంలోనూ కేంద్రం తొండాటే ఆడుతోంద‌ని తేల్చారు. షెడ్యూల్ ప్ర‌కారం కేంద్ర‌మే ప్రాజెక్టు ఖ‌ర్చును భ‌రించాల్సి ఉంటుంది. రైల్వే జోన్ మొద‌లు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏ అంశం గురించి ప్ర‌స్తావించినా వ‌య‌బులిటీ గురించి మాట్లాడుతున్నార‌ని ప‌వ‌న్ మండిప‌డుతున్నారు. ఈ లెక్క‌న ఏ వ‌య‌బులిటీని చూసి రాష్ట్ర విభ‌జ‌న చేశారు? అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

రాంవిలాస్ పాశ్వాన్ కు చెందిన హాజీపూర్ ను రైల్వేజోన్ ను ఏర్పాటు చేసిన వారు విశాఖ‌ను రైల్వేజోన్ గా ఎందుకు చేయ‌టం లేద‌న్న ప్ర‌శ్న‌తో పాటు.. దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టుకు ప‌ర్యావ‌ర‌ణ‌.. భ‌ధ్ర‌తా స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లుగా కేంద్రం చెబుతోంద‌ని.. దీనికి ప్ర‌త్యామ్నాయ ప్ర‌దేశాన్ని చూపించాల‌ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ చూపించ‌లేద‌న్న కొత్త విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

మొత్తంగా చూస్తే.. ఏపీ ఇష్యూల మీద కేంద్రానికి ఎలాంటి సీరియ‌స్ నెస్ లేద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ ఏర్పాటు చేసిన క‌మిటీ తేల్చింద‌ని చెప్పాలి. అంతేకాదు.. జైట్లీ చెప్పే మాట‌ల‌న్నీ తొండాటే త‌ప్పించి ఏపీకి ఏదైనా చేయాల‌న్న భావ‌న లేద‌న్న‌ది అర్థంకాక మాన‌దు.

ఇదంతా చూసిన‌ప్పుడు.. ఏపీ ప్ర‌జ‌ల ప‌ట్ల కేంద్రానికి ఉన్న చుల‌క‌న ఆంధ్రోళ్ల‌ను మ‌రింత మంట‌పుట్టేలా చేయ‌ట‌మే కాదు.. తాము ఈ దేశానికి చెందిన ప్ర‌జ‌లం కాదా? అన్న భావ‌న రానున్న రోజుల్లోక‌లుగుతుంద‌న్న ఆందోళ‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. అదే జ‌రిగితే దేశ స‌మ‌గ్ర‌త‌కే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న మాట వినిపిస్తోంది.