Begin typing your search above and press return to search.

పవన్ : పువ్వు పుట్టకముందే పరిమళిస్తోంది

By:  Tupaki Desk   |   10 Feb 2018 1:51 PM GMT
పవన్ : పువ్వు పుట్టకముందే పరిమళిస్తోంది
X
పవన్ కల్యాణ్ కు స్పష్టత ఉందా? తాను ఏ విషయంలో పోరాటం సాగించాలని అనుకుంటున్నారో.. ఒక నిర్దిష్టమైన ఎజెండాతోనే ఆయన ముందుకు వెళుతున్నారా? రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి మేధావులందరినీ కలుపుకుని ఐక్య పోరాటం సాగించడానికి ఒక జేఏసీని కూడా కార్యరూపంలోకి తీసుకురావడానికి పవన్ కల్యాణ్ సిద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా వినిపిస్తున్న సంగతి ఏంటంటే.. పవన్ కల్యాణ్ జేఏసీ (ఆయన తాజాగా ట్విటర్ ద్వారా ప్రకటించిన ప్రకారం జేఎఫ్‌ సీ) ఇంకా పురుడు పోసుకోక ముందే.. అందులో లుకలుకలు బయల్దేరాయని. జేఎఫ్‌ సీ లో కీలకంగా ఉండగలరని పవన్ ప్రకటన ద్వారా తెలిసిన పేర్ల ప్రకారం.. ఆ నాయకుల్లో పోరాటాన్ని ఇంకా ఎవరి సహకారం తీసుకుంటూ.. ముందుకు సాగాలనే విషయంలో అభిప్రాయ భేదాలు - లుకలుకలు ఉన్నాయని తెలుస్తోంది.

స్పష్టత విషయంలో ఇంకా బోలెడు అనుమానాలున్నాయి. ముందుగా పోరాటం దేనికోసం? అనేది తేలాలి. హోదా కోసమా? విభజన హామీల కోసమా? ఈ విషయంలోనే ఆయన ఎంచుకున్న నేతల మధ్య భావవైరుధ్యాలు ఉన్నాయి. జేపీ ప్యాకేజీ అయినా పర్లేదంటారు. ఉండవిల్లి - రామకృష్ణ - శ్రీనివాస్ హోదా తప్పనిసరి అంటారు. అలాగే పోరాటం ఎవరిమీద? చంద్రబాబు వైఫల్యం మీదనా? కేంద్ర వంచన మీదనా? చంద్రబాబుమీద ఈగ వాలడానికి ఈ నలుగురిలో ఒకరిద్దరికి ఇష్టం ఉండకపోవచ్చు. అలాగే ఎవరెవరిని కలుపుకుపోవాలి? తెదేపాను కూడా పోరాటంలో భాగం చేసుకోవాలనే భావనతో కొందరు , హోదాకోసం తొలినుంచి గళమెత్తుతోంది గనుక.. వైకాపాకు చోటు ఇవ్వడం ధర్మం అని కొందరు భావిస్తున్నారని సమాచారం.

ఈ రకంగా అనేక విషయాల్లో పవన్ జేఎఫ్‌ సీ పుట్టక ముందే ఇబ్బందుల్లో పడుతోంది. అభిప్రాయ భేదాల మధ్య సతమతం అవుతోంది. పవన్ కల్యాణ్ కు సంబంధించినంత వరకు.. ఈ జేఎఫ్‌ సీ ఉద్యమం ముందుకు సాగడానికి ఆయన వీరందరినీ ఎలా చక్కబెట్టుకుంటూ.. ప్రతి ఇద్దరి మధ్య ఉండే మేథో వైరుధ్యాలను దారిలోకి తెచ్చుకుంటూ ముందుకు సాగుతారో వేచిచూడాలి. ఈ జేఎఫ్‌ సీ గనుక విఫలమైతే.. దాని ప్రభావం పవన్ కల్యాణ్ మరియు జనసేన మీద చాలా తీవ్రంగా ఉంటుందని అనుకోవాలి.