Begin typing your search above and press return to search.

ఇలాంటివి పవన్ కు మాత్రమే సాధ్యమేమో..?

By:  Tupaki Desk   |   9 Sep 2016 8:03 PM GMT
ఇలాంటివి పవన్ కు మాత్రమే సాధ్యమేమో..?
X
పవన్ కల్యాణ్ సభ అంటే చాలు.. అదో సంచలనం. అదో హాట్ టాపిక్. పనుల్ని విడిచిపెట్టి మరీ.. పవన్ మాటల్ని వినేందుకు ఉత్సాహం ప్రదర్శించే వారికి కొదవ లేదు. ఇంతకీ పవన్ మాటల్లో ప్రత్యేకత ఏమిటి? ఆయన మాటల్లో ఉండే మేజిక్ ఏమిటన్నది ఒక ప్రశ్న. నిజానికి పవన్ కల్యాణ్ స్పీచ్ అంత గొప్పగా ఏమీ ఉండదు. ఆయన ప్రసంగంలో భావోద్వేగం కంటిన్యూషన్ కూడా ఉండదు. అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ.

కాకుంటే సూటిగా మాట్లాడే విధానం.. మిగిలిన రాజకీయ నేతల డాబు మాటలకు భిన్నంగా సాదాసీదాగా మాట్లాడేయటం.. తనకు నచ్చని వారిని (సైద్ధాంతికంగా) సూటిగా ప్రశ్నించటమే కాదు.. అవసరమైతే ఎంత మాటకైనా రెఢీ అన్నట్లుగా ఉండటం పవన్ కు మాత్రమే సాధ్యమేమో. తన వెనుక ఎవరో ఉన్నారని.. వారి కారణంగా తాను మాట్లాడుతున్నట్లుగా విమర్శలు చేసే వారిపై విరుచుకుపడిన పవన్.. తన వెనుక ఎవరుంటారనటమే కాదు.. తనను ఒకరు నడిపించేదేంటంటూ దమ్ముగా చెప్పేశారు. ఇంత దమ్ముగా మాట్లాడే నేతలు రాజకీయాల్లో ఎక్కడా కనిపించరు.

తొలినాళ్లలోనే కాంగ్రెసోళ్ల పంచెలూడదీసి కొట్టండంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడి.. సంచలనం సృష్టించిన పవన్ కల్యాణ్.. తాజాగా అంతటి ఘాటు పదజాలాన్ని వాడనప్పటికీ.. సీమాంధ్రఎంపీలు తల ఎత్తుకోలేనంతగా మండిపడ్డారని చెప్పాలి. ఒంటికి కారం రాసుకొని.. రెండు కారం ముద్దల్ని తిని వెళ్లి లోక్ సభలో కూర్చోవాలని.. అప్పటికి కూడా పౌరుషం రాకుంటే తాను సైతం ఏమీ చేయలేనని వ్యాఖ్యానించారు.

ఏపీ ఎంపీల్ని టోకుగా ఉతికి ఆరేయటమే కాదు.. తాము ఎంపీలమన్న మాట చెప్పుకునేందుకు సైతం సిగ్గుపడేలా చేయటంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. నిజానికి ఇంత దమ్ముగా మాట్లాడటం పవన్ కల్యాణ్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో..? ఇంతేనా.. జై ఆంధ్రా ఉద్యమ సమయంలో ప్రాణాలు అర్పించిన 400 మంది సీమాంధ్రుల గురించి ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. త్యాగధనుల్ని సీమాంధ్ర నేతలు ఎంత నిర్లక్ష్యం చేశారో చెప్పకనే చెప్పేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఘన నివాళి ఇవ్వటంతో పాటు.. వారికి స్మారక స్థూపం కట్టించారని.. కానీ ఏపీలో అలాంటివి కనిపించవన్న విషయాన్ని గుర్తు చేయటం చూసినప్పుడు.. త్యాగధనుల విషయంలో సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఇప్పటివరకూ మరే సీమాంధ్ర అధినేత సైతం ప్రస్తావించని ఒక విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పేశారు. విభజనసమయంలో సీమాంధ్రుల్ని ఉద్దేశించి చులకన భావంతో.. అవమానించేలా మాట్లాడరన్న విషయాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. తెలంగాణకు అన్యాయం చేసింది సీమాంధ్ర నేతలు మాత్రమే కాదు.. తెలంగాణనేతలు కూడా అన్న విషయాన్ని మర్చిపోకూడదన్న విషయాన్నిస్పష్టం చేశారు. తెలంగాణ అన్యాయానికి నాటి తెలంగాణ..సీమాంధ్ర నేతలు కారణమైనా.. తప్పులన్నీ సీమాంధ్రులవే అన్నట్లుగా విమర్శలు చేయటం.. తిట్టటం ఏ మాత్రం సరికాదన్న విషయాన్ని చెప్పేశారు. గడిచిన దశాబ్దాల కాలంలో ఏ అధినేత.. నేత ప్రస్తావించని ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన దమ్ము పవన్ సొంతం. అంతేకాదు.. సీమాంధ్రులు ఏం పాపం చేశారని దారుణమైన అవమానాలకు గురయ్యారంటూ సీమాంధ్రులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడిన వారిపై తన గుస్సాను ప్రదర్శించారు. సూటిగా.. స్పష్టంగా.. నగ్న సత్యాల్ని దమ్ముగా బయటపెట్టే ధైర్యం పవన్ కు మాత్రమే సొంతం. అదే ఆయన్ను అందరిలోనూ భిన్నంగా నిలుపుతోంది.