Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కు ఫ్యాన్స్ చెప్పిన పాఠం ఏంటంటే...

By:  Tupaki Desk   |   9 July 2018 6:01 PM GMT
ప‌వ‌న్‌ కు ఫ్యాన్స్ చెప్పిన పాఠం ఏంటంటే...
X
జ‌న‌సేన అధినేత‌ - సినీ న‌టుడు ప‌వన్ క‌ళ్యాణ్‌ కు త‌న పొలిటిక‌ల్ దూకుడులో భాగంగా వేసిన కీల‌క స్టెప్ ద్వారా `మిశ్ర‌మ అనుభూతి` క‌లిగింద‌ని అంటున్నారు. అదే త‌న అన్న చిరంజీవి ఫ్యాన్స్ బ‌లాన్ని త‌న ఖాతాలో చేర్చుకునేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నించ‌గా...అది కాస్త దారితెన్ను ముగిసిన‌ట్లుంద‌ని చ‌ర్చ సాగుతోంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో మెగా అభిమానుల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు జనసేన పార్టీలో చేరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ స‌మావేశం ఏం మిగ‌ల్చ‌నుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఆయ‌న‌కు ఫ్యాన్స్ అసంతృప్తి మిగిల్చార‌ని అంటున్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ``ఎప్పుడూ నా పేరుతో ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టించలేదు. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానుల్లో నేనూ ఒకడిని. జనసేన పార్టీ బయట వారిది కాదు. చిరంజీవి అభిమానులదే. ఎందుకంటే నేనూ చిరు అభిమానినే’ అని అన్నారు. అయితే ప‌వ‌న్ స్పీచ్ ఇలా ఓ వైపు కొన‌సాగుతుండ‌గానే మ‌రోవైపు ఇటు చిరు ఫ్యాన్స్ అటు ప‌వ‌న్ ఫ్యాన్స్ నినాదాలు చేయ‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది. ప‌వ‌న్ సీఎం అంటూ కొంద‌రు....జై చిరంజీవి అంటూ ఇంకొంద‌రు..మెగాస్టార్ జిందాబాద్ అంటూ ఇంకొంద‌రు ఇలా ఫ్యాన్స్ హ‌డావుడితో హాల్‌ లో ఒక‌ర‌కంగా గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు..కార్య‌క్ర‌మం నిర్వ‌హణ ప్ర‌ణాళిక లోపం ఉంద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు ఈ స‌మావేశం సంద‌ర్భంగా ప‌వ‌న్ స్పీచ్ సైతం సాదాసీదాగా సాగింద‌ని చ‌ర్చ వినిపిస్తోంది. ఎప్ప‌ట్లాగే ప‌వ‌న్ త‌న ఉద్రేక పూరిత ప్ర‌సంగం చేశార‌ని, ఇంకా చెప్పాలంటే..ఇదో సినిమా ఫంక్ష‌న్‌ లాగా జ‌రిగిందే త‌ప్ప రాజ‌కీయ పార్టీకి చెందిన కార్య‌క్ర‌మం అనిపించుకోలేద‌ని అంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం రాబోయే ఎన్నిక‌ల్లో మెగా ఫ్యాన్స్ ఏ విధంగా త‌న‌కు స‌హ‌క‌రించాల‌నే విష‌యంలో స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ వివ‌రించ‌లేద‌ని చెప్తున్నారు. ఒక మార్పు కోసమే జనసేన యుద్ధం చేస్తోందని తెలిపిన ప‌వ‌న్ మెగా ఫ్యాన్స్‌కు ఈ విష‌యంలో స్ప‌ష్టమైన మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌లేద‌ని అంటున్నారు.