Begin typing your search above and press return to search.

వారిని వారం టైం అడిగిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   8 Dec 2017 8:26 AM GMT
వారిని వారం టైం అడిగిన ప‌వ‌న్‌
X
మూడు రోజులుగా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ రోజు (శుక్ర‌వారం) విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఒక వేదిక‌ను ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో స‌మ‌స్య‌లు ఉన్న వారిని పిలిపించారు. అందులో భాగంగా తొలి అవ‌కాశం ఫాతిమా వైద్య క‌ళాశాల వ్య‌వ‌హారం మీద బాధిత విద్యార్థులు త‌మ ఆవేద‌న‌ను పంచుకున్నారు.

తాము ఎలాంటి త‌ప్పు చేయ‌న‌ప్ప‌టికీ.. కాలేజీ పొర‌పాటుకు త‌మ‌పై శిక్ష వేయ‌టం స‌రికాద‌న్న ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. వైద్య విద్యార్థుల‌తో పాటు వారి తల్లిదండ్రుల వ‌ద్ద‌కు వ‌చ్చి క‌న్నీరు పెట్టుకున్నారు. తాము ఇప్ప‌టికే ఎంతోమంది నేత‌ల్ని క‌లిశామ‌ని.. కానీ త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌టం లేద‌న్నారు.

క‌ళాశాల యాజ‌మాన్యం చేసిన త‌ప్పుల‌కు విద్యార్థుల్ని బ‌లి చేస్తారా? అంటూ ప్ర‌శ్నించారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చోటు చేసుకున్న ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తే త‌మ జీవితాలు బాగుప‌డ‌తాయ‌ని వ్యాఖ్యానించారు. విద్యార్థులు.. వారి త‌ల్లిదండ్రులు చెప్పిన అంశాల్ని అసాంతం విన్న ప‌వ‌న్‌.. వారికి న్యాయం చేస్తాన‌న్నారు.

ఫాతిమా వైద్య క‌ళాశాల విష‌యంలో ఏపీ మంత్రి కామినేనితో మాట్లాడతాన‌న్నారు. స‌మ‌స్య‌కు ఉన్న పరిష్కార మార్గాల్లో ఒక‌టైన నోటిఫికేష‌న్ జారీ చేసే అంశాన్ని ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భ‌విష్య‌త్తు కోసం పోరాటం చేసేందుకైనా తాను సిద్ధ‌మ‌న్నారు. విద్యార్థుల‌కు క‌చ్ఛితంగా న్యాయం జ‌రుగుతుంద‌న్న ఆయ‌న‌.. విద్యార్థి ఉద్య‌మానికి తాను అండ‌గానిలుస్తాన‌న్నారు. త‌న‌కు వారం వ్య‌వ‌ధి ఇస్తే ఈ ఇష్యూను క్లోజ్ చేస్తాన‌న్నారు.

ఈ ఉదంతంలో ఎవ‌రైనా బెదిరిస్తే జ‌న‌సేన అండ‌గా నిలుస్తుందంటూ అభ‌య‌మిచ్చారు. మ‌రో నెల‌రోజుల్లో ప‌రీక్ష‌లు ఉన్నందున.. స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని.. లేదంటే త‌మ ప్ర‌వేశాల్ని ర‌ద్దు చేస్తార‌ని చెప్పారు. క‌ళాశాల యాజ‌మాన్యం త‌మ‌ను మోసం చేశాయ‌ని ఆరోపించారు. దీనిపై స్పందించిన ప‌వ‌న్‌.. విద్యార్థుల భ‌విష్య‌త్తు నాశ‌నం అవుతుంటే.. కూర్చొని ఊరికే ఉండ‌న‌ని చెప్పారు. వారం రోజుల్లో త‌ప్ప‌నిస‌రిగా న్యాయం చేస్తామ‌ని చెప్పారు. మ‌రి.. వారం వ్య‌వ‌ధిలో ప‌వ‌న్ తాను ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటారా? అన్న‌ది చూడాలి.