Begin typing your search above and press return to search.

పవన్ కు ఇంటర్నేషనల్ సలహాదారు?

By:  Tupaki Desk   |   10 Feb 2017 9:39 AM GMT
పవన్ కు ఇంటర్నేషనల్ సలహాదారు?
X
స్టీవెన్ జార్డింగ్.. ఈ పేరు చాలాకాలంగా అంతర్జాతీయ రాజకీయ ప్రముఖుల మధ్య వినిపిస్తోంది. హార్వర్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే హార్వర్డ్ కెనడీ స్కూల్ లో పబ్లిక్ పాలసీ పాఠాలు చెప్పే ప్రొఫెసర్ అయిన జార్డింగ్ పేరు అంతగా ఎందుకు పాపులర్ అయిందో తెలుసా..? ప్రపంచంలో చాలామంది నేతలకు ఆయన ఎన్నికల - ప్రచార వ్యూహాలు రచించడమే దానికి కారణం. అలాంటి టాప్ మోస్ట్ క్యాంపెయిన్ స్ట్రేటజిస్టుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. పైగా వారిద్దరి భేటీ రెండు గంటల పాటు ఏకాంతంగా సాగిందని జనసేన ప్రకటించింది. దీంతో పవన్ 2019 ఎన్నికల కోసం తన ప్రచార వ్యూహకర్తగా జార్డింగ్ ను హైర్ చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా జార్డింగ్ ఇప్పటికే ఇండియన్ పాలిటిక్సులో తన సేవలందిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రస్తుత ఎన్నికల కోసం సుమారు ఏడాది కాలంగా జార్డింగ్ సలహాలు - సూచనలు తీసుకుంటున్నారు. జార్డింగు పలుమార్లు ఇండియాకు వచ్చి అఖిలేశ్ - ఆయన బృందాన్ని గైడ్ చేశారు. ప్రచారం ఎలా ఉండాలో డిజైన్ చేసి వెళ్లారు.

జార్డింగ్ చిన్నోడేం కాదు..

జార్డింగ్ 1980 నుంచి పొలిటికల్ కన్సల్టెంట్ గా - స్ట్రేటజిస్టుగా పనిచేస్తున్నారు. జార్డింగ్ క్లయింట్లలో బడాబడా నేతలున్నారు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో దెబ్బతిన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ కూడా జార్డింగ్ సేవలు ఉపయోగించుకున్నారు. అంతేకాదు.. స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్ గెలుపు వెనుకా ఆయన ప్రణాళికలే ఉన్నాయట. అంతెందుకు మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో షేక్ హసీనా విజయం కోసం కూడా ఆయన గతంలో పనిచేశారు. ఒకప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అల్ గోర్ - అమెరికన్ నేతలు జాన్ కెర్రీ వంటివారూ జార్డింగ్ క్లయింట్లే. అంతేకాదు.. డెమొక్రటిక్ పార్టీ నుంచి గెలిచిన పలువురు సెనేటర్లకూ ఆయనే సలహాదారు.

ఆయన స్టూడెంట్లూ గెలిచేశారు..

జార్డింగ్ వద్ద రాజకీయ ప్రచార పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు కొందరు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. స్విట్జర్లాండ్ పార్లమెంటుకు ఇద్దరు విద్యార్థులు ఎన్నికయ్యారు. అలాగే డెలావర్ నుంచి ఒక విద్యార్థి గెలిచాడు.

ఆసియా బాధ్యతలు చూస్తున్నది మనోడే..

జార్డింగ్ కు ఒకే సారి ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్లయింట్లు ఉంటుంటారు. ఉదాహరణకు మొన్న అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న సమయానికే యూపీలో ఎన్నికల ప్రచార సందడి మొదలైపోయింది. అలాంటప్పుడు తాను నేరుగా కొన్ని సలహాలిచ్చినా తన టీంలో కొందరికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తారు జార్డింగ్. ఇప్పుడు యూపీలోనూ అద్వైత్ విక్రమ్ సింగ్ అనే జార్డింగ్ పూర్వ విద్యార్థి మొత్తం కథంతా నడిపిస్తున్నారు. ఆసియా దేశాల్లో క్లయంట్ల వ్యవహారాలు ఆయనే చూస్తుంటారు. మధ్యమధ్యలో జార్డింగ్ వచ్చి పోతుంటారంతే. భవిష్యత్తులో జార్డింగ్ సేవలను పవన్ పొందినా ఇక్కడ కథ నడిపించబోయేది విక్రమ్ సింగే.

మనకు పనికొస్తుందా..?

ఎంతటి ఘటికుడి వ్యూహాలైనా అన్ని సార్లూ ఫలించవు. స్థానిక పరిస్థితులు కూడా కలిసి రావాలి. ఏపీలాంటి క్లిష్టమైన పొలిటిక్ ఫ్లోర్ పై జార్డింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది అనుమానమే. పైగా జార్డింగ్ కు కూడా పట్టిందల్లా బంగారమైన చరిత్రేమీ లేదు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో హిల్లరీ ఓడిపోవడమే అందుకు ఉదాహరణ. ట్రంప్ వ్యూహాల ముందు జార్డింగ్ తేలిపోలేదూ..

- గరుడ


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/