Begin typing your search above and press return to search.

వైరల్... రాం మాధవ్ తో పవన్ కల్యాణ్ భేటీ!

By:  Tupaki Desk   |   7 July 2019 4:27 AM GMT
వైరల్... రాం మాధవ్ తో పవన్ కల్యాణ్ భేటీ!
X
అమెరికాలో తెలుగు ప్రజలంతా కోలాహలంగా జరుపుకుంటున్న తానా మహా సభల సందర్భంగా ఓ ఆసక్తికర భేటీ జరిగింది. ఈ ఏటి తానా సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్... అక్కడి మన తెలుగోళ్లకు కొత్త హుషారునిచ్చారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన కీలక నేత - ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరించిన బీజేపీపై గతంలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ముగిసిన ఎన్నికల్లోనూ ఆయన బీజేపీపై తనదైన శైలిలోనే విరుచుకుపడ్డారు.

అయితే ఎన్నికల్లో బీజేపీతో పాటే పీకే పార్టీ కూడా దాదాపుగా అడ్రెస్ లేకుండా పోయింది. పవన్ కల్యాణ్ స్వయంగా రెండు చోట్ల పోటీ చేస్తే... ఆ రెండు చోట్ల కూడా ఆయన ఓటమిపాలయ్యారు. అయితే జనసేన తరఫున ఓ ఎమ్మెల్యే గెలుపొందడం ఒక్కటే ఈ ఎన్ని్కల్లో పవన్ కు ఊరట కల్పించే విషయమని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో పవన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారని వార్తలు వినిపించినా... తాను ఎక్కడికి వెళ్లేది లేదని - రాజకీయాల నుంచి అస్సలు తప్పుకునేది లేదని కాస్తంత ఘనంగానే పవన్ ప్రకటించారు. ఇలాంటి క్రమంలో తాను విమర్శలు గుప్పిస్తున్న బీజేపీకి చెందిన కీలక నేత రాం మాధవ్ తో పవన్ భేటీ కావడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇద్దరు నేతల మధ్య సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరిగాయని సమాచారం. స్నేహపూర్వకంగానే జరిగిన ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు - ఏపీలో రాజకీయ పరిణామాలపైనా ఇరువురు నేతలూ చర్చించుకున్నట్లుగా వినికిడి. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు - వాటి అమలు - రాష్ట్రానికి ఇప్పటిదాకా కేంద్రం చేసిన సాయం - ఇంకా చేయాల్సిన సాయం తదితర అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఏఏ అంశాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారో తెలియదు గానీ... అమెరికాలో జరిగిన ఈ ఇద్దరు నేతల భేటీ ఏపీలోని రాజకీయాల్లో పెను సంచలనంగానే మారనుందన్న వాదన వినిపిస్తోంది.