Begin typing your search above and press return to search.

'2019' మీద క్లారిటీ ఇచ్చేయొచ్చుగా పవన్?

By:  Tupaki Desk   |   2 Feb 2017 9:52 AM GMT
2019 మీద క్లారిటీ ఇచ్చేయొచ్చుగా పవన్?
X
గతంతో పోలిస్తే.. జనసేన అదినేత పవన్ కల్యాణ్ లో చాలానే మార్పువచ్చినట్లుగా చెప్పాలి. గతంలో అప్పుడప్పుడు మాత్రమే రియాక్ట్ అయ్యేవారు. ఎప్పుడో ఒకసారి తప్పించి.. అదే పనిగా రియాక్ట్ కావటం కనిపించేది కాదు. ఏ సందర్భంలోనూ.. ఎవరితోనూ కలవక.. తన మానాన తాను అన్నట్లుగా ఉండే ఆయనలో ఇప్పుడు చాలానే మార్పు వచ్చిందని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదాతో పాటు.. చేనేత వస్త్రాలు.. ఏపీలోని వివిద ప్రాజెక్టుల మీద.. ప్రజా సమస్యల పైన ఆయన తరచూ దృష్టి సారిస్తున్నారు. లోపాల్ని ఎత్తి చూపిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సమస్యలపై పవన్ ప్రస్తావించిన మరుక్షణం ఏపీ సర్కారు స్పందించటం.. వాటిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయటం.. అధికారులు ఉరుకులు పరుగులు తీయటం కనిపిస్తుంది. ఇదే సమయంలో ప్రత్యేక హోదా మొదలు.. చాలానే అంశాల విషయంలో మాట్లాడుతున్న పవన్.. ఎక్కడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద సూటి విమర్శలు చేయటం లేదని చెప్పాలి.

ఎందుకిలా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి తోడు.. తెలుగుదేశం నేతలు చేస్తున్న ప్రచారం పవన్ అండ్ కోకు ఇబ్బందికరంగా మారినట్లుగా తెలుస్తోంది. హోదా మొదలుకొని ఏ అంశం మీదా తమ పాలనను పవన్ విమర్శించటం లేదని.. ఆయన తమకు స్నేహితుడన్న మాటను తెలుగు తమ్మళ్ల నోట తరచూ రావటం గమనార్హం. 2019 ఎన్నికల్లోనూ పవన్ తమకే మద్దతు పలుకుతారని.. ఆ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తున్నట్లుగా టీడీపీ కార్యకర్తలు చెప్పటం గమనార్హం.

ఇలాంటి మాటల కారణంగా పవన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పటం కంటే.. ఆయనపై తప్పుడు ప్రచారం జరిగే వీలుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వపన్ కల్యాణ్ సైతం 2019 ఎన్నికల విషయంపై మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నవాదన వినిపిస్తోంది. విడిగా పోటీ చేస్తారా? కలిసి పోటీ చేస్తారా? బీజేపీని తిట్టిపోస్తున్న పవన్.. టీడీపీ విషయంలొ ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు? ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవటానికి.. ఇవ్వకపోవటానికి ప్రధాని మోడీనే కారణమన్నట్లుగా ఆయన్ను విమర్శిస్తున్నారు. అదేం తప్పేం కాదు. కానీ.. మోడీ నిర్ణయాన్ని తప్పుపడుతున్న పవన్.. అదే సమయంలో ఏపీ అధికారపక్షంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై మాత్రం సూటి మాట ఒక్కటి కూడా ఎందుకు అనటం లేదన్న ప్రశ్నను వాడుకునే సంధిస్తున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తన 2019 ప్లాన్ పై ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో.. పవన్ తన ఇమేజ్ ను తానే చెడగొట్టుకున్నట్లు అవుతుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/