Begin typing your search above and press return to search.

‘కోట’లో పవన్ బంధీ అయిపోయారా?

By:  Tupaki Desk   |   21 Feb 2017 7:10 AM GMT
‘కోట’లో పవన్ బంధీ అయిపోయారా?
X
జననేత ఎలా ఉండాలి? సమాజాన్ని మార్చేస్తానన్న వ్యక్తి.. ముందు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ వేరన్నది తెలిసిందే. మిగిలిన హీరోలకు కాస్త భిన్నంగా వ్యవహరించే ఆయన.. అంతర్ముఖి. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఆ పేరుతో ఎవరిని కలవకుండా.. ఎవరికి అందుబాటులోకి రాకుండా పోవటమే అసలు సమస్యగా చెప్పాలి.

సినీ నటుడిగా ఉండే వారికి కొన్ని పద్దతులు ఉంటాయి. అదే సమయంలో ప్రజాజీవితంలో ఉండే వారి తీరు మరోలా ఉంటుంది. పవన్ తో వచ్చే సమస్యేమిటంటే.. ఆయన రెండింటిలోనూ ఉన్నారు. ఇలాంటి వారికి విస్తృతమైన నెట్ వర్క్ ఉండాలి. కానీ.. ఆయనతో వచ్చిన చిక్కేమిటంటే.. కొద్దిమంది సన్నిహితులతోనే మొత్తం నెట్ వర్క్ ను నడిపించటం. తనను నమ్మిన వారి మధ్యనే ఆయన కాలం గడిపేయటం.

ఆయన వద్దకు చేరుకోవాలంటే.. ఆయనకు సన్నిహితంగా ఉండే వారిలో ఎవరో ఒకరు పూనుకుంటే తప్పించి ఆయన దగ్గరకు వెళ్లలేని దుస్థితి. ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించాలి. పవన్ కల్యాణ్ కు ఆయన సోదరులు చిరంజీవి కానీ.. నాగబాబు కానీ ఎవరినైనా పరిచయం చేస్తే.. వారితో మాట్లాడే పవన్.. వారు ఫోన్ నెంబరు అడిగితే.. తన పీఏ నెంబరు ఇస్తారే తప్పించి.. తన వ్యక్తిగత ఫోన్ నెంబరు ఇవ్వరు. దీంతో.. వచ్చే చిక్కేమిటంటే.. కొన్ని సందర్భాల్లో ఆయనకే నేరుగా ఇవ్వాల్సిన ఫీడ్ బ్యాక్ ఆయనకు అందని పరిస్థితి.

ఇలాంటి కారణాల వల్ల ఆయన దగ్గరకు వెళ్లాలంటే మహ ఇబ్బందికర పరిస్థితి. ప్రజాజీవితంలో ఉండే వారు సామాన్యులకు అందుబాటులో ఉండగలగాలి. అప్పుడు మాత్రమే వారికి నిజమైన సమస్యలు తెలిసే వీలుంది. అలా కాకుండా.. ఒక వృత్తంలో ఉండిపోవటమో.. చట్రంలో ఇరుక్కుపోయేవారికి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చేనేతల సమస్యల మీద గళం విప్పటానికి హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లిన పవన్ కల్యాణ్.. తన సినిమాను కొని భారీగా నష్టపోయిన బయ్యర్ల ఆవేదన వినలేకపోవటం ఏమిటి?

పాలకుల విధానాల్ని తప్పు పట్టే ఆయన.. తనకు తానే ఇచ్చిన హామీని.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు తూట్లు పొడవటంతో.. బాధితులు ప్రెస్ మీట్లు పెట్టాల్సి రావటం ఏమిటి? నేరుగా తన కారణంగా ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించలేని పవన్.. జనం సమస్యల్ని తీరుస్తానని చెబుతూ బయటకు రావటం.. మాటలు చెప్పటం అంత బాగోలేదన్న మాట వినిపిస్తోంది.

ఇక్కడ పవన్ నిజాయితీని.. కమిట్ మెంట్ ను తప్పు పట్టటం లేదు. కానీ.. ఆయన గిరిగీసుకున్న వృత్తంలో ఉండిపోతే ఎలాంటి ఇబ్బందులన్నది చెప్పటమే ఉద్దేశం. తనకు తానుగా సృష్టించుకున్న కోటలో..తన వాళ్లు అనుకునే వారి మధ్యన పవన్ బంధీగా ఉండిపోతున్నారన్న భావన కలిగించటంలోనే ఆయన తప్పు అంతా ఉందన్నది తాజా టాక్. ఆ విషయం మీద ఆయన కాస్త ఆలోచిస్తే మంచిదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/