Begin typing your search above and press return to search.

చేస్తానంటే చేయడని.. కలుస్తానంటే.. కలవనన్నదే పవన్

By:  Tupaki Desk   |   1 Nov 2019 4:33 AM GMT
చేస్తానంటే చేయడని.. కలుస్తానంటే.. కలవనన్నదే పవన్
X
నా నోట్లో నుంచి వచ్చే మాటకు ముందు గుండెల్లో ఎంతో మధనం జరుగుతుంది. ఏ మాటను ఉత్తనే చెప్పను. ఎంతో ఆలోచించిన తర్వాత మాత్రమే మాట్లాడతా. ప్రతి మాటకు బాధ్యత వహిస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పే మాటలకు చేసే చేతలకు ఏ మాత్రం పోలిక ఉండదని చెప్పాలి. ఇది ఇప్పుడే కాదు.. మొదట్నించి ఇదే తీరును ప్రదర్శిస్తారని చెప్పాలి.

అనంత కరవు గురించి తెలుసుకోవటం కోసం తాను అనంతపురంలో పాదయాత్ర చేస్తానని చెప్పిన పవన్ పత్తా లేకపోవటమే కాదు.. అనంతపురం నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి.. ఆ తర్వాతేం చేశారో తెలిసిందే. అంతేనా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీకి వెళ్లాలని.. తానుకూడా వస్తానని చెప్పిన పవన్.. ఏం చేశారో తెలిసిందే.

ఇలా తన నోటి నుంచి వచ్చిన మాటను కచ్ఛితంగా చేయని తత్త్వం పవన్ లో అంతకంతకూ పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తానని.. కార్మికుల వెతల గురించి ఆయనతో మాట్లాడతానని చెప్పిన పవన్.. ఇప్పటివరకూ సీఎం కేసీఆర్ ను ఎందుకు కలవటం లేదు? అన్నది ప్రశ్న. కలుస్తానని.. కార్మికుల తరఫున కేసీఆర్ తో మాట్లాడతానని చెప్పినప్పడు ఆ దిశగా పవన్ ఎందుకు చేయలేదు? అన్నది మరో ప్రశ్న.

సమ్మె స్టార్ట్ అయి దాదాపు నాలుగు వారాలకు దగ్గరకు వస్తున్న వేళ.. అటు తెలంగాణ ప్రజలు.. ఇటు ఆర్టీసీ కార్మికులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇలాంటివేళ.. తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అవుతానని గొప్పగా చెప్పిన పవన్.. ఆ తర్వాత పత్తా లేకుండా పోవటం.. ఆ విషయాన్ని అస్సలు ప్రస్తావించకపోవటం చూస్తే.. పవన్ నోట చేస్తానని చెబితే.. కచ్ఛితంగా చేయరని ఫిక్స్ కావాలన్న మాట వినిపిస్తోంది.