Begin typing your search above and press return to search.

న్యూఇయర్.. సంక్రాంతి చేసుకోనన్న పవన్

By:  Tupaki Desk   |   1 Jan 2020 6:20 AM GMT
న్యూఇయర్.. సంక్రాంతి చేసుకోనన్న పవన్
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఏపీ రాజధానిని మూడు చోట్ల పెట్టే అవకాశం ఉందన్న మాట ఎంతటి చర్చకు తెర తీసిందో తెలిసిందే. మూడు ప్రాంతాల్లో ఏపీ రాజధానులు రావటం వల్ల అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతాయన్న మాట వినిపించటమే కాదు.. తాజా నిర్ణయంపై ఏపీ ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దీనికి భిన్నంగా అమరావతికి చెందిన రైతులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏ చిన్న అవకాశం లభించినా రాజకీయ లబ్థి కోసం ప్రయత్నించే నేతలకు తగ్గట్లే.. తాజాగా రాజధాని అంశాన్ని లొల్లిగా మార్చేందుకు వీలుగా జనసేన అధినేత పవన్ కొత్త పల్లవిని అందుకున్నారు. రాజధానిని ఎక్కడైనా పెట్టండి.. కానీ అన్ని ఒకే చోట ఉండాలన్నది ఆయన మాట.

ఇదిలా ఉంటే.. మూడు రాజధానుల అంశంపై అమరావతికి చెందిన రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి దన్నుగా నిలిచేందుకు జనసేన అధినేత అమరావతి గ్రామాల్లో పర్యటించటం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. రైతులు.. వ్యవసాయ కూలీలు ఓపక్క కన్నీళ్లు పెట్టుకుంటున్నారని.. ఇలాంటి వేళ తాను న్యూఇయర్ వేడుకల్ని చేసుకోనన్నారు.

అంతేకాదు.. సంక్రాంతి పండుగ కూడా చేసుకోనన్న ఆయన.. రాజధాని ప్రాంతానికి చెందిన మహిళలు విలపిస్తున్న తీరు తన గుండెల్ని బద్ధలయ్యేలా చేస్తుందన్నారు. ఐదు కోట్ల ప్రజల రాజధాని కోసం అమరావతి రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని.. ఇప్పుడు వారంతా దయనీయమైన స్థితిలో ఉన్నారన్నారు. ఇళ్లల్లో నుంచి ఎప్పుడూ బయటకు రాని మహిళలు కూడా బయటకు వచ్చి వీధుల్లో పోరాడుతున్నారన్నారు.

ఇలాంటి పరిస్థితులు ఉన్న వేళ తాను న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోనన్న పవన్.. సంక్రాంతి పండుగ కూడా చేసుకోనని చెప్పారు. రైతులు ఆనందంగా ఉన్నప్పుడే తనకు సంక్రాంతి అని చెప్పారు. అందుకే తాజా వేడుకులకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా.. ఆ మాటను పట్టించుకోకుండా నిరసనలు.. ఆందోళనలు చేయటాన్ని ఏమనాలి? మరోవైపు ఏపీలోని ఇతర ప్రాంతాల్లో మూడు రాజధానులపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న వైనం పవన్ కు ఎందుకు కనిపించదు? వారి మాటేమిటి?