Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ మళ్లీ నిరాశ ప‌ర్చేలా ఉన్నాడు

By:  Tupaki Desk   |   6 Jan 2016 4:06 AM GMT
ప‌వ‌న్ మళ్లీ నిరాశ ప‌ర్చేలా ఉన్నాడు
X
జ‌న‌సేన అధినేత‌-ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు తెలుగు రాష్ర్టాల్లో ప్రాంతాలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో అయితే ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కింగ్ మేక‌ర్‌ అనేది నిర్వివాదాంశం. ఆ ఎన్నిక‌ల స‌మ‌యానికే జ‌న‌సేన పార్టీని ఏర్పాటుచేసిన‌ప్ప‌టికీ పోటీ చేయ‌కుండా ఉన్న ప‌వ‌న్....టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చాడు. అయితే ఇటీవ‌లి కాలంలోనే ప‌వ‌న్ జ‌న‌సేన‌కు రాజకీయపార్టీగా ఈసీ నుంచి గుర్తింపు ద‌క్కిన నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేసే అవ‌కాశాలున్నాయ‌ని భావించారు.

అయితే తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చిన అంశం దీనిపై నీలిమేఘాల‌ను క‌మ్మేసింది. పవన్ కల్యాణ్ అపాయింట్‌ మెంట్ కోసం టీడీపీ - బీజేపీ నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించాలని టీడీపీ - బీజేపీ నాయ‌కులు భావిస్తూ పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తే పవన్ కల్యాణ్ మరోసారి ఎన్నికల ప్రచారంలో సందడి చేయనున్నారు. అయితే ప‌వ‌న్ ఎన్డీఏ ప‌క్షాన గ్రేట‌ర్ ప్ర‌చారానికి వ‌స్తే జ‌న‌సేన త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దించ‌రనేది ఖాయం. ఈ నిర్ణ‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల్లో అసంతృప్తికి దారితీస్తుంద‌ని అంటున్నారు.

హైద‌రాబాద్‌ లో నివ‌సిస్తున్న వారిలో మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్న ప‌వ‌న్ వారితో పాటు సెటిల‌ర్ల ఓట్ల‌ను పెద్ద ఎత్తున కొల్ల‌గొట్ట‌డంలో ముందుంటారు. ఈ అడ్వాంటేజ్‌తో పాటు తెలంగాణ‌లో జ‌న‌సేన‌కు రాజ‌కీయ‌పార్టీగా ఎలాగూ గుర్తింపు ఉంది. ఇలాంటి స‌మ‌యంలో కూడా ప‌వ‌న్ ఈ ర‌కంగా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌టం ఆయ‌న‌ అభిమానుల‌ను నిరాశ పర్చే అంశ‌మేన‌ని భావిస్తున్నారు. ఇంత‌కీ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఈ విష‌యంలో ఎప్పుడ క్లారిటీ ఇస్తారో చూడాలి మ‌రి.