Begin typing your search above and press return to search.

ముంద‌స్తు బ‌రిలో జ‌న‌సేన లేన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   2 Oct 2018 4:51 PM GMT
ముంద‌స్తు బ‌రిలో జ‌న‌సేన లేన‌ట్లేనా?
X
ఇరు తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నించేందుకే తాను పార్టీ పెడుతున్నాన‌ని 2014లో `జ‌న‌సేన‌`అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌శ్నించ‌డం సంగ‌తి అలా ప‌క్క‌నబెట్టిన ప‌వ‌న్....2014లో టీడీపీ - బీజేపీల‌కు మ‌ద్ద‌తిచ్చారు. నాలుగేళ్ల సావాసం త‌ర్వాత....ఆ రెండు పార్టీల‌తో తెగ‌దెంపులు చేసుకున్న ప‌వ‌న్.....అరకొర ప్ర‌శ్న‌లు సంధించ‌డం మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత త‌న‌దైన శైలిలో బ్రేకులిచ్చుకుంటూ ఏపీలో మాత్ర‌మే ప్ర‌జా పోరాట యాత్ర కొన‌`సాగి`స్తున్నారు. అయితే, ఆ యాత్ర‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ప‌వన్....అక్క‌డ పోటీ చేస్తార‌ని అంతా భావించారు. కానీ, క‌రీంన‌గ‌ర్ పర్య‌ట‌న అనంత‌రం ప‌వ‌న్...కేసీఆర్ ను పొగ‌డ‌డంతో ఆయ‌న టీఆర్ ఎస్ కు మ‌ద్ద‌తిస్తార‌ని అంతా ఫిక్స‌య్యారు. ఇపుడు ఆ వ‌దంతుల‌కు ఊత‌మిచ్చేలా ప‌వ‌న్......తెలంగాణ మీదుగా ప‌ర్య‌టిస్తూ అక్క‌డ ప్ర‌సంగించ‌కుండా వెళ్లిపోయారు.

తాను చేప‌ట్టిన ప్ర‌జాపోరాటయాత్రలో భాగంగా ప‌వ‌న్ .....పోలవరం ముంపు మండలాలైన కుకునూరు - వేలేరుపాడులో సోమ‌వారం నాడు ప‌ర్య‌టించారు. మార్గమ‌ధ్యలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొద్దిసేపు ఆగారు. అయితే, అక్క‌డ ప‌వ‌న్ 10 నిమిషాల పాటు ప్ర‌సంగిస్తార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో జనసేన కార్యకర్తలు - మహిళలు - అభిమానులు భారీ సంఖ్య‌లో అక్క‌డ‌కు చేరుకున్నారు. కానీ, ప‌వ‌న్ మాత్రం టాప్‌ లెస్‌ వాహనంలో అంద‌రికీ అభివాదం చేసి వెళ్లిపోయారు. అయితే, ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగానే అక్క‌డ ప్ర‌సంగించ‌లేద‌ని తెలుస్తోంది. అక్క‌డ ప్ర‌సంగిస్తే తెలంగాణ ఎన్నిక‌ల గురించి మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని ప‌వ‌న్ భావించార‌ట‌. కానీ, తెలంగాణ‌లో జ‌న‌సేన దాదాపుగా పోటీ చేసే ఉద్దేశం లేన‌పుడు...ఏం మాట్లాడినా ఇబ్బందేన‌ని విర‌మించుకున్నార‌ట‌. ఏది ఏమైనా..ప‌వ‌న్ తాజా చ‌ర్య‌తో తెలంగాణ‌లో జ‌న‌సేన బ‌రిలోకి దిగ‌డం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నాకు వ‌చ్చారు.