Begin typing your search above and press return to search.

నాలుగు రోజులైపోయింది ప‌వ‌న్ బాబు?

By:  Tupaki Desk   |   24 Oct 2018 7:38 AM GMT
నాలుగు రోజులైపోయింది ప‌వ‌న్ బాబు?
X
మిగిలిన రంగాల సంగ‌తి ఎలా ఉన్నా.. రాజ‌కీయాల్లో ఉన్న వారు అంతో ఇంతో టైం విష‌యంలో కాస్తంత క్ర‌మ‌శిక్ష‌ణ ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి. కొన్ని కొన్ని విష‌యాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోకున్నా.. మ‌రికొన్ని విష‌యాల్లో చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టం అవ‌స‌రం. కానీ.. ప‌వ‌న్ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. నోటికి వ‌చ్చిన‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉంటాయన్న విమ‌ర్శ అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

కొద్ది నెల‌ల క్రితం అనంత క‌రువు తెలుసుకునేందుకు తాను స్వ‌యంగా అనంతలో పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప‌వ‌న్ చెప్పే విష్ లిస్ట్ చాలానే ఉంటుంది. అంతేనా.. ప‌వ‌న్ ను ఏదైనా విష‌యంపై స్ప‌ష్ట‌త కోరితే.. ఆ వెంట‌నే ఆయ‌న త‌డుముకోకుండా స‌మాధానం చెబుతారు. అయితే.. ఆ విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించ‌ట‌మే వ‌దిలేస్తారు.

ఇటీవ‌ల జ‌రిగిందే చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చేస్తుందా? అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దింపుతారా? అన్న ప్ర‌శ్న‌లు వేస్తే.. నాలుగు రోజుల్లో తమ పార్టీ నిర్ణ‌యాన్ని చెబుతామ‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. నాలుగు రోజుల్లో పోటీ మీద క్లారిటీ ఇస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఆ మాట చెప్పి ఇప్ప‌టికి నాలుగు రోజులు దాటిపోయింది కూడా. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికి ఏ స‌మాధానం చెప్ప‌ని ప‌రిస్థితి.

ఓప‌క్క తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టైం ముంచుకొస్తున్న వేళ‌.. మ‌రికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుద‌ల‌య్యే స‌మ‌యంలో అన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దింపే విష‌యంలో కిందామీదా ప‌డుతున్నాయి. టీఆర్ ఎస్ లాంటి పార్టీలైతే.. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించి జోరుగా ప్ర‌చారాన్ని సాగిస్తున్నాయి. ఓప‌క్క ఇంత జ‌రుగుతుంటే.. మ‌రోవైపు ప‌వ‌న్ మాత్రం అస‌లు పోటీ చేస్తారా? లేదా? అన్న క్లారిటీ ఇవ్వ‌కుండా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఏమైనా మాట చెప్పి.. దాని మీద నిల‌బ‌డ‌ని అధినేత‌ల్లో ప‌వ‌న్ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.