Begin typing your search above and press return to search.

రెండ్రోజులే టైం..ఏదీ తేల్చ‌వేం ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   17 Nov 2018 9:53 AM GMT
రెండ్రోజులే టైం..ఏదీ తేల్చ‌వేం ప‌వ‌న్‌
X
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టం పూర్తి కానుంది. నామినేషన్ల దాఖలుకు గడువు ముంచుకొస్తోంది. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న సంగతి తెలిసిందే.ముందస్తు ఎన్నికలకు తెరలేపిన గులాబీ బాస్ ముందే 105 మంది అభ్యర్థులను ప్రకటించేసి అభ్యర్థులను అయోమయంలో పడేశారు. అనంతరం మ‌రో ఇద్ద‌రు అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. 117 అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ ఎస్ కేవలం రెండు నియోజకవర్గాలకు (ముషీరాబాద్ - కోదాడ) మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రకటించిన అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మహాకూటమి పేరిట ఇతర పార్టీలను కలుపుకుంది. కానీ సీట్ల సర్దుబాటు..పొత్తులు ఇంకా ఖరారు కాలేదు. భాగస్వామ్య పక్షాల మధ్య సీట్లు - స్థానాల్లో ఏకాభిప్రాయం రావడం లేదు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు తెగ చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ 94 - తెలంగాణ జనసమితి 8 - టీ.టీడీపీ 14 - సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం మాత్రం కుదిరింది. ఇప్పటికే కాంగ్రెస్ రెండు జాబితాలు (75) ప్రకటించేసింది. అభ్యర్థులకు నవంబర్ 17వ తేదీ శనివారం నుండి బీ ఫారాలు అందచేయనుందని తెలుస్తోంది.

వామ‌పక్ష పార్టీల్లో ఒక‌టైన సీపీఎం త‌న కొత్త‌వేదిక‌తో ముందుకు సాగుతోంది. ప్ర‌ధాన పార్టీల్లో ఒక‌టైన వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ త‌న‌వైఖ‌రిని ప్ర‌క‌టించింది. తెంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని - పార్టీ దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్‌ లో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల మీదే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గ‌త వారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన పరిణామాలను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని - అదే సమయంలో 2024 ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా బలపడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని ప్రకటనలో వివరించింది. అయితే, జ‌న‌సేన పార్టీ మాత్రం త‌మ వైఖ‌రిని వెల్ల‌డించ‌కలేక‌పోతోంది. ఇంకా నాన్చివేత దోర‌ణిని అవ‌లంభిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది.

తెలంగాణ‌లో పోటీపై మ‌రో నాలుగైదు రోజుల్లో ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని జ‌న‌సేన గ‌త నెల‌లో వెల్ల‌డించింది. అయితే, కానీ ఇది జ‌రిగి ప‌దిహేను రోజులైన ప‌వ‌న్ త‌న స్టాండ్ వెలువ‌రించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ‌, ఏపీ ఒక్క‌ రాష్ట్రం పైనే తాము దృష్టి సారించామ‌ని ప‌వ‌న్ చెప్ప‌ద‌ల్చుకుంటే - ఆ విష‌యంలో మొహ‌మాటం ఎందుక‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. అన్నింటికీ మించి నామినేష‌న్ల గడువు ముగిసిపోతున్న స‌మ‌యంలో కూడా బ‌రిలో ఉన్నామో లేదో తేల్చ‌ని స్థితి చిత్రంగా ఉంద‌ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరుగనున్న సంగ‌తి తెలిసిందే.