Begin typing your search above and press return to search.

మీవారికి `కాపు` కాయ‌గ‌ల‌వా ప‌వ‌న్?

By:  Tupaki Desk   |   1 Aug 2018 2:18 PM GMT
మీవారికి `కాపు` కాయ‌గ‌ల‌వా ప‌వ‌న్?
X
ప్ర‌స్తుతం ఏపీలో కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కాపు రిజ‌ర్వేష‌న్లిస్తామ‌ని 2014లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీని తుంగ‌లో తొక్కిన నేప‌థ్యంలో....ఇపుడు రాబోయే ఎన్నిక‌ల్లో ఆ అంశం కీల‌కం కానుంది. అయితే, ఏరు దాటాక తెప్ప త‌గ‌లేసిన చందంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించ‌డంతో కాపులు ఆయ‌న‌పై మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ....కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్నాయి. తాను అధికారంలోకి వ‌స్తే కాపు కార్పొరేష‌న్ కు ఏటా 2 వేల కోట్ల చొప్పున మొత్తం 10 వేల కోట్లు ఇస్తాన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌డంతో కాపులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో బీసీల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా....కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే అంశంపై నిపుణులతో చ‌ర్చిస్తామ‌ని...ఆ అంశంపై స‌లహాలు సంప్ర‌దింపులూ స్వీక‌రిస్తామ‌ని కూడా అన్నారు. చంద్ర‌బాబులా తాను అబ‌ద్ద‌పు హామీలివ్వ‌న‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అయితే, ఇంత జ‌రుగుతున్నా....ఏపీలోని ప్ర‌ధాన పార్టీల‌లో ఒక‌టైన‌న జ‌న‌సేన ....ఈ అంశం గురించి ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్...రిజ‌ర్వేష‌న్ల అంశంపై నోరు మెద‌ప‌క‌పోవ‌డం...ఇపుడు హాట్ టాపిక్ అయింది.

కాపు రిజ‌ర్వేష‌న్లపై జ‌గ‌న్ ఇప్ప‌టికే త‌న అభిప్రాయాన్ని ఒక‌టికి రెండుసార్లు చాలా స్ప‌ష్టంగా వెల్ల‌డించారు. కాపుల‌పై చంద్ర‌బాబు స్టాండ్ ఏమిట‌నేది ఇప్పటికే స్ప‌ష్ట‌మైంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్ పై అంద‌రూ ఫోక‌స్ చేస్తున్నారు. త‌న‌కు కులమ‌తాల ప‌ట్టింపు లేద‌ని....సామాజిక సేవే ముఖ్య‌మ‌ని ప‌వ‌న్ ప‌లుమార్లు చేగువేరాని మ‌రపించే డైలాగులు కొట్టారు. అయితే - ప‌వ‌న్ అవున‌న్నా....కాద‌న్నా....ఆయ‌నను ఏపీ ప్ర‌జ‌లు....కాపు వ‌ర్గ ప్ర‌జ‌లు....కాపు నేత గానే గుర్తించి గౌర‌విస్తారు. గ‌త ఎన్నిక‌ల్లో కాపు ప్రాబల్యం ఉన్న 15 సీట్లకు గానూ 15 సీట్లు టీడీపీ కూట‌మికి క‌ట్టబెట్టార‌ని ప‌వ‌న్ స్వ‌యంగా చెప్పారు. 2014లో ప‌వ‌న్ తో బాబు జ‌త‌క‌ట్టిందే...ఆ కాపు స‌మీక‌ర‌ణం కోసం. మ‌రోవైపు, ప‌వ‌న్ కు సినీరంగంలో అంత స్టార్ డ‌మ్ రావ‌డంలో కూడా కాపు సోద‌రుల‌ది కీల‌క‌మైన పాత్ర‌. ప‌వ‌న్‌ను త‌మ వాడిగా ఆరాధించే కాపుల గురించి ప‌వ‌న్ నోరు విప్పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. నాలుగేళ్లుగా చంద్ర‌బాబుతో అంట‌కాగిన ప‌వ‌న్....ముద్ర‌గ‌డ ఉద్య‌మం స‌మ‌యంలో కూడా త‌ట‌స్థంగా ఉన్నారు. ఏడాదికో మాట మారుస్తున్నార‌ని జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్న ప‌వ‌న్....కాపుల‌ రిజ‌ర్వేష‌న్ల క‌ల్పన‌పై త‌న అభిప్రాయం వెల‌ల్డించే ద‌మ్ముందా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇపుడు కాక‌పోయినా....ఎన్నిక‌ల ముందు ...త‌న సామాజిక వ‌ర్గానికి ప‌వ‌న్ `కాపు` కాస్తాడో లేదో చెప్పక త‌ప్ప‌దు.