Begin typing your search above and press return to search.

ఇంత చిన్న‌చూపు త‌ర్వాత ప్ర‌శ్నించ‌వా ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   2 Feb 2018 9:50 AM GMT
ఇంత చిన్న‌చూపు త‌ర్వాత ప్ర‌శ్నించ‌వా ప‌వ‌న్‌?
X
ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గ‌డిచిన కొన్ని గంట‌లుగా మౌనంగా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ మ‌ధ్య సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌న ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల్లో జోరుగా ప‌ర్య‌టించ‌టం తెలిసిందే. అంతేకాదు రానున్న రోజుల్లో తాను నాన్ స్టాప్ గా టూర్ల మీద టూర్లు వేయ‌నున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేస్తున్నారు.

ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఆయ‌న చేస్తున్న ప‌ర్య‌ట‌న‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల విష‌యంలో తాను రాజీ ప‌డ‌న‌న్న‌ట్లు మాట‌లు చెబుతున్నారు ప‌వ‌న్‌. తెలుగు ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల మీద అంత క‌మిట్ మెంట్ ఉన్న పెద్ద‌మ‌నిషి తాజా బ‌డ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు మొండిచేయి చూపిన వైనంపై స్పందించాల్సిన క‌నీస బాధ్య‌త ఉంద‌న్న విష‌యాన్ని మ‌రవ‌టం గ‌మ‌నార్హం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార‌ప‌క్షాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తూ.. వారికి ద‌న్నుగా నిలుస్తూ ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న ప‌వ‌న్‌.. బ‌డ్జెట్ లాంటి కీల‌క అంశం మీద ఎందుకు స్పందించ‌లేద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. బ‌డ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు భారీ కేటాయింపులు లేక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఏపీ విష‌యంలో మ‌రింత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వైనంపై ఏపీలో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇలాంటి వేళ‌.. తెలుగు ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే ప‌వ‌న్‌ కు ముఖ్య‌మైన‌ప్పుడు మోడీ స‌ర్కారు వార్షిక బ‌డ్జెట్ లో జ‌రిగిన అన్యాయంపై ఎందుకు స్పందించ‌టం లేదన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ వ‌ర‌స చూస్తుంటే.. సామాన్య ప్ర‌జానీకానికి స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్ప‌టి కంటే.. తన అప్ర‌క‌టిత మ‌ద్ద‌తు ఇచ్చే అధికార‌ప‌క్షాల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉన్న ప్ర‌తిసారీ ప‌ర్య‌ట‌న‌లు చేసి.. వాతావ‌ర‌ణాన్ని మార్చేసే ప‌వ‌న్‌కు తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌రిగే అన్యాయం పెద్ద‌గా ప‌ట్ట‌దేమో?

తెలంగాణ‌రాష్ట్రంలో రైతుల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్ అంశంపై హాట్ హాట్ గా మారి.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుందేన‌న్న భావ‌న వ్య‌క్త‌మైన వేళ.. హ‌టాత్తుగా ప‌వ‌న్ తెలంగాణ టూర్ చేప‌ట్ట‌టం.. అదే రీతిలో ఏపీలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ల విష‌యంలోనూ ఇలాంటి వ్యూహ‌మే క‌నిపిస్తోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌శ్నించేందుకు పార్టీ పెట్టినా.. కంటిన్యూ చేస్తున్న‌ది మాత్రం అధికార‌ప‌క్షాల అడుగుల‌కు మ‌డుగులు వ‌త్తేందుకేన‌న్న‌ట్లుగా ప‌వ‌న్ తీరు ఉంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రికొంద‌రైతే ఒక అడుగు ముందుకేసి ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడా ప‌ని వ‌దిలేసి పిస‌క‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నార‌న్న ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.