Begin typing your search above and press return to search.

పవన్‌ కళ్యాణ్‌ పనికిరాడా?

By:  Tupaki Desk   |   10 April 2015 4:45 AM GMT
పవన్‌ కళ్యాణ్‌ పనికిరాడా?
X
పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడా? లేదా ఆయనకు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారటం ఇష్టం లేదా? ప్రశ్నించేందుకే తానున్న అని ప్రకటించిన ఈ హీరో ఆ సూత్రాన్ని ఎందుకు వదిలేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను తొలిచేస్తున్న ప్రశ్నలివి.

సిమీ ఉగ్రవాదులు జరిపిన కిరాతక కాల్పుల్లో కానిస్టేబుల్లు అమరులయ్యారు. మృత్యువుతో మూడ్రోజులు పోరాడిన ఎస్సై సిద్దయ్య అసువులు బాశారు. సిద్దయ్య ఆస్పత్రిలో ఉన్న సమయంలో దాదాపు అన్ని రాజకీయపక్షాలు ఆయన్ను పరామర్శించాయి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చాయి. ఉగ్రవాదుల చర్యను లోకం అంతా ముక్తకంఠంతో ఖండించింది. ఆయా పార్టీల వారు ముష్కరుల చర్యలను తప్పుపట్టాయి. మృతులకు సంతాపం ప్రకటించాయి. కానీ ప్రశ్నించేందుకు, సమాజ బాధలను తెలుసుకునేందుకే తానున్నానని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ మాత్రం పెదవి విప్పలేదు.

తెలంగాణలోకి వచ్చే ఏపీ వాహనాలపై సర్కారు ఎంట్రీ ట్యాక్స్‌ విధిస్తుంటే.. సీమాంధ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఆ నిర్ణయంపై పార్టీలు గవర్నర్‌ కు పలువురు ఫిర్యాదు చేశారు. కేంద్ర రవాణాశాఖమంత్రి సైతం స్పందించడం, ఈ విషయం కోర్టుల వద్దకు కూడా వెళ్లడం జరిగింది. కానీ పవన్‌ కళ్యాణ్‌ నోరెత్తలేదు. సర్కారు చర్య మంచిదో చెడ్డదో మాటమాత్రం అయినా చెప్పలేదు.

శేషాచలం అడవుల్లో జరిగిన కాల్పుల్లో కూలీలు హతమయ్యారు. ఏపీ సర్కారు కాల్చిందంటూ తమిళనాడులో ఏపీ బస్సులపై దాడులు జరుగుతున్నాయి. అక్కడి తెలుగువారు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. దీనిపైనా జనసేన నాయకుల వారు కిమ్మనడం లేదు.

పవన్‌ కళ్యాణ్‌ కు మీడియా ముందుకు వచ్చి మాట్లాడమే ఇబ్బంది అయితే (ఆయన వృత్తిపరమైన షూటింగ్‌ లేదా ఇంకే కారణాలు అయినా కావచ్చు..) పార్టీ తరఫున ప్రకటన అయినా విడుదల చేయవచ్చు. సోషల్‌ మీడియా ద్వారా తన భావాలు పంచుకోవచ్చు. తన ట్విటర్‌ ఖాతా ద్వారా అయినా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. కానీ పవన్‌ కళ్యాణ్‌ అదేం చేయడంలేదు. ఇంతకు ప్రశ్నించే పవన్‌ ఎక్కడ?