Begin typing your search above and press return to search.

పవన్‌ ఎందుకు ప్రశ్నించట్లేదంటే..

By:  Tupaki Desk   |   11 Jun 2015 9:06 AM GMT
పవన్‌ ఎందుకు ప్రశ్నించట్లేదంటే..
X
ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని అప్పట్లో ఘనంగా ప్రకటించుకోవడం పవన్‌ కళ్యాణ్‌కు పెద్ద చిక్కులే తెచ్చిపెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వివాదం తలెత్తినా అందరూ పవన్‌ వైపు చూస్తారు. ఆయన ప్రశ్నించట్లేదేంటి అని సూటిగా ప్రశ్నించేస్తున్నారు. ముఖ్యంగా ఆయన మద్దతుతో గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి ఏ వివాదం తలెత్తినా పవన్‌ బుక్కయిపోతున్నారు. తాజాగా రేవంత్‌ ఓటుకు నోటు కేసులో పది రోజులుగా ఎంత రచ్చ రచ్చ అవుతోందో తెలిసిందే. ఈ వ్యవహారంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ మాట్లాడేశారు. ఇక మిగిలింది పవన్‌ కళ్యాణ్‌ ఒక్కడే.

కానీ ఆయన మౌఖికంగా కానీ.. ట్విట్టర్‌ ద్వారా కానీ.. ఏం మాట్లాడట్లేదు. ఐతే ప్రస్తుతం పవన్‌ విదేశీ పర్యటనలో ఉండటమే ఈ మౌనానికి కారణమట. రేవంత్‌ వ్యవహారం బయటికొచ్చాక వెళ్లారా.. లేక అంతకుముందు నుంచే విదేశాల్లో ఉంటున్నారా అన్నది తెలియడం లేదు కానీ.. ఈ వ్యవహారాన్ని అవాయిడ్‌ చేయడానికి పవన్‌కు అదో మంచి కారణంగా కనిపిస్తోంది. నిజానికి వెబ్‌ మీడియా ఎంతో యాక్టివ్‌గా ఉన్న ఈ రోజుల్లో ప్రపంచంలో ఏ మూల ఉన్న సమాచారం తెలిసిపోతుంది. పవన్‌కు ఈ వ్యవహారం తెలియదని అనుకుంటే పొరబాటే. ఐతే ఓ పది రోజులాగితే ఓ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది కాబట్టి.. అప్పుడు ఇండియాకు వచ్చి స్పందించొచ్చులే అని పవన్‌ భావిస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. అప్పటికైతే వేడి చల్లారి వివాదం డైల్యూట్‌ అయిపోతుంది కాబట్టి.. ఓ రెండు ముక్కలు మాట్లాడేయడానికి ఇబ్బందేమీ ఉండదని పవన్‌ భావిస్తున్నట్లుంది.