Begin typing your search above and press return to search.

పవన్ మార్కు యూటర్న్..బాబును మించిపోయారబ్బా!

By:  Tupaki Desk   |   16 Jan 2020 4:58 PM GMT
పవన్ మార్కు యూటర్న్..బాబును మించిపోయారబ్బా!
X
బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాచిన జనసేనాని పవన్ కల్యాణ్... సోమవారం విజయవాడ వేదికగా జరిగిన కీలక భేటీలో తాను అనుకున్నట్లే బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో తన దైన మార్కు యూటర్న్ తీసుకున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే తెలుగు నేల విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొత్త పయనం ప్రారంభించిన ఏపీకి కేంద్రం ఇతోదికంగా సాయం చేయాలని - అందులో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని గతంలో ఓ రేంజిలో పవన్ పోరాటం సాగించారు. ఆ సందర్బంగా కాకినాడ వేదికగా జరిగిన బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారు చేసిన ప్రకటనపై పవన్ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్... ప్యాకేజీ తమకు వద్దంటే వద్దని కూడా నినదించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని - రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే దాకా విశ్రమించేది లేదని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు పొడవగానే హోదాపై పవన్ యూటర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదా గురించి అడగాల్సింది తనను కాదని, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడిని - ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే అడగాలని పవన్ పేర్కొన్నారు.

బీజేపీతో జనసేన కీలక భేటీ తర్వాత నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రత్యేక హోదాపై పవన్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించిన పవన్... ప్రత్యేక హోదాపై తననెందుకు అడుగుతారని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా విషయమై గత పాలక పార్టీ టీడీపీ పూర్తి బాధ్యత వహించాలి. అప్పుడే వారు గట్టిగా ప్రయత్నించి ఉంటే సానుకూల స్పందన వచ్చేది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీకి 22 మంది పార్లమెంటు సభ్యులున్నారు. టీడీపీకి ముగ్గురు పార్లమెంటు సభ్యులున్నారు. ప్రత్యేక హోదాపై ఆ రెండు పార్టీలే బాధ్యత వహించాలి’ అని పవన్ తనదైన శైలిలో స్పందించారు. మొత్తంగా ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నది తానొక్కడినేనని నాడు పేర్కొన్న పవన్... ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరగానే మాట మార్చేశారన్న మాట.

సాధారణంగా యూటర్న్ తీసుకోవడంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును మించిన వారు మరొకరు లేరన్న వాదన ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే పవన్ ఇప్పుడు తీసుకున్న యూటర్న్ బాబు యూటర్న్ లను మించిపోయిందన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా నాడు బీజేపీపై తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్... ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ఓ వైపు వామపక్ష పార్టీలు ఇప్పటికే పవన్ కు ప్రశ్నలు సంధించాయి. అయితే ఆ ప్రశ్నలు తనకు వినిపించనే లేదన్న రీతిలో వ్యవహరిస్తున్న పవన్... ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీలనే అడగండంటూ మీడియాకు ఎదురు ప్రశ్నలు సంధిస్తుండటం చూస్తుంటే... నిజంగానే చంద్రబాబు యటర్న్ లను పవన్ తనదైన శైలి యూటర్న్ లతో మరిపిస్తున్నారని చెప్పక తప్పదు.