Begin typing your search above and press return to search.

పవన్‌ కు వామపక్షాలు బలమా!... శాపమా..!?

By:  Tupaki Desk   |   7 Jan 2019 6:33 AM GMT
పవన్‌ కు వామపక్షాలు బలమా!... శాపమా..!?
X
వామపక్షాలు. అంటే భారత కమ్మూనిస్టు పార్టీ (సీపీఐ) - భారత కమ్మూనిస్టు పార్టీ (మార్క్‌ సిస్టు‌) ఈ రెండు పార్టీలకు ఉద్యామాల చరిత్ర ఉంది. కొన్ని చోట్ల ఈ పార్టీలకు కార్యకర్తల బలమూ ఉంది. గతంలో విద్యుత్‌ చార్జీల పెంపుతో పాటు పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడిన చారిత్రక నేపథ్యం ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ వాతవరణంలో ఆయా పోరాటాల ప్రభావం ఎంత వరకూ ఉంటుందో మాత్రం ఎవరూ అంచనా వేయాలేక పోతున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో సీపీఐ మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసింది. అయితే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇదే ఎన్నికలలో సీపీఎం కూడా విడిగా పోటీ చేసింది, ఈ పార్టీ పరిస్థితి కూడా అంతే.. డిపాజిట్లు దక్కలేదు. ఇలాంటి పార్టీలతో కలసి ఆంధ్రప్రదేశ‌్ ఎన్నికలలో పోటీ చేస్తానంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ‌్‌ ప్రకటించారు. ఈ పొత్తు ఆయనకు బలాన్ని ఇస్తుందో లేక శాపంగా మారుతుందో తేలాల్సి ఉంది.

పవన్ కల్యాణ్ ఉద్యమాలు పోరాటాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. చెగువేరా వంటి విప్లవ నాయకులు తనకు ఆదర్శమంటారు. అయితే నానాటికి మారుతున్న సామాజిక - రాజకీయ పరిస్థితులలో వామపక్ష పార్టీలను ప్రజలు ఆదరిస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. గతంలో యువత వామపక్ష రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉండేది. ఐటితో సహా పలు ఉపాధి అవకాశాలు పెరగడంతో కెరీర్ పట్ల యువత శ్రద్ద చూపిస్తోంది. అలాంటి వారు వామపక్ష రాజకీయాలను అంగీకరించలేరని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో అటవీ ప్రాంతాలు ఉన్న కొన్ని చోట్ల మాత్రమే వామపక్షాలకు గుర్తింపు ఉంది. మిగిలిన చోట్ల వామపక్షాలకు ఓటు బ్యాంకు చాల తక్కువుగా ఉందంటున్నారు. ఈ పరిస్థితులు నేపథ్యంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కు వామపక్షాల నుంచి వచ్చే మద్దతు పెద్దగా ఉండకపోవచ్చు అని అంటున్నారు. పైగా వామపక్షాల పట్ల వ్యతిరేకత ఉన్నవారు పవన్‌ను కూడా వ్యతిరేకిస్తారని అంటున్నారు. దీంతో వామపక్షాలతో చెలిమి పవన్‌ కల్యాణ్‌కు బలాన్ని ఇవ్వక పోగా శాపంగా మారుతుందేమోననే అనుమానాలు వస్తున్నాయి.