Begin typing your search above and press return to search.

ప‌వన్ పొత్తు అన‌గానే!..లెఫ్ట్ నేత‌లు చిట్టాల‌తో వ‌చ్చారే!

By:  Tupaki Desk   |   8 Jan 2019 4:56 PM GMT
ప‌వన్ పొత్తు అన‌గానే!..లెఫ్ట్ నేత‌లు చిట్టాల‌తో వ‌చ్చారే!
X
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకువ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ టీడీపీ - విప‌క్షం వైసీపీ త‌మ త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఎన్నిక‌ల‌కు చాలా ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేస్తామంటూ ఇరు పార్టీల నుంచి లీకులు వ‌స్తున్నా... ఆ దిశ‌గా ఆ పార్టీలు ఇప్ప‌టిదాకా సింగిల్ స్టెప్ కూడా వేయ‌లేదు. వైసీపీది ఒంట‌రి పోరేన‌ని ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌ల‌కు అంత‌గా టెన్ష‌న్ లేద‌నే చెప్పాలి. అయితే ప‌వ‌న్ త‌మ‌తో మ‌రోమారు పొత్తుకు రావాల్సిందేన‌ని టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ప‌దే ప‌దే చెబుతున్న తీరు.... ఆ పార్టీ నేత‌ల గుండెల్లో రైళ్ల‌ను ప‌రుగెట్టిస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని అన్ని సీట్ల నుంచి పోటీ చేస్తామ‌ని చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... టీడీపీతో మ‌రోమారు పొత్తు పెట్టుకునే స‌మ‌స్యే లేద‌ని తేల్చేశారు. అయితే మొత్తం సీట్ల నుంచి పోటీ చేసేందుకు స‌రిప‌డ అభ్య‌ర్థులు త‌మ వ‌ద్ద లేర‌నుకున్నారో? ఏమో? తెలియ‌దు గానీ... ఈ ద‌ఫా వామ‌ప‌క్షాల‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

చంద్ర‌బాబు మాదిరే సింగిల్ గా బ‌రిలోకి దిగిన చ‌రిత్ర లేని వామ‌ ప‌క్షాలు... ఈ మాట విన‌గానే ఎగిరి గంతేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎప్ప‌టినుంచో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటామ‌ని చెబుతూ వ‌స్తున్న వామ‌ప‌క్షాల నేత‌లు... ప‌వ‌న్ నోట ఈ ప్ర‌క‌ట‌న రాగానే... ఎన్నిక‌ల‌కు దాదాపుగా సిద్ధ‌మైపోయారు. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న కోస‌మే ఎదురు చూస్తున్న‌ట్లుగా క‌నిపించిన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శులు పి.మధు - కె.రామ‌కృష్ణ‌లు నేటి ఉద‌యం వాజ‌య‌వాడ‌లోనే ఉంటున్న జ‌న‌సేనాని వ‌ద్దకు ప‌రుగులు పెట్టారు. ఎలాగూ లెఫ్ట్ పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించాం క‌దా అన్న భావ‌న‌తో... వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికిన ప‌వ‌న్‌... వారి చేతుల్లోని పేప‌ర్ల‌ను చూసి నిజంగానే షాక్ తిన్నార‌ట‌. స‌ద‌రు పేప‌ర్ల‌లో ఏముంద‌న్న విష‌యానికి వ‌స్తే... పొత్తుపై ఎలాగూ ఓ మాట అన్నారు క‌దా... ఇక సీట్ల స‌ర్దుబాటు పైనా రెండో మాటా అనుకుంటే బాగుంటుంద‌ని లెఫ్ట్ నేత‌లు చెప్పిన వైనంతో షాక్ తిన్న ప‌వ‌న్‌... ఈ వ్య‌వ‌హార‌మేదో చూడాలంటూ ఇటీవ‌లే పార్టీలో చేరిన మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌ ను పుర‌మాయించార‌ట‌.

వారితో క‌లిసి కూర్చున్న నాదెండ్ల‌... ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగైదు నెల‌ల స‌మ‌యం ఉంది క‌దా... ఇప్పుడ‌ప్పుడే సీట్ల స‌ర్దుబాటు ఎందుకు? స‌ంక్రాంతి పోయిన త‌ర్వాత చూద్దామంటూ వారి ఉత్సాహంపై నీళ్లు చ‌ల్లిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా లెఫ్ట్ నేత‌ల చిట్టాల్లో ఏముంద‌ని త‌ర‌చి చూస్తే... త‌మ‌కు చెరో 30 సీట్ల‌ను కేటాయించాల‌ని, మిగిలిన సీట్ల‌లోనూ త‌మ‌కు మంచి ఓటింగ్ ప‌ర్సంటేజీలే ఉన్నాయ‌ని, ఆ ప‌ర్సంటేజీ ఓట్లంతా జ‌న‌సేన‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాయ‌ని న‌మ్మ‌కంగా చెప్పార‌ట‌. అయినా ఏనాడూ ప‌ది సీట్లకు మించ‌కుండానే పోటీ చేస్తున్న వామ‌ప‌క్షాలు... జన‌సేన బ‌ల‌మెంత‌? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త‌తోనే ముప్ప‌య్యేసి సీట్ల‌ను డిమాండ్ చేసిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మ‌రి సంక్రాంతి పోయిన త‌ర్వాత అయినా లెఫ్ట్ నేత‌ల ప్ర‌తిపాద‌న‌ల‌పై చ‌ర్చ‌లు సాగాల్సిందే క‌దా. మ‌రి అప్పుడు కూడా లెఫ్ట్ నేత‌ల ఆశ‌ల‌పై జ‌న‌సేనాని నీళ్లు చ‌ల్లుతారో? లేదంటే... ఎలాగూ త‌న బ‌లం అంతంత‌మాత్ర‌మే క‌దా... లెఫ్ట్ నేత‌లు అడిగిన‌న్ని సీట్లు ఇచ్చేస్తే స‌రిపోలా? అన్న దిశ‌గా ఆలోచిస్తారో చూడాలి.