Begin typing your search above and press return to search.

ప‌వ‌న్.. ఆ భ్ర‌మ‌ల నుంచి బ‌య‌ట‌కు రాడా?

By:  Tupaki Desk   |   31 Dec 2019 12:47 PM GMT
ప‌వ‌న్.. ఆ భ్ర‌మ‌ల నుంచి బ‌య‌ట‌కు రాడా?
X
ఎంత‌సేపూ ఉద్ధానం, మ‌ద‌న‌ప‌ల్లె ట‌మాటా రైతులేనా..ఒక రాజ‌కీయ పార్టీ ప‌నితీరుకు ఒక ఊరు, రెండు ఊర్లు మాత్ర‌మే ప్రామాణికాలు అవుతాయా? జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరును గ‌మ‌నించాకా వ‌చ్చే సందేహాలు ఇవే. అమ‌రావ‌తిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ..త‌న పోరాట ప‌టిమ గురించి త‌నే చెప్పుకున్నారు. తను ఎంతో సాధించిన‌ట్టుగా ఆయ‌న చెప్పుకున్నారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక రాజ‌కీయ పార్టీని పెట్టి ఇలా ఏవో ఒక‌టీ రెండు అంశాల గురించి త‌ర‌చూ చెప్పుకోవాల్సి రావ‌డం ఆయ‌న ఫెయిల్యూర్ కిందే లెక్క‌!

స‌రే... ఉద్ధానం స‌మ‌స్య‌నే తీసుకుందాం. అది ప‌రిష్కారం అయిపోయిందా? ఆ ప‌రిష్కారం ఏమిటో ప‌వ‌నే చెప్పాలి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాకా ఒక ఉద్ధానం గురించే కాకుండా.. రాష్ట్రంలో ఆ త‌ర‌హా స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న అంద‌రి మీదా దృష్టి పెట్టారు. తీవ్ర‌మైన కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ఫ‌డుతున్న వారికి భారీ ఎత్తున పెన్ష‌న్ ఏర్పాటు చేశారు, ఉచిత డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను నెల‌కొల్పారు. ఒక స‌మ‌స్య మీద దృష్టి పెట్ట‌డం అంటే అలా! ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక ఊరు గురించి మాట్లాడ‌టం మంచిదే, అలాగే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం అంటే స‌వాళ్లు, ఎత్తిపొడుపు మాట‌లు, రెచ్చ‌గొట్టే మాట‌లు మాట్లాడ‌టం కాద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికీ గ్ర‌హించ‌లేక‌పోతూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

రాజ‌కీయం - రాజ‌కీయ పార్టీ - ప్ర‌భుత్వం.. ఇవ‌న్నీ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇప్పుడ‌ప్పుడే అర్థం అయ్యే విష‌యాల్లా క‌నిపించడం లేదు. రెండున్న‌ర గంట‌సేపు సాగే సినిమా స్టార్ క‌దా. ఇప్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల్లో ఉండ‌టం క‌న్నా విరామాలు తీసుకోవ‌డ‌మే ఎక్కువ‌! ఆఫ్ రాజ‌కీయాల క‌న్నా ఆన్ లైన్ రాజ‌కీయాలే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్కువ‌గా చేస్తూ ఉన్నారు.

కులాలు, మ‌తాలు అయిపోయాయి.. ఇప్పుడు ప్రాంతాల వారీగా ప‌వ‌న్ రాజ‌కీయం మొద‌లైంది. మూడు ప్రాంతాల‌కూ స‌మ‌న్యాయం చేసే ఫార్ములాను ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ ఉన్నారు. ఒకే ప్రాంతంలో రాజ‌ధాని ఉండాలంటూ త‌న‌కు తోచిన‌ట్టుగా ప‌వ‌న్ మాట్లాడుతూ ఉన్నారు. దాని వ‌ల్ల మిగ‌తా ప్రాంతాల ప్ర‌జ‌లు ఏమైపోవాలో ప‌వ‌న్ కే తెలియాలి. ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్ప‌టికిప్పుడు త‌న‌కు తోచినంది, త‌ను లోన‌య్యే వివిధ ప్ర‌భావాల‌కు అనుగుణంగా మాట్లాడుతున్న‌ట్టుగా క‌నిపిస్తాడు త‌ప్ప‌... రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప‌దేళ్లు అయిపోయినా..ఆయ‌న తీరులో మాత్రం ఇప్ప‌టికీ పెద్ద మార్పు కనిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హమ‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.