Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ఏపీవాళ్ల‌ను ఆంధ్రుల‌ని కొడుతున్నారా?

By:  Tupaki Desk   |   23 March 2019 3:33 AM GMT
తెలంగాణ‌లో ఏపీవాళ్ల‌ను ఆంధ్రుల‌ని కొడుతున్నారా?
X
ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రాజ‌కీయ పార్టీ కానీ.. ఏ రాజ‌కీయ అధినేత కానీ మాట్లాడ‌ని అంశాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తెర మీద‌కు తెచ్చారు. తాజాగా ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడుతూ.. కొత్త త‌ర‌హా వాద‌న‌ను వినిపించారు. ఇప్ప‌టివ‌ర‌కూ మీడియాలో రిపోర్ట్ చేయ‌ని కొత్త అంశాల్ని ఆయ‌న త‌న ప్ర‌సంగాల్లో ప్ర‌స్తావిస్తున్నారు.

తెలంగాణ‌లో ఏపీకి చెందిన వారిని ఆంధ్రులంటూ కొడుతున్నార‌న్న సంచ‌ల‌న విష‌యాన్ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఏపీలో ప్ర‌జ‌లు కుల‌మ‌తాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే.. తెలంగాణ‌లో మాత్రం ఏపీ ప్ర‌జ‌ల్ని ఆంధ్రులంటూ కొడుతున్నార‌న్నారు.

‘‘విభిన్న సామాజికవర్గాలు.. మతాలపేరుతో మనలో మనం ఇక్కడ కొట్టుకుంటున్నాం. కానీ, తెలంగాణకెళ్తే.. అక్క‌డ మనందరినీ కలిపి ఆంధ్రావాళ్ల కింద కొడుతున్నారు. దళితులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు ఎవరైనా కానివ్వండి.. వారికి మాత్రం మనం ఆంధ్రులం" అని వ్యాఖ్యానించారు.

తానీ కులాల‌తో విసిగిపోయిన‌ట్లుగా చెప్పిన ప‌వ‌న్‌.. కులాలు పెళ్లిళ్లు చేసుకోవడానికే అన్న ఆయ‌న‌.. స్నేహం చేయ‌టానికి కుల‌మంటే కుద‌ర‌ద‌న్నారు. అలాంటిది పాలిటిక్స్ లోకి కులం వచ్చిందంటే మనం అధఃపాతాళానికి వెళ్లిపోతున్నామని అర్థమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భావజాలంతో రాజకీయం ముడిపడాలిగానీ.. కులంతో ముడిపడి రాజకీయమంటే అది మనం భయపడాల్సిన విషయమ‌న్నారు.

అందుకే త‌న‌కెప్పుడూ కులం లేదు - మతం లేదు - ప్రాంతం లేదు అని ఎందుకంటానంటే.. త‌న‌కు మానవత్వమే ఉందన్నారు. ప్రతి కులానికీ తాను గౌరవం ఇస్తాన‌ని.. అభివృద్ధిలో అందరికీ సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తాను’’ అని పవన్ చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ ప్ర‌స్తావించ‌టానికి కూడా ఇష్ట‌ప‌డని అంశాన్ని ప‌వ‌న్ ప్ర‌స్తావించ‌టం..దానిపై ఎలాంటి స్పంద‌న‌లు వ‌స్తాయో చూడాలి.