Begin typing your search above and press return to search.

పీకే!... గురివింద‌ను మ‌రిపిస్తున్నారే!

By:  Tupaki Desk   |   15 Nov 2018 10:11 AM GMT
పీకే!... గురివింద‌ను మ‌రిపిస్తున్నారే!
X
టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు త‌న‌దైన రాజ‌కీయాన్నిమొద‌లెట్టిన‌ట్టే ఉంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీకి విజ‌యాన్ని ద‌క్కించి, ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిని తానే సీఎం పీఠం ఎక్కించానంటూ మొన్న‌టిదాకా చాలా గొప్ప‌గా చెప్పుకున్న ప‌వ‌న్‌... ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా మాట మార్చేశారు. అప్ప‌టిదాకా క‌నిపించ‌ని చంద్ర‌బాబు అవినీతి - ఆయ‌న కుమారుడు లోకేశ్ దౌర్జ‌న్యాలపై దండెత్తారు. అధికారం చేప‌ట్టిన నాటి నుంచి ఏక‌బిగిన ఒకే పంథాలో సాగుతున్న చంద్ర‌బాబు పాల‌న నాలుగేళ్ల పాటు ప‌వ‌న్‌కు సాఫీగానే క‌నిపించాయా? అన్న అనుమానాలు కూడా జ‌నానికి క‌లిగిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. మొత్తంగా అవినీతి పాల‌న‌పై ప‌వ‌న్ ఇక‌నైనా పోరాటం మొద‌లెట్టార‌ని కొన్ని వ‌ర్గాలు సంతోషించినా... ఇప్పుడు ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రిపై మాత్రం చాలా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నాయి. విడ‌త‌ల‌ వారీ ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తున్న ప‌వ‌న్‌.... ఎప్ప‌టిక‌ప్పుడు ఓ కొత్త త‌ర‌హా వైఖ‌రితో మాట్లాడుతూ జ‌నాన్ని అయోమ‌యంలో ప‌డేస్తున్నారు. అయినా ప‌వ‌న్ టార్గెట్ చేస్తున్న‌ది అవినీతి పాల‌న‌నా? లేదంటే ఇంకేదైనా ఆశించిన కార‌ణఃగానే ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వైఖరిని మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తంగా ప‌వ‌న్ ఇప్పుడు ఏ ఒక్క‌రికి కూడా అర్థం కాని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న మాట మాత్రం జ‌నాల్లో బాగానే నాటుకు పోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ కార‌ణంగా ఆయ‌న సొంత వ‌ర్గంలోనూ ఇప్పుడు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న‌లు పెల్లుబుకుతున్నాయ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

ఇక నిన్న తూర్పుగోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అధికార పార్టీ దుష్ట పాల‌న‌పై త‌న‌దైన ఘాటు వ్యాఖ్య‌ల‌ను త‌గ్గించేసిన ప‌వ‌న్‌... అదే అధికార పార్టీ అవినీతి - ద‌మ‌న‌ నీతిపై అలుపెర‌గ‌ని పోరు సాగిస్తున్న ఏపీ విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నేల‌బారు వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ల‌డం లేద‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఇదే విష‌యంపై ఇప్ప‌టికే వైసీపీ క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గా స‌మాధానం కూడా ఇచ్చేసింది. ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టానికి విఘాతం క‌లిగిస్తూ... త‌మ పార్టీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన 25 మంది ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు కొనేస్తే... వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ... స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ ను కోరింది. ఇలా స్పీక‌ర్‌ కు ఒక‌సారి కాదు క‌దా... చాలా సార్లే లిఖితపూర్వ‌క ఫిర్యాదులు కూడా చేసింది. అయితే కోడెల కూడా టీడీపీ నేతే కావ‌డంతో జంపింగ్‌ల‌పై చ‌ర్య‌ల‌కు స‌సేమిరా అంటున్నారు. పార్టీ ఫిరాయింపుల‌ను నిరోధించాల్సిన గురుత‌ర బాధ్య‌త‌లో ఉన్న కోడెల‌... అస‌లు వైసీపీ ఫిర్యాదుల వైపు క‌న్నెత్తి చూసిన పాపాన పోలేదని వైసీపీ ఆరోపించింది. స్పీక‌ర్‌ - అధికార పార్టీ వైఖ‌రికి నిర‌స‌న‌గానే తాము అసెంబ్లీకి వెళ్లి దూరంగా ఉంటున్నామ‌ని కూడా వైసీపీ చాలా క్లియ‌ర్‌ గానే స‌మాధానం ఇచ్చేసింది. ఇదేమీ త‌న‌కు విన‌బ‌డ‌న‌ట్టుగా ప‌వ‌న్ ఇప్పుడు ఆ విష‌యాన్ని ఎత్త‌డం నిజంగానే హాస్యాస్పదంగా ఉంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఇక ప‌వ‌న్ సంధించిన ఆరోప‌ణ‌నున చూస్తే... తెలంగాణ‌లో కేసీఆర్ పాల‌న‌పై జ‌గ‌న్ ఏమాత్రం స్పందించ‌డం లేద‌ని శోకాలు పెట్టిన వైనం నిజంగానే ఆశ్చ‌ర్యం అనిపించ‌క మాన‌దు. ఇటీవ‌ల త‌న‌ను ఏకంగా టాలీవుడ్ నుంచే గెంటేసిన‌ట్టుగా రిజ‌ల్ట్ వ‌చ్చిన *అజ్ఞాత‌వాసి* చిత్రం ప్ర‌మోష‌న్ కోసం ఏకంగా కేసీఆర్ తో కాళ్ల బేరానికి వెళ్లిన‌దెవ‌ర‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ వ్యాఖ్య‌లు గుర్తుకు తెస్తున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌న చిత్రం ప్రీమియ‌ర్ షోల అనుమ‌తి కోసం ఏకంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ కు వెళ్లిన ప‌వ‌న్‌... కేసీఆర్‌ తో గంట‌ల త‌ర‌బ‌డి భేటీ కావ‌డం, ఆ త‌ర్వాత కేసీఆర్ పాల‌న ఆహా ఓహో అన్న రీతిలో సాగుతోంద‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన వైనం కూడా ఇప్పుడు జ‌నానికి గుర్తుకు వ‌స్తోంది. కేసీఆర్‌ తో త‌న స్వ‌ప్రయోజ‌నాల కోసం కాళ్ల బేరానికి వెళ్లిన ప‌వ‌న్‌... కేసీఆర్‌ తో గానీ, తెలంగాణ వ్యవ‌హారాల‌తో గానీ అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్‌పై ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేయ‌డం దివాళాకోరు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నంగా చెప్ప‌క త‌ప్ప‌దేమో. మొత్తంగా గురివింద గింజ‌లా త‌న కింద ఉన్న న‌లుపు త‌న‌కు క‌న‌ప‌డ‌క‌పోతే... జ‌నానికి కూడా క‌న‌ప‌డ‌ద‌న్న భావ‌న‌తో ప‌వ‌న్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసి త‌న‌ను తాను మ‌రింత దిగ‌జార్చుకున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ లెక్క‌న ప‌వ‌న్ గురివింద నీతినైనా అవ‌లంబిస్తూ ఉండాలి - లేదంటే ఇత‌ర పార్టీల నేత‌లు చెబుతున్న మాట‌లు త‌న‌కు విన‌బ‌డ‌లేద‌న్న రీతిలో చెవిటోడి మాదిరిగానైనా న‌టిస్తుండాలి అన్న మాట వినిపిస్తోంది.