Begin typing your search above and press return to search.

ఈ ప్రశ్న అప్పుడెందుకు అడగలేదు పవన్?

By:  Tupaki Desk   |   26 Nov 2018 3:41 PM GMT
ఈ ప్రశ్న అప్పుడెందుకు అడగలేదు పవన్?
X
గత కొన్ని నెలల్లో పవన్ మాటలు.. అతడి తీరు చూస్తే ఫక్తు రాజకీయ నాయకుడిగా పరిణామం చెందిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన మరోసారి అదే తరహాలో మాట్లాడాడు. కొన్ని రోజులుగా పవన్ కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ బ్రాహ్మణులతో ఇలాంటి సమావేశమే పెట్టాడు. వారి ఇబ్బందుల గురించి మాట్లాడాడు. సినిమాల్లో బ్రాహ్మణ వర్గాన్ని కించపరుస్తున్నారని.. వారిని చాలా తక్కువగా చేసి చూపిస్తున్నారని పవన్ మొసలి కన్నీరు కార్చాడు. కానీ 20 ఏళ్లకు పైగా పవన్ సినిమాల్లో ఉన్నాడు. కానీ ఏనాడూ ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఇలాంటివి నివారించడానికి తన వంతు ప్రయత్నం ఏమీ చేయలేదు.

మంచు విష్ణు నటించిన ‘దేనికైనా రెడీ’.. ఎన్టీఆర్ సినిమా ‘అదుర్స్’.. ఇంకా కొన్ని తెలుగు సినిమాల్లో బ్రాహ్మణుల్ని కించపరిచే సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా ‘దేనికైనా’ రెడీలోని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆందోళనలు నడిచాయి. కానీ అప్పుడెప్పుడూ పవన్ ఒక్క మాట మాట్లాడలేదు. అభ్యంతకరక సన్నివేశాలు - డైలాగుల్ని ఖండిస్తూ ఏ ప్రకటన చేయలేదు. ఇప్పుడు సినిమాల నుంచి నిష్క్రమించి రాజకీయాల్లోకి వచ్చాక బ్రాహ్మణుల్ని సినిమాల్లో కించపరుస్తున్నారంటూ ఔట్ సైడర్ లాగా మాట్లాడటమేంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి మాటలు చూస్తేనే పవన్ సగటు రాజకీయ నాయకులకు భిన్నమేమీ కాదన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి.