Begin typing your search above and press return to search.

మోడీ..బాబు..దేవ్‌..ఎక్క‌డికీ తిరోగ‌మ‌నం ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   4 May 2018 5:30 PM GMT
మోడీ..బాబు..దేవ్‌..ఎక్క‌డికీ తిరోగ‌మ‌నం ప‌వ‌న్‌?
X
ప‌వ‌న్ అంటే ఒక ప్ర‌భంజ‌నం అంటారు ఆయ‌న అభిమానులు. మా దేవుడు అంటూ కీర్తిస్తారు ఆయ‌నంటే ఇష్ట‌ప‌డేవారు. ఆయ‌న్ను కాకుంటే మ‌రెవ‌రిని న‌మ్మ‌గ‌ల‌మ‌ని భావించేవారికి కూడా కొద‌వ‌లేదు. మ‌రింత ఇమేజ్ ఉన్న వ్య‌క్తిని ఈజీగా బుట్ట‌లో వేసేయొచ్చా? అన్న‌ది ఇప్పుడు తెర మీద‌కు వ‌స్తున్న ప్ర‌శ్న‌. ప‌వ‌న్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయ‌టానికి ఒక వ‌ర్గం ఉద్య‌మ‌స్ఫూర్తితో ప‌ని చేస్తోంద‌ని మండిప‌డే వారికి ఇప్పుడు చెప్పే మాట‌లు రుచించ‌క‌పోవ‌చ్చు. కానీ.. క‌ఠిన వాస్త‌వం ఇలానే ఉంటుంద‌న్న‌ది అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు.

ఇప్ప‌టి సంగ‌తులు కాసేపు వ‌దిలేద్దాం. నాలుగైదేళ్ల కింద‌కు వెళ‌దాం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీని ఎంపిక చేసిన త‌ర్వాత దేశ వ్యాప్తంగా ఆయ‌న చుట్టూనే చాలానే రాజ‌కీయం న‌డిచింది. ఎంతో మంది ఆయ‌న్ను వెళ్లి క‌లిసి వ‌చ్చారు. నిజానికి అప్ప‌ట్లో మోడీ అపాయింట్ మెంట్ దొర‌క‌టం అంత ఈజీ కాదు. అయితే.. ప‌వ‌న్ లాంటోడు మోడీని క‌లుస్తానంటే ఆయ‌న మాత్రం ఎందుకు వ‌ద్దంటారు? అలా కాబోయే ప్ర‌ధానితో భేటీ అయి.. ఏపీ స‌మ‌స్య‌ల గురించి మాట్లాడి.. ఆయ‌న ద‌గ్గ‌ర హామీలు తీసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చారు.

క‌ట్ చేస్తే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో భేటీ అయిన ప‌వ‌న్‌.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేశారు. తాను పోటీ చేయ‌కున్నా.. బీజేపీ.. టీడీపీ త‌ర‌ఫు ప్ర‌చారం చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. ఎన్నిక‌ల వేళ మోడీ.. చంద్ర‌బాబుల‌తో ప‌వ‌న్ జ‌రిపిన ర‌హ‌స్య చ‌ర్చ‌లు ఏమిట‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు. అంత‌ర్గ‌తంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్ని ప‌క్క‌న పెడితే.. నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో ఈ ఇద్ద‌రితోనూ ప‌వ‌న్‌ కు చెడింది.

ఇద్ద‌రిని ఉద్దేశించి ప‌వ‌న్ చేసే ఆరోప‌ణ ఏమిటంటే.. ఇద్ద‌రూ త‌న న‌మ్మ‌కాన్ని దెబ్బ తీశార‌నే. అంటే.. ప‌వ‌న్ ను న‌మ్మించ‌టం.. ఆయ‌న్ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌టంలో మోడీ.. బాబులు ఇద్ద‌రూ స‌క్సెస్ అయ్యార‌నుకుందాం. త‌న‌కు ఏం కావాలో.. తానేం కోరుకుంటున్నాడ‌న్న‌ది వారిద్ద‌రికి చెప్ప‌టంలో ప‌వ‌న్ ఫెయిల్ అయ్యారా? లేదంటే.. వారిద్ద‌రూ త‌నకిచ్చిన హామీల్ని అమ‌లు చేయించుకోవ‌టం ప‌వ‌న్ కు చేత‌కాలేదా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతాయి.

ఇదిలా ఉంటే.. ఐదేళ్ల కింద‌ట మోడీ.. బాబుల కార‌ణంగా తాను మోస‌పోయిన‌ట్లుగా చెప్పుకునే ప‌వ‌న్‌.. తాజాగా దేవ్ అనే ఒక బీజేపీ సాధార‌ణ కార్య‌క‌ర్త చేతిలో మోస‌పోయారా? అన్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఐదేళ్ల క్రితం బీజేవైఎంలో స‌భ్య‌త్వం తీసుకున్న‌ట్లుగా దేవ్ కు సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చిన వివ‌రాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అంటే.. దేశ ప్ర‌ధాని స్థానానికి పోటీ ప‌డుతున్న ప్ర‌ధాన అభ్య‌ర్థితో నేరుగా మాట్లాడే స్థాయిలో ప‌వ‌న్ ఉండేవారు. ఇదే స‌మ‌యానికి దేవ్ అనే వ్య‌క్తి బీజేపీలోని ఒక విభాగంలో స‌భ్బ‌త్వాన్ని న‌మోదు చేసుకున్న ప‌రిస్థితి. దాదాపు ఐదేళ్ల వ్య‌వ‌ధిలో ప‌వ‌న్ కు రాజ‌కీయ స‌ల‌హాదారుగా వెళ్లే స్థాయికి దేవ్ చేరితే.. నాకు తెలుగు అంత బాగా రాదు.. అంటూ చెప్పి.. అంత‌లోనే అల‌వోక‌గా తెలుగు మాట్లాడే దేవ్ మాట‌ల్ని ఆయ‌న ప‌క్క‌నే కూర్చొని ప‌వ‌న్ వినే ప‌రిస్థితి వ‌ర‌కూ వెళ్లింది.

ప‌వ‌న్ ను న‌మ్మించ‌టం అంత తేలికా? ఆయ‌న్ను తేలిగ్గా బుట్ట‌లో ప‌డేయొచ్చా? ఆయ‌న మంచిత‌నం ఇప్పుడు అలుసైపోతుందా? మ‌నుషుల్ని న‌మ్మాల‌న్న ఆయ‌న ఫిలాస‌ఫీ ప‌వ‌న్ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీస్తుందా? అన్న ప్ర‌శ్న‌లు దేవ్ ఎపిసోడ్‌లో తెర మీద‌కు వ‌స్తున్నాయి. ప‌దేళ్ల ప‌రిచ‌యం ఉందంటూ దేవ్ గురించి చెప్పిన ప‌వ‌న్‌.. అత‌డికి తెలుగు వ‌చ్చా? రాదా? అన్న క‌నీస విష‌యం తెలీదా? అన్న‌ది ప్ర‌శ్న అయితే.. ఒక‌వేళ త‌న మాతృభాష త‌న‌కు రాద‌ని అబ‌ద్ధం చెప్పే ధైర్యం.. నిలువెత్తు నిజాయితీకి నిద‌ర్శ‌నంగా ప‌వ‌న్ అభిమానులు భావించే దేవుడు ముందు దేవ్ అబ‌ద్ధాన్ని అంత ఈజీగా ఎలా చెప్ప‌గ‌లిగారు? అన్న‌ది మ‌రో సందేహం. ఇంత‌కీ.. ప‌వ‌న్ ను బుట్ట‌లో వేయ‌టం ఈజీనా..? కాదా? ఈ విష‌యాన్ని ఎవ‌రికి వారే స‌మాధానం చెప్పేసుకుంటే బెట‌రేమో క‌దూ?