Begin typing your search above and press return to search.

పవన్ కు ఈవీఎంల మీద అవగాహన లేదా?

By:  Tupaki Desk   |   17 April 2019 2:30 PM GMT
పవన్ కు ఈవీఎంల మీద అవగాహన లేదా?
X
పోలింగ్ తర్వాత జనసేన మరీ ఊసులో లేకుండా పోయింది. ఎన్నికల ప్రచారంలోనేమో తమ పార్టీకి అధికారం దక్కుతుందని జనసేన వాళ్లు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పోలింగ్ అనంతరం మాత్రం పవన్ కనీసం చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టలేదు. రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసి - తనే రెండు చోట్ల నామినేషన్ వేసి - తన పార్టీని పోటీ చేయించి - ప్రచారం చేసి.. తీరా పోలింగ్ పూర్తి అయిన తర్వాత మాత్రం పవన్ కల్యాణ్ మాట మాత్రమైన స్పందించకపోవడం విడ్డూరంగా ఉందనే చెప్పాలి.

ఒక రాజకీయ పార్టీ అధినేతగా.. ఇప్పుడు స్పందించడం పవన్ కల్యాణ్ బాధ్యత. తనకు మీడియా ముందుకు వచ్చేంత తీరిక లేకపోతే.. కనీసం ఏ ప్రెస్ నోటో విడుదల చేయొచ్చు. దానికీ తీరిక లేకపోతే ఫేస్ బుక్ లోనో - ట్విటర్ లోనో స్పందించవచ్చు. అయితే జనసేన అధిపతి మాత్రం జరిగిన ఎన్నికలతో తనకు సంబంధం లేదన్నట్టుగా కామ్ అయిపోయారు!

ఎన్నికల్లో పోటీ చేసి.. ఎన్నికల తర్వాత ఇలా మొహం చాటేయడం చర్చనీయాంశంగా మారింది. అవతల ఈవీఎంల విషయంలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈవీఎంల మీద చంద్రబాబు నాయుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గెలిచేది తమ పార్టీనే అంటూ.. మరోవైపు ఈవీఎంల మీద బాబు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ అంశం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తన స్పందన తను తెలియజేస్తూ ఉంది.

ఇలాంటి నేఫథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించడం లేదు. పోలింగ్ జరిగిన తీరు మీద కానీ, తమ విజయావకాశాల గురించి కానీ స్పందించడం లేదు. ఈవీఎంల మీద అనుమానాల మీదా మాట్లాడటం లేదు. ఇదంతా చూస్తుంటే.. పవన్ కల్యాణ్ కు ఈవీఎంల మీద అవగాహన లేదా, ఇక రాజకీయాల మీదే ఆసక్తి లేదా? అనే సందేహాలు కలుగుతూ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.