Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ విషయంలో పవన్‌ వెనక్కి తగ్గాడా.?

By:  Tupaki Desk   |   28 March 2019 8:10 AM GMT
కేసీఆర్‌ విషయంలో పవన్‌ వెనక్కి తగ్గాడా.?
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్‌ ని టార్గెట్ చేసి ఆ సెంటిమెంట్‌ తో ఓట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు. ఇదే సమయంలో అటు పవన్‌ కల్యాణ్ కూడా ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నాడు. తెలంగాణలో ఆంధ్రావాళ్లని కొడుతున్నారని కామెంట్‌ చేశాడు. అయితే ఈ కామెంట్స్‌ పై ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి పవన్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కొట్టినోళ్లు ఎవరో తనకు చూపించమని పోసాని అడిగితే - రాజకీయాల కోసం అబద్ధాలు ఆడడం కరెక్ట్‌ కాదని చిన్నికృష్ణ - కోన వెంకట్‌ విమర్శించారు. మరోవైపు.. చంద్రబాబు - పవన్‌ కలిసి నాటకాలు ఆడుతున్నారని.. వాళ్లిద్దరూ పనిగట్టుకుని కేసీఆర్‌ ని - తనని విమర్శిస్తున్నారని జగన్‌ అన్నారు. దీంతో.. పవన్ డిఫెన్స్‌ లో పడినట్లు అయ్యింది.

పవన్‌ తన సభల్లో అక్కడక్కడ చంద్రబాబుని విమర్శిస్తున్నా కానీ ఎక్కువభాగం విమర్శలు జగన్‌ పైనే ఉంటున్నాయి. దీన్ని బేస్‌ చేసుకునే చంద్రబాబు - పవన్‌ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని వైసీపీ విమర్శిస్తోంది. సో..కేసీఆర్‌ ని తిడుతుంటే చంద్రబాబుకి ప్లస్‌ అవుతుందనుకున్న పవన్‌.. అలా జరక్కపోయేసరికి డిఫెన్స్‌ లో పడ్డాడు. కేసీఆర్‌ పై తిట్ల ప్రవాహాన్ని తగ్గించేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరికైనా గిఫ్ట్‌ లు ఇచ్చుకోవచ్చని.. అందుకు తనకేం అభ్యంతరం లేదని అన్నారు. అయితే.. కేసీఆర్ దొంగచాటుగా దెబ్బతీయకుండా ధైర్యంగా వచ్చి ఏపీలో వచ్చి పోటీ చేయాలని సూచించారు. అంతేగాకుండా జగన్‌ కు వెనుక నుంచి సపోర్ట్‌ చేయడం మానుకోవాలని అన్నారు. మొత్తానికి కేసీఆర్‌ విషయంలో పవన్‌ కల్యాణ్ వెనక్కు తగ్గినట్లే కన్పిస్తుంది.