Begin typing your search above and press return to search.

పవన్‌ కు వచ్చే సీట్లు ఇవేనట..!

By:  Tupaki Desk   |   17 April 2019 9:52 AM GMT
పవన్‌ కు వచ్చే సీట్లు ఇవేనట..!
X
ఏపీలో మొన్నటి వరకు ఎన్నికల జోరు హోరా హోరీగా సాగింది. పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం సైలెంట్‌ వాతావరణం కనిపిస్తున్నా అభ్యర్థులు - పార్టీ నాయకుల మధ్య చర్చల పరంపర సాగుతోంది. అభ్యర్థులతో పాటు పార్టీ అధినేతలు తమకు వచ్చే సీట్ల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ 150కి పైగా సీట్లు వస్తాయని చెబుతుండగా.. ఈసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని వైసీపీ ధీమాతో ఉంది. అయితే ఎన్నికల్లో టీడీపీ - వైసీపీలతో సమానంగా పోటీపడ్డ జనసేన పోలింగ్‌ తరువాత ఒక్కసారిగా కామ్‌ అయిపోయింది. ఓట్ల పండుగ తరువాత టీడీపీ - వైసీపీల అధినేతలు మీడియా ముందుకు వచ్చి ఎవరికివారే గెలుస్తామని చెప్పారు. కానీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఒక్క ప్రెస్‌ మీట్‌ పెట్టకపోవడంతో ఆయన కేడర్‌ లో అనుమానాలు మొదలయ్యాయి.

సినీ ఫీల్డు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉంది. ఒక దశలో పవన్‌ ఏమాత్రం ఖర్చుపెట్టకుండా ఫ్యాన్స్‌ ద్వారా ఆదారాభిమానాలు పొందారు. ఇదే ఆయన రాజకీయాల్లోకి రావడానికి కారణమైంది. మరోవైపు కాపు సామాజిక వర్గం జనసేన వెంటే వస్తారని ఆ పార్టీలోని నాయకులు ధీమాతో ఉన్నారు. దీంతో పవన్‌ సీపీఎం - బీఎస్పీలతో పొత్తుపెట్టుకొని రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఓటర్లపై జనసేన పూర్తిగా ఆధారపడిందని చెప్పవచ్చు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఆదరణ ఉందని ఆ పార్టీ నేతలు చేయించిన సర్వే ద్వారా తెలిసింది. అందుకే ఆయన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేశారు. అటు విశాఖలోని గాజువాక నుంచి కూడా బరిలో ఉన్న పవన్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం చేశారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ - వైసీపీలకు ముచ్చెమటలు పట్టించారు. ఆయన ప్రచార ఉధృతిని చూసి ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌ మేకర్‌ అయ్యే అవకాశం ఉందని చర్చ కూడా సాగింది.

అయితే ఈనెల 11న పోలింగ్‌ తరువాత సీన్‌ మారినట్లు కనిపిస్తోంది. ప్రచారంలో తమకు కచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పిన పవన్‌ పోలింగ్‌ తరువాత కనీసం తమను ప్రజలు ఆదరించారని కూడా ప్రకటించకపోవడంతో పార్టీ కేడర్‌ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

పవన్‌ బహిరంగంగా సమావేశం నిర్వహించకపోయినా ముఖ్యనేతలను మాత్రం కలిసినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్న పవన్‌ మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 25 నుంచి 30 లోపు సీట్లు వచ్చే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విశ్లేషకులు మాత్రం సింగిల్‌ డిజిట్‌ దాటడమే కష్టతరమని అంటున్నారు. అయితే పవన్‌ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో చూడాలి.