Begin typing your search above and press return to search.

న‌న్నెవ‌రూ గుడ్డిగా ఫాలో అవ‌ద్దుః ప‌వ‌న్

By:  Tupaki Desk   |   6 Dec 2017 3:30 PM GMT
న‌న్నెవ‌రూ గుడ్డిగా ఫాలో అవ‌ద్దుః ప‌వ‌న్
X
విశాఖలో ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తల సమన్వయ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఉద్వేగ భ‌రిత ప్ర‌సంగం చేశారు. స‌మాజంలోని అన్ని అంశాల‌పై స్పందిస్తూ...త‌న మ‌న‌సులోని భావాల‌ను బ‌య‌ట‌పెట్టుకుంటూ...త‌న‌పైవ చ్చిన విమ‌ర్శ‌ల‌కు క్లారిటీ ఇస్తూ ప‌వ‌న్ త‌నదైన శైలిలో ప్ర‌సంగించారు. ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుందని ప‌వ‌న్ తెలిపారు. `కొంతమందికి వేలకోట్లు సంపాదించనే పిచ్చి ఉంటుంది. మరికొంత మందికి ఎప్పుడూ అధికారంలో ఉండాలనే పిచ్చి ఉంటుంది. అయితే సమాజం బాగుండాలనేది నా పిచ్చి. నన్ను ఎవరూ గుడ్డిగా అనుసరించవద్దు` అని ప‌వ‌న్ నిర్మొహ‌మాటంగా చెప్పారు.

ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న చిరంజీవిలాంటి మహా వ్యక్తిని కూడా కొందరు తమ లబ్దికోసం బలిపెట్టారని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీకి ఉన్న బలం నాకు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నా పార్టీకి ఖర్చులు పెట్టేవారు కూడా లేరన్నారు. పీఆర్పీ మాదిరిగా జనసేన కూడా అవుతుందన్న మాట రాకూడదనే నా ప్రయత్నం చేస్తున్నానన్నారు. జవాబుదారీ కావాల్సిన రాజకీయ వ్యవస్థ రావాలన్నదే నా లక్ష్యమన్నారు. పీఆర్పీని దెబ్బతీసిన స్వార్థ శక్తుల్ని ఏ ఒక్కరినీ నేను మర్చిపోలేదన్నారు. చిరంజీవికి ద్రోహం చేసిన ప్రతి ఒక్కరినీ జనసేన చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెబుతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికే పార్టీ పెట్టానని.. సరదాకోసం పార్టీ పెట్టలేదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సత్యాగ్రాహి నిజజీవితంలో ఎందుకు కాకూడదని అనిపించిందన్నారు. సమూల మార్పులు సాధించలేకపోవచ్చు కానీ ఎంతో కొంత మార్పు తీసుకురావడం సాధ్యమేనన్నారు. 2003లో రాజకీయాల్లోకి రావాలనుకున్న విష‌యాన్ని అమ్మకు - నాన్నకు - అన్న చిరంజీవికి చెప్పానన్నారు.

రాజకీయాల్లో కొంతమంది వేలకోట్ల డబ్బు వెనకేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అధికార దుర్వినియోగంతో అవినీతి సొమ్మును పోగేసుకున్నారని ఆయ‌న ఆరోపించారు. అందుకే తాను వైఎస్ ఆర్సీపీని వ్యతిరేకించానన్నారు. జగన్ అంటే నాకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. యదా రాజా తథా ప్రజ.. ముఖ్యమంత్రే అవినీతి చేస్తే ప్రజలు అదే చేస్తారని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం - సమాజం - ప్రజా శ్రేయస్సు కోసమే టీడీపీ - బీజేపీకి మద్దతిచ్చానని ఆయ‌న తెలిపారు. వైఎస్ చ‌నిపోగానే జ‌గ‌న్ ప‌ద‌వి ఆశించ‌డం స‌రికాద‌ని ప‌వ‌న్ అన్నారు. వారసులు ప్రతిభను నిరూపించుకొని రాజకీయాల్లోకి రావాలన్నారు. ఫోన్ చేస్తే డబ్బులు ఇవ్వడానికి తన తండ్రి వద్ద ఏమైనా వేల కోట్లు - లక్షల కోట్లు ఉన్నాయా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. లేదా తన తండ్రి ఏమైనా కామధేనువును పెట్టుకున్నారా అన్నారు. అడగ్గానే బంగారం ఎంతైనా ఇవ్వడానికి తమ వద్ద అతీత శక్తులు లేవని అభిప్రాయపడ్డారు.

జనసేన అనే దేహానికి కార్యకర్తలు రక్తంలాంటి వాళ్లని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులానికి పరిమితమైందని ఆయ‌న వ్యాఖ్యానించారు. బీజేపీ హిందూమతానికి పరిమితమైందన్నారు. పూర్తిగా జాతీయ భావాలున్న పార్టీ రావాలని కోరారు. అహంకారాన్ని తనలోనుంచి తీసివేశానన్నారు. నేను అనే పదాన్ని ప్రజా సమస్యలపై పోరాడే సమయంలోనే వాడతానన్నారు. ఒక కొత్త యువరక్తం రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ధైర్యం నింపే వ్యక్తి అండగా లేకే జనం సమస్యలపై ముందుకు రావడం లేదన్నారు. యువత - మహిళలు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే రాటుదేలిపోయి ఉండేవాళ్లన్నారు. స్పెషల్ స్టేటస్ సాధించుకునే స్థాయికి రాటుదేలిపోయి ఉండేవారన్నారు. `నాకు నేను ధైర్యం తెచ్చుకునేందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను` అని పవన్ కల్యాణ్ తెలిపారు. తన వద్ద ఇవ్వడానికి డబ్బులు - బంగారం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ - కేవలం మనసు మాత్రమే ఉందని చెప్పారు. తనకు ఇవ్వాలనే మనసు ఉన్నప్పటికీ అంత సొత్తూ - సత్తా తన వద్ద లేదన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ దెబ్బకొట్టిన విధానం బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు నన్ను వాడుకుని వదిలేశాడంటున్నారు.. ఎవరేం చేస్తున్నారో నాకు తెలీదా అని ఆయన ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు కూడా ఉన్నాయన్నారు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారన్నారు. జగన్ పై నాకు ఎందుకు వైరం ఉంటుందని అన్నారు. ఈరోజుకీ మనం ఉత్తరాది - దక్షిణాది అంటుంటామని, ఆ రోజుల్లో అశోక్ గజపతిరాజుల్లాంటి సంస్థానాలు - రాజులున్నారన్నారు. నెహ్రూ - వల్లభాయ్ పటేల్ - అంబేద్కర్ వంటి నేతల స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

`మనది పెద్ద కుటుంబం. వసుదైక కుటుంబం. సిినిమాల వల్ల వ్యవస్థలు మారవు. ఆచరించి మిగతా వారికి చెబితేనే దానికి విలువ ఉంటుంది. సినిమాలు హిట్టవుతున్నా నాకు ఆనందం లేదు. నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకోవాలి. ఒక దేశానికి ఒక నది సరిపోదని ఓ మహాకవి అన్నారు. అందుకే దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త రక్తం కావాల్సిన అవసరముంది` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చిన్న విత్తనమే మహా వృక్షమవుతుందన్నారు. కార్యకర్తలంతా మహా వృక్షాలవుతారన్న నమ్మకం నాకుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికే జనసేన పార్టీ పెట్టానని - సరదాకి పార్టీ పెట్టలేదని పున‌రుద్ఘాటించారు.