Begin typing your search above and press return to search.

ఎన్నికల తర్వాత జనసేన గ్రాఫ్ లో తేడా ఏంటి?

By:  Tupaki Desk   |   4 Sep 2019 3:32 PM GMT
ఎన్నికల తర్వాత జనసేన గ్రాఫ్ లో తేడా ఏంటి?
X
ప్రదాన ప్రతిపక్ష హోదా దక్కిన తెలుగుదేశం పార్టీకే ఇంకా క్లారిటీ రావడం లేదట. తమ ఓటమికి కారణం ఏమిటో అర్థం కావడం లేదంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ప్రకటనలు చేస్తూ ఉంటారు. నెలలు గడిచిపోతున్నా చంద్రబాబు నాయుడు ఓటమి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినట్టుగా లేరని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఓటమి కన్నా.. చంద్రబాబు నాయుడుకు పార్టీ భవితవ్యం మీద టెన్షన్ పట్టుకుందనే విశ్లేషణలూ వినిపిస్తూ ఉన్నాయి.

అందుకు కారణాలూ లేకపోలేదు. లోకేష్ చేతిలో పార్టీ ఎంత వరకూ సేఫ్ గా ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ అభిమానులకు కూడా అంతుబట్టని మేటర్ గా మారిందట. తెలుగుదేశం సంగతలా ఉంటే.. ఇంతకీ జనసేన పరిస్థితి ఏమిటనేది మరో ఆసక్తిదాయకమైన అంశం.

తెలుగుదేశం పార్టీకి అధినేత తనయుడు ఓటమి పాలై టెన్షన్ పెడుతున్నాడు. జనసేనకు అయితే ఏకంగా అధినేతే ఓడిపోయారు. అది కూడా రెండు చోట్ల! ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీ పై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు.

జనసేన డిపాజిట్ సాధించిన స్థానాలు కూడా కొన్నే. అందులో ఒకే ఒకదాంట్లో విజయం. జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందనుకున్న గోదావరి జిల్లాల్లోనే ఆ పార్టీ కి దక్కింది పెద్దగా ఏమీ లేదు. ఇలాంటి నేపథ్యంలో మొన్నటి వరకూ జనసేన అంటూ ఎవరైనా రాజకీయాల్లో హడావుడి చేసినా వారంతా ఇప్పుడు చప్పున చల్లారిపోయినట్టుగా తెలుస్తోంది.

ప్రజారాజ్యం అనుభవం - ఆ తర్వాత జనసేన అనుభవం.. ఈ పరిణామాల్లో ఇప్పుడప్పుడే మళ్లీ రాజకీయాల్లో జనసేన ప్రస్తావన తెచ్చే ధైర్యం చేయడం లేదు. ఇక పవన్ ప్రభావం గురించి భారీగా అంచనాలు వేసిన వారికి కూడా ఇప్పుడు వాస్తవాలు అర్థమయ్యాయి. దీంతో జనసేన గ్రాఫ్ పూర్తిగా ఫాల్ అయ్యిందని సమాచారం.

పవన్ ను సినీ హీరోగా క్రేజీగా చూసే వారి సంగతేమో కానీ.. రాజకీయంగా మాత్రం ఇక పవన్ ఏదో సాధిస్తాడని నమ్మే వాళ్లు తగ్గిపోతూ ఉన్నారని తెలుస్తోంది. జనసేనను నమ్ముకుని ఏపీలో రాజకీయం చేయాలనుకోవడం దుస్సాహసమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కల్యాణేమో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మళ్లీ పాత మాటలే మాట్లాడుతూ ఉన్నారు. వాటి వల్ల ప్రయోజనం లేదని తేలినా ఆయన తీరులో మార్పు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన గ్రాఫ్ మరింత డౌన్ ఫాల్ అవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.